Madhyapradesh Journalists: అంబులెన్స్ రాలేదని రోగిని తోపుడుబండిపై ఆసుపత్రికి తీసుకెళ్తే.. జర్నలిస్టులపై కేసులు పెట్టారు!

ABN , First Publish Date - 2022-08-22T22:07:44+05:30 IST

అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఓ వృద్ధుడిని తోపుడుబండిపై ఆసుపత్రికి తరలించిందో కుటుంబం. రాష్ట్రంలోని

Madhyapradesh Journalists: అంబులెన్స్ రాలేదని రోగిని తోపుడుబండిపై ఆసుపత్రికి తీసుకెళ్తే.. జర్నలిస్టులపై కేసులు పెట్టారు!

భిండ్: అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఓ వృద్ధుడిని తోపుడుబండిపై ఆసుపత్రికి తరలించిందో కుటుంబం. రాష్ట్రంలోని వైద్య పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఎత్తిచూపుతూ వార్త రాసిన  ముగ్గురు జర్నలిస్టులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌ (Madhyapradesh)లోని భిండ్‌(Bhind) జిల్లాలో జరిగిందీ  ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అనారోగ్యంతో బాధపడతున్న గయా ప్రసాద్ (76)ను ఆసుపత్రికి తరలించేందుకు ఆయన కుటుంబం అంబెలెన్స్ కోసం ప్రయత్నించింది. ఫలితం లేకపోవడంతో తోపుడు బండిపై ఆయనను ఆసుపత్రికి తరలించారని, బాధిత వృద్ధుడికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అందడం లేదంటూ ఆగస్టు 15న వార్త ప్రచురితమైంది.


ఈ వార్తపై స్పందించిన జిల్లా యంత్రాంగం.. రెవెన్యూ, ఆరోగ్యశాఖ అధికారులతో వెంటనే ఓ కమిటీ నియమించి నిజానిజాలు నిగ్గుతేల్చాలని ఆదేశించింది. విచారణ జరిపిన కమిటీ అది తప్పుడు వార్త అని స్పష్టం చేసింది. అసలు తాను అంబులెన్స్‌కే ఫోన్ చేయలేదని గయా ప్రసాద్ కుమారుడు పూరన్ సింగ్ కమిటీకి తెలిపాడు. అలాగే, తన తండ్రికి వృద్ధాప్య పింఛన్ వస్తోందని, తాము ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందుతున్నామని కమిటీకి తెలిపాడు. అంతేకాదు, తన తండ్రిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లలేదని, ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని చెప్పాడు. దీంతో జర్నలిస్టులు రాసిన ఆ వార్త పూర్తిగా తప్పడు కథనమని కమిటీ తేల్చింది.


కమిటీ నివేదిక అందిన వెంటనే ఆరోగ్య శాఖ అధికారి రాజీవ్ కౌరవ్.. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వార్తను ప్రచురించారంటూ ముగ్గురు జర్నలిస్టులు కుంజ్‌బిహారి కౌరవ్, అనిల్ శర్మ, ఎన్‌కే భటేల్‌పై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జర్నలిస్టు అనిల్ శర్మ మాట్లాడుతూ.. గయా ప్రసాద్ కుటుంబ సభ్యులను జిల్లా అధికారులు ఒత్తిడి చేసి అలా చెప్పించారని ఆరోపించారు. వారి కుటుంబానికి అందుతున్న ప్రభుత్వ పథకాలను ఆపేస్తామని బెదిరించడంతోనే వారు అలా చెప్పారన్నారు. తప్పుడు ఆధారాలతో తనపై కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 


మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత డాక్టర్ గోవింద్ సింగ్ కూడా జిల్లా అధికారులపై మండిపడ్డారు. గయా ప్రసాద్ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి జర్నలిస్టులకు వ్యతిరేకంగా చెప్పించి కేసులు పెట్టించారని ఆరోపణలు చేశారు. మీడియా గొంతును అణచివేసే చర్యల్లో ఇది కూడా ఒకటని, జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు  కాంగ్రెస్ పోరాడుతుందని హెచ్చరించారు. జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని అధికార బీజేపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు రమేశ్ దూబే కూడా తప్పుబట్టారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-08-22T22:07:44+05:30 IST