భార్య జ్ఞాపకాలను ఇలా పదిలం చేసిన భర్త...

ABN , First Publish Date - 2020-09-11T21:57:29+05:30 IST

ఫైబర్, రబ్బర్, తదితర వస్తువులతో మణియమ్మాళ్ విగ్రహం తయారు చేయించానని..

భార్య జ్ఞాపకాలను ఇలా పదిలం చేసిన భర్త...

మదురై: నూరేళ్లూ కలిసి ఉంటామని పెళ్లినాడు ప్రమాణం చేసిన భార్యాభర్తల్లో ఒకరు ముందు పోయి, మరొకరు మిగిలితే అంతకంటే నరకం మరొకటి ఉండొదు. ముదిమి వయసులో ఇలాంటివి జరిగితే ఆ  బాధ మరీ ఎక్కువ. గత జ్ఞాపకాలను మరిచిపోలేక, తోడులేని బ్రతుకు భారమనిపిస్తుంటుంది. కొందరు గుండె దిటవు చేసుకుని ఆ జ్ఞపకాలతోనే బతికినంత కాలం బతికేస్తుంటారు.


తమిళనాడులోని మదురైకి చెందిన ఓ వ్యాపారి ఇటీవలే కాలం చేసిన తన భార్య జ్ఞాపకార్ధం ముమ్మూర్తులా ఆమెను పోలిన 6 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించాడు. తన నివాసంలోనే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆమె పట్ల తనకున్న ఆరాధనా భావాన్ని చాటుకున్నాడు. చివరి వరకూ ఆమెతోనే తన ఆశ, శ్వాస అంటున్నాడు.


సేతురామన్, పిచైమణియమ్మాళ్ దంపతుల్లో పిచైమణియమ్మాళ్ సరిగ్గా 30 రోజుల క్రితం కన్నుమూసింది. దీనిపై సేతురామన్ మాట్లాడుతూ... 'నా శ్రీమతి అంటే నాకు చాలా ఇష్టం. ఆమెను విడిచి ఎప్పుడూ ఉండలేదు. నెల రోజుల క్రితం ఆమె స్వర్గస్థురాలు కావడంతో నా సర్వం కోల్పోయినట్లయింది. ఆమె జ్ఞాపకాలను పదిలం చేసేందుకు నా నివాసంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశాను. జీవితాంతం ఆమెతోనే ఉంటాను' అని తెలియజేశాడు.


ఫైబర్, రబ్బర్, తదితర వస్తువులతో మణియమ్మాళ్  విగ్రహం తయారు చేయించానని, చెక్కుచెదరని విధంగా, చాలాకాలం ఉండేలా ఈ విగ్రహం రూపకల్పన జరిగిందని  సేతురామన్ చెప్పాడు. విగ్రహానికి వాడిన రంగులు కనీసం 50 ఏళ్ల వరకూ వెలిసిపోవంటూ ఆమె జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.

Updated Date - 2020-09-11T21:57:29+05:30 IST