Dubai: మానవత్వం మరిచిన యజమాని.. ఇంట్లో పనిమనిషిపై 6నెలల పాటు అదే పనిగా..

ABN , First Publish Date - 2022-09-04T17:50:30+05:30 IST

మానవత్వం మరిచిన ఓ యజమాని తన ఇంట్లో పనిచేసే పనిమనిషి (Housemaid) పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఆరు నెలల పాటు ఆమెకు నరకం చూపించాడు.

Dubai: మానవత్వం మరిచిన యజమాని.. ఇంట్లో పనిమనిషిపై 6నెలల పాటు అదే పనిగా..

దుబాయ్: మానవత్వం మరిచిన ఓ యజమాని తన ఇంట్లో పనిచేసే పనిమనిషి (Housemaid) పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఆరు నెలల పాటు ఆమెకు నరకం చూపించాడు. ఆరు నెలలు అదే పనిగా ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించాడు. దాంతో ఆమె చనిపోయింది. ఈ అమానవీయ ఘటన దుబాయ్‌ (Dubai)లో రెండేళ్ల క్రితం జరిగింది. తాజాగా ఈ కేసు దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చింది. దోషిగా తేలిన ఆ యజమానికి న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. తన వికృతచేష్టలతో పనిమనిషిని తీవ్రంగా హింసించి ఆమె మృతికి కారణమైనందుకు అతడికి కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 


కోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ఉండే ఓ వ్యక్తి వద్ద ఆసియాకు చెందిన ఓ మహిళ 2019 అక్టోబర్‌లో పనిమనిషిగా చేరింది. మొదటి ఐదు నెలలు ఆమెను బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత ఇంటి యజమాని తనలోని మృగాన్ని బయటపెట్టాడు. పనిమనిషిని ప్రతీరోజు తీవ్రంగా హింసించి (Torture) పైశాచిక ఆనందం పొందేవాడు. ఆమెను ఇష్టానుసారంగా కొట్టడం, మాటలతో మానసికంగా వేధించడం చేసేవాడు. అతడిలో ఈ పైశాచికత్వం రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. ప్రతిరోజు ఆమెను హింసించడం, భోజనం పెట్టకపోవడం చేశాడు. దాంతో ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. అలా ఆరు నెలల పాటు ఆమె యజమాని వేధింపులు భరించింది. 


చివరకు అతగాడి హింసను తట్టుకోలేక ఒకరోజు కుప్పకూలింది. దాంతో వెంటనే ఆమెను యజమాని సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించాడు. ఆమె శరీరంపై ఉన్న గాయాలను చూసిన ఆస్పత్రి యాజమాన్యం అనుమానంతో పోలీసులకు సమాచారం అందించింది. దాంతో ఆ దుర్మార్గపు యజమాని బండారం బయటపడింది. పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో పోలీసులు యజమానిని దుబాయ్ కోర్టులో హాజరుపరిచారు. 


న్యాయస్థానంలో కూడా తన నేరాన్ని అంగీకరించిన అతడికి మరణశిక్ష పడింది. అయితే, మృతిరాలి కుటుంబానికి నిందితుడి ఫ్యామిలీ 'బ్లడ్‌మనీ' (హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి పరిహారంగా డబ్బు చెల్లించడం) చెల్లించింది. దాంతో బాధితురాలి కుటుంబం మరణశిక్షను రద్దు చేయించింది. ఆ తర్వాత ఈ కేసు తాజాగా దుబాయ్ అప్పీల్ కోర్టుకు వచ్చింది. యజమానికి ఉరిశిక్షను రద్దు చేసిన న్యాయస్థానం 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.   



Updated Date - 2022-09-04T17:50:30+05:30 IST