ఆ వ్యక్తి కోసం గాలిస్తున్న న్యూయార్క్ పోలీసులు..!

ABN , First Publish Date - 2021-04-04T19:47:20+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఆసియా అమెరికన్లపై దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆసియన్లను లక్ష్యంగా చేసుకుని అమెరికన్లు దాడులకు పాల్పడుతున్నారు.

ఆ వ్యక్తి కోసం గాలిస్తున్న న్యూయార్క్ పోలీసులు..!

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఆసియా అమెరికన్లపై దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆసియన్లను లక్ష్యంగా చేసుకుని అమెరికన్లు వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా న్యూయార్క్‌లో రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై దుండగుడు ఉమ్మి వేయడంతో పాటు ఆమె చేతిలో ఉన్న మొబైల్ లాక్కొని నేలకేసి కొట్టాడు. అనంతరం ఆమెతో పాటు ఉన్న ముగ్గురు చిన్నారులపై గట్టిగా అరుస్తూ ఆసియన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మార్చి 30న టైమ్‌స్క్వేర్ సమీపంలో డౌన్‌టౌన్ '5' ట్రైన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.


ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో సదరు వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి ఫొటోను విడుదల చేసిన న్యూయార్క్ పోలీసులు అతడు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఇక ఇటీవల అట్లాంటాలో ఆసియన్ల మసాజ్ పార్లర్లే లక్ష్యంగా దాడికి పాల్పడి ఎనిమిది మందిని పొట్టనబెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. అలాగే న్యూయార్క్​లోనే 65 ఏళ్ల ఏషియన్‌ అమెరికన్‌ వృద్ధురాలిపై ఓ దుండగుడు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల నేపథ్యంలోనే అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆసియన్లపై దాడులను ఇకపై సహించబోయేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.   



Updated Date - 2021-04-04T19:47:20+05:30 IST