మానాన్న తాగాడు.. అందుకే నేనూ!

ABN , First Publish Date - 2021-12-04T05:41:42+05:30 IST

పెద్దలు చేసే తప్పులే పిల్లలతో పొరబాటు చేయిస్తాయి. పిల్లల తప్పులను సరిదిద్దాల్సింది కుటుంబం, పాఠశాల. కానీ కుటుంబ పెద్ద మద్యానికి బానిసయ్యాడు.

మానాన్న తాగాడు.. అందుకే నేనూ!

  1. పాఠశాలలో మద్యం సేవించిన విద్యార్థులు
  2. టీసీలు ఇచ్చి పంపించిన ప్రధానోపాధ్యాయుడు
  3. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో ఘటన


ఆత్మకూరు, డిసెంబరు 3: పెద్దలు చేసే తప్పులే పిల్లలతో పొరబాటు చేయిస్తాయి. పిల్లల తప్పులను సరిదిద్దాల్సింది కుటుంబం, పాఠశాల. కానీ కుటుంబ పెద్ద మద్యానికి బానిసయ్యాడు. కొడుకు ఆ ప్రభావానికి లోనై మద్యం తాగాడు. అతడికి మరో నలుగురు స్నేహితులు తోడయ్యారు. పాఠశాల హెచ్‌ఎం వాళ్లకు టీసీలు ఇచ్చి పంపించేశారు. ఈ ఘటన ఆత్మకూరు పాఠశాలలో చోటుచేసుకుంది.


ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు గురువారం మధ్యాహ్న భోజన సమయంలో రెండు మద్యం సీసాలను తెచ్చుకుని తాగేశారు. వాళ్ల ప్రవర్తనలో మార్పును తోటి విద్యార్థుల ద్వారా తెలుసుకున్న ఉపాధ్యాయులు వాళ్లను హెడ్మాస్టర్‌ గదికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వారి తల్లిదండ్రులను పిలిపించారు. తల్లిదండ్రుల సమక్షంలో మద్యం సీసాలు ఎక్కడివని హెడ్మాస్టరు, టీచర్లు ప్రశ్నించారు. తెలిసిన వాళ్లకు డబ్బులిస్తే మద్యం తెచ్చిచ్చారని ఓ విద్యార్థి చెప్పాడు. మద్యం ఎందుకు తాగాలనిపించిందని అడిగితే.. ప్రతిరోజూ తన తండ్రి ఫుల్‌బాటిల్‌ తెచ్చుకుని తాగుతాడని, ఆయన్ని చూసి తనకూ తాగాలనిపించిందని ఓ విద్యార్థి చెప్పాడు. దీంతో టీచర్లు అవాక్కయ్యారు. ఆ విద్యార్థి తండ్రి ప్రభావానికి లోనుకావడం, మిగతా నలుగురు విద్యార్థులు తోడవ్వడం వల్ల ఇలా జరిగిందని ఉపాధ్యాయులు గ్రహించారు. హెడ్మాస్టర్‌ ఆ పిల్లలను మందలించి తల్లిదండ్రుల సమక్షంలో టీసీలిచ్చి ఇళ్లకు పంపించేశారు. దీంతో వారి భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. పెద్దలు చేసిన తప్పుకు పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


మిగతా విద్యార్థులు చెడిపోతారని టీసీలిచ్చేశాం:


తరగతి గదిలో మద్యం సేవించిన విద్యార్థులను చూసి మిగతావాళ్లు కూడా దారితప్పే ప్రమాదం ఉంది. అందుకే వాళ్లకు టీసీలిచ్చి పంపించేశాం. పైగా ఆ విద్యార్థులు ఇక్కడే ఉంటే మిగతా పిల్లలు వారినిహేళన చేయవచ్చు. ఆ పిల్లల్ని పాఠశాలలో ఉండనిస్తే ఎలాంటి తప్పు చేసినా ఏమనరనే భావనకు విద్యార్థులందరూ లోను కావచ్చు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చాం. పిల్లలకు టీసీలు ఇచ్చాం. 


- సక్రూనాయక్‌, హెచ్‌ఎం 

Updated Date - 2021-12-04T05:41:42+05:30 IST