యూఎస్ కాపిటల్ భవనం వద్ద బాంబు కలకలం.. నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-20T22:05:40+05:30 IST

అమెరికా రాజధానిలోని కాపిటల్ భవనం వద్దతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు ప్రకటించి.. అలజడికి కారణమైన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అమెరికన్లు ఊపిరి పీల్చుకు

యూఎస్ కాపిటల్ భవనం వద్ద బాంబు కలకలం.. నిందితుడి అరెస్ట్

వాషింగ్టన్: అమెరికా రాజధానిలోని కాపిటల్ భవనం వద్దతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు ప్రకటించి.. అలజడికి కారణమైన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అమెరికన్లు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ భవనం వద్ద ఓ దుండగుడు గురువారం రోజు ట్రక్కును నిలిపివేశాడు. అనంతరం ఆ ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అంతేకాకుండా అఫ్ఘానిస్థాన్ విషయంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అతడు తప్పుపట్టాడు.


భద్రతా దళాలను తనపై ప్రయోగిస్తే.. భారీ విధ్వంసం తప్పదని హెచ్చరించాడు. ట్రక్కులో ఉన్న బాంబుతోపాటు మరో నాలుగు చోట్ల పెట్టిన పేలుడు పదార్థాలను పేలుస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఓ వైపు సదరు దుండగుడితో చర్చలు జరుపుతూనే.. మరోవైపు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. సుమారు 5 గంటలపాటు చర్చలు జరిపిన తర్వాత ఆ నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. కాగా.. పోలీసులు ఆ నిందితుడిని ఫ్లాయిడ్ రే రోస్​బెర్రీ(49)గా గుర్తించారు. ఇదిలా ఉంటే.. ట్రక్కులో నిజంగానే పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-08-20T22:05:40+05:30 IST