సెకెండ్ హ్యాండ్ కారు ఇలా అమ్ముడుపోవడం మీరెప్పుడూ చూసి ఉండరు.. దిమ్మతిరిగే లాభం..!

ABN , First Publish Date - 2022-02-14T02:49:25+05:30 IST

సెకెండ్ హ్యాండ్‌గా కారు అమ్మితే సాధారణంగా మనకు నష్టమే వస్తుంది. అమెరికాలోని ఓ వ్యక్తి మాత్రం ఓ పాత కారును ఏడేళ్ల క్రితం తాను కొన్న ధర కంటే ఎక్కువ ధరకు అమ్మి లాభం కూడా గడించాడు!

సెకెండ్ హ్యాండ్ కారు ఇలా అమ్ముడుపోవడం మీరెప్పుడూ చూసి ఉండరు.. దిమ్మతిరిగే లాభం..!

ఇంటర్నెట్ డెస్క్: సెకెండ్ హ్యాండ్‌ కారు అమ్మితే సాధారణంగా మనకు నష్టమే వస్తుంది. కారు పాతబడిపోయిన కారణంగా ఒకప్పుడు కొన్న ధర కంటే తక్కువకే అమ్మాల్సి వస్తుంటుంది. ఇది ఆర్థిక సూత్రాలకు అనుగుణంగా జరిగే లావాదేవీయే. అయితే.. అమెరికాలోని ఓ వ్యక్తి మాత్రం ఓ పాత కారును ఏడేళ్ల క్రితం తాను కొన్న ధర కంటే ఎక్కువ ధరకు అమ్మి లాభం కూడా గడించాడు! 


ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అమెరికాకు చెందిన షాన్ హాలిస్టర్ దాదాపు ఏడేళ్ల క్రితం ఓ హోండా కారును 20414 డాలర్లకు(రూ. 15.74 లక్షలు) కొన్నాడు. ఇటీవలే దాన్ని అమ్మకానికి పెట్టాడు. తన కారుకు ఎటువంటి ప్రమాదాలు జరగలేదని, కారు పెయింటు చెరిగిపోలేదంటూ కారుకు సంబంధించిన పలు వివరాలను నెట్టింట్లో పంచుకున్నాడు. 


ఈ క్రమంలో కారావాన్ అనే ష్టార్టప్ సంస్థ ఈ వివరాల ఆధారంగా షాన్ కారును కొనుగోలు చేసేందుకు ఎంపిక చేసుకుంది. కంపెనీలోని కృత్రిమ మేధ ఆధారంగా నడిచే వ్యవస్థ ఈ నిర్ణయం తీసుకుంది. కారుకు 20,905 డాలర్లు( రూ. 15.84 లక్షలు) చెల్లించవచ్చని సూచించింది. దీంతో.. అతడు కలలో కూడా ఊహించని విధంగా తాను కొన్న ధర కంటే ఎక్కువ ధరకి ఏడేళ్ల క్రితం నాటి కారు అమ్ముడుపోయింది. ‘‘మంచి మైలేజీతో పాటూ కారు మీద ఎటువంటి మరకలు లేకపోవడం, యాక్సిడెంట్లు వంటివి కాకపోవడంతో ఇంత మంచి ధరకు అమ్ముడుపోయినట్టు అనిపిస్తోంది’’ అంటూ షాన్ తన అనుభవాన్ని చర్చావేదిక అయిన రెడిట్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. 


తన కారును కనీసం తనిఖీ కూడా చేయకుండానే కంపెనీ భారీ ఆఫర్ ఇచ్చిందన్నాడు. అంతేకాకుండా.. ఇది జరిగిన కొద్ది రోజులకు అంటే 2021 డిసెంబర్ 14న సంస్థ ప్రతినిధులు కారును తీసుకెళ్లిపోయారు. అప్పుడు కూడా ఎటువంటి తనఖీలు జరగలేదని షాన్ తెలిపాడు. ఎటువంటి అడ్డంకులు లేకుండా చెక్ కూడా క్యాషైపోయిదంటూ అతడు సంబరపడిపోతూ చెప్పొకొచ్చాడు. కాగా.. ఈ కథనం ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Updated Date - 2022-02-14T02:49:25+05:30 IST