అక్షరాలా నిజమైంది.. కలలో వచ్చిన అంకెలే.. రూ.25కోట్లు తెచ్చిపెట్టాయి..!

ABN , First Publish Date - 2021-12-10T17:57:50+05:30 IST

నిద్రలో సాధారణంగా మనం చాలా కలలు కంటాం. అందులో కొన్ని మనల్ని భయపెడితే.. మరికొన్ని సంతోష పెడతాయి. తీరా నిద్ర లేవగానే అవన్నీ మర్చిపోయి.. మన పనిలో మనం బిజీ అయిపోతాం. కలల కనిపించిన వాటి గురించి పెద్దగా పట్టించుకోం.

అక్షరాలా నిజమైంది..  కలలో వచ్చిన అంకెలే.. రూ.25కోట్లు తెచ్చిపెట్టాయి..!

ఇంటర్నెట్ డెస్క్: నిద్రలో సాధారణంగా మనం చాలా కలలు కంటాం. అందులో కొన్ని మనల్ని భయపెడితే.. మరికొన్ని సంతోష పెడతాయి. తీరా నిద్ర లేవగానే అవన్నీ మర్చిపోయి.. మన పనిలో మనం బిజీ అయిపోతాం. కలల కనిపించిన వాటి గురించి పెద్దగా పట్టించుకోం. కానీ ఓ వ్యక్తి మాత్రం.. నిద్రలో వచ్చిన కలను బలంగా నమ్మాడు. దీంతో కలలో వచ్చిన అంకెలే అతడిని కోటీశ్వరుడిని చేశాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తికి లాటరీ టికెట్లు కొనుగోలు చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలో ప్రతివారం ఆయన లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ.. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటాడు. దీంతో ఎప్పటిలాగే ఆయన తన వద్ద ఉన్న డబ్బుతో తాజాగా ఓ రోజు లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలోనే లాటరీ నిర్వాహకులు డిసెంబర్ 5న డ్రా నిర్వహించారు. అందులో సదరు వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా 3.4 మిలియన్ అమెరికన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.25.71కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేనూ నా భార్య ఇప్పటికీ చాలా కష్టపడుతున్నాం. ఇకపై మేము కష్టపడాల్సిన అవసరం లేదు. లాటరీలో గెలుచుకున్న డబ్బుతో మా పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాం. అలాగే జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఉపయోగిస్తాం’ అని పేర్కొన్నాడు. అంతేకాకుండా.. లాటరీలో పెద్ద మొత్తంలో తాను డబ్బు గెలుచుకున్నట్టు కొన్నేళ్ల క్రితం కలగన్నానని ఆయన వెల్లడించాడు. కలలో వచ్చిన నెంబర్ల ఆధారంగానే లాటరీ టికెట్లు కొనుగోలు చేశానని తెలిపాడు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్నట్టు వివరించాడు. ఇదిలా ఉంటే.. సదరు వ్యక్తి గెలుపొందిన మొత్తాన్ని ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా చెల్లిస్తారని సమాచారం. ఏడాదికి 14,352 డాలర్ల చొప్పున 20ఏళ్లపాటు.. ఆయనకు ఆ సొమ్మును లాటరీ నిర్వహాకులు ముట్టజెప్తారని స్థానిక మీడియా పేర్కొంది.




Updated Date - 2021-12-10T17:57:50+05:30 IST