బాలికతో ప్రేమాయణం.. యువకుడికి పదేళ్ల జైలు

ABN , First Publish Date - 2022-03-17T23:05:05+05:30 IST

ప్రేమ పేరుతో బాలికను వలలో వేసుకుని ఆపై అత్యాచారం చేసిన యువకుడికి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం..

బాలికతో ప్రేమాయణం.. యువకుడికి పదేళ్ల జైలు

ముంబై: ప్రేమ పేరుతో బాలికను వలలో వేసుకుని ఆపై అత్యాచారం చేసిన యువకుడికి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, యువకుడు మాత్రం ఆమె మైనర్ కాదని అనుకున్నానని కోర్టుకు చెప్పుకొచ్చాడు. 19 ఏప్రిల్ 2014లో ముంబైలోని కురార్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. 13 ఏళ్ల తన కుమార్తె అదృశ్యమైందంటూ ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


 విచారణ చేపట్టిన పోలీసులు బాలికను ఓ యువకుడు కిడ్నాప్ చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ తర్వాత బాలిక పూణెలోని ఓ అపార్ట్‌మెంట్‌లో యువకుడితో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నిందితుడు మాట్లాడుతూ.. తామిద్దరం ప్రేమించుకుంటున్నట్టు చెప్పాడు. కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేకపోతున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందని చెప్పాడు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న సమయంలో ఆమె తన వయసును 18 ఏళ్లు పైనేనని చెప్పిందని గుర్తు చేసుకున్నాడు. 


ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలను అతడు కోర్టుకు సమర్పించాడు. ఆమెను చట్టబద్ధంగానే పెళ్లాడానని, ఆమెను తాను మోసం చేయలేదని, అత్యాచారం కూడా చేయలేదని చెప్పాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే ఆమె ప్రాణాలు కాపాడేందుకే అలా చేశానని చెప్పుకొచ్చాడు. తాను అతడిని పెళ్లి చేసుకున్నట్టు విచారణ సందర్భంగా బాలిక కోర్టుకు తెలిపింది. కాగా, నిందితుడు అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. 


ఆ తర్వాత జరిగిన విచారణలో అదృశ్యమైనప్పుడు బాలిక 8వ తరగతి చదువుతున్నట్టు తేలింది. నిందితుడితో తనకు స్కూల్ ట్రిప్‌లో పరిచయం అయిందని, ఆ తర్వాత అది కాస్త పెరిగి ప్రేమగా మారిందని వివరించింది. అది క్రమంగా శారీరక సంబంధానికి దారితీసినట్టు తెలిపింది. 


వాదనలు విన్న కోర్టు.. నిందితుడు ట్రాప్‌లో పడి తనను తాను నియంత్రించుకోలేకపోయినట్టు కనిపిస్తోందని పేర్కొంది. బాలిక వయసును విస్మరించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నట్టు తెలిపింది. నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు.. అతడి వయసు 30-32 ఏళ్లకు మించి లేదన్న విషయాన్ని గుర్తించింది. అతడికి కఠిన శిక్ష విధిస్తే యవ్వనాన్ని మొత్తం జైలులోనే కోల్పోతాడన్న ఉద్దేశంతో  పోక్సో చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు చెప్పింది.

Updated Date - 2022-03-17T23:05:05+05:30 IST