Manchiryala Congress: ఓదెలు ఒంటరవుతున్నారా?

ABN , First Publish Date - 2022-09-04T00:43:26+05:30 IST

జిల్లా కాంగ్రెస్‌ నేతల మధ్య ఏమాత్రం సఖ్యత కుదరడం లేదట. మొన్నామధ్య అధికార టీఆర్ఎస్‌ నుంచి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల అండ్‌ టీమ్‌ కాంగ్రెస్‌లోకి చేరడంతో పోరు మరింత తారాస్థాయికి చేరుతోందటజిల్లా కాంగ్రెస్‌ నేతల మధ్య ఏమాత్రం సఖ్యత కుదరడం లేదట. మొన్నామధ్య అధికార టీఆర్ఎస్‌ నుంచి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల అండ్‌ టీమ్‌ కాంగ్రెస్‌లోకి చేరడంతో పోరు మరింత తారాస్థాయికి చేరుతోందట..

Manchiryala Congress: ఓదెలు ఒంటరవుతున్నారా?

మంచిర్యాల (Manchiryala): జిల్లా కాంగ్రెస్‌ (Congress) నేతల మధ్య ఏమాత్రం సఖ్యత కుదరడం లేదట. మొన్నామధ్య అధికార టీఆర్ఎస్‌ నుంచి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల  (Nallala Odelu) అండ్‌ టీమ్‌ కాంగ్రెస్‌లోకి చేరడంతో పోరు మరింత తారాస్థాయికి చేరుతోందట. ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరిన ఓదెలు దంపతులకు ఆ సంబురం మూణ్నాళ్ల ముచ్చటగా తయారైందట. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ నాయకత్వం సహాయ నిరాకరణ చేస్తుండడంతో ఓదెలు ఒత్తిడికి లోనవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. చాలా మంది సీనియర్లు మౌనం దాల్చడం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి దూరంగా ఉంటుండటంతో ఓదెలు ఇబ్బందులు పడుతున్నారట. 


తాజాగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగ్గా అది కాస్తా వర్గపోరును బహిర్గతం చేసింది. డీసీసీ ప్రెసిడెంట్ సురేఖ (Dcc President Surekha) అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి (Rohit Chaudari)తో పాటు పీసీసీ పరిశీలకులు హాజరయ్యారు. జిల్లా నేతలు మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు సహా నేతలంతా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ఓదెలు, సతీమణి భాగ్యలక్ష్మీ కూడా అనుచరులతో హాజరయ్యారు. అయితే సమావేశానికి సంబంధించిన సమాచారం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఓదెలు దంపతులు బాయ్‌కాట్ చేయడంతో కలకలం రేగింది. అంతేకాదు ప్రేమ్‌సాగర్‌రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్‌ (Trs)తో కుమ్మక్కై.. కాంగ్రెస్‌ను నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా.. చెన్నూరు టీఆర్ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ (Mla Balka Suman)తో ప్రేమ్ సాగర్‌ మిలాఖత్ అయి కాంగ్రెస్‌ను దెబ్బ తీస్తున్నారని ఓదెలు బహిరంగంగానే ఆరోపించడం హాట్‌ టాపిక్‌గా మారింది.



ఇక ఓదెలు చేసిన ఆరోపణలు మంచిర్యాల జిల్లాలో సంచలనం రేపాయి. ఓదెలు కామెంట్స్‌పై జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ సురేఖ సీరియస్ అయ్యారు. అనుచిత ఆరోపణలు చేసిన ఓదెలుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి ఫిర్యాదు చేయడంతో చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి.. టీఆర్ఎస్‌లో రాజకీయ భవిష్యత్ లేదన్న అంచనాకు వచ్చిన నల్లాల ఓదెలు ఏడాది కాలం నుంచే ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. బీజేపీ లేదా కాంగ్రెస్‌లో చేరడం ఖాయమన్న వార్తలు వెలువడ్డాయి. ఒక దశలో ఓదెలు ఖండించినప్పటికీ చివరికి నాలుగు నెలల క్రితం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహతో కలిసి ఢిల్లీ వెళ్లి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలో జిల్లా నేతలు ఎవరూ ఓదెలు వెంట వెళ్ళలేదు. పార్టీలో చేరే సమాచారాన్ని కూడా ఓదెలు గోప్యంగా ఉంచారు. దీంతో.. ప్రేమ్ సాగర్ గుర్రుగా ఉన్నట్లు అప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. 



ఇదిలావుంటే చెన్నూరు కాంగ్రెస్‌లో చాన్నాళ్లుగా నాయకత్వ లోపం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బొర్లకుంట వెంకటేష్.. ఆ తర్వాత కారెక్కి ఎంపీగా గెలిచారు. నాటినుంచి చెన్నూరు కాంగ్రెస్‌కు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. స్థానిక నేతలు అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. అవేవీ.. బాల్క సుమన్‌ను ఢీకొట్టే స్థాయిలో లేకపోవడంతో అధిష్టానం ఓదెలును చేర్చుకుంది. ఓదెలు చేరిన తర్వాత టీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలంతా ఆయన వెంట క్యూ కడతారని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు టీఆర్ఎస్ నేతలెవరూ ఓదెలుకు బహిరంగ మద్దతు ప్రకటించలేదు. ఒకప్పటి అనుచరులు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో హవా నడిపిన వాళ్ళు సైతం అంటీ ముట్టనట్టు ఉంటున్నారట. ఈ నేపథ్యంలో మండలాల్లోని కొందరు నేతలతో ఓదెలు స్వయంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వారెవరూ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోలేమని ఎన్నికల వరకు వేచి చూద్దామని మాట దాట వేస్తున్నారట.



కాంగ్రెస్ నుంచి ఆశించిన మద్దతు లేకపోవడం, వెంట వస్తారనుకున్న వాళ్ళు కూడా వెనుకా ముందు ఆలోచిస్తుండడంతో ఓదెలు జీర్ణించుకోలేక పోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తంగా క్యాడర్‌ను బలోపేతం చేసుకోవడంపై ఓదెలు దృష్టి సారిస్తున్నారట. అయితే..  కాంగ్రెస్ ఎత్తుగడలను గమనిస్తున్న బాల్క సుమన్.. క్యాడర్ చేజారకుండా జాగ్రత్తపడుతున్నారట. ఓదెలు పని తనం ఏంటో ప్రజలకు తెలుసని.. ఆయన్ను నమ్మి కాంగ్రెస్‌లోకి వెళ్లే వారు పెద్దగా ఉండరన్న ధీమాతో సుమన్ ఉన్నారట. ఏదేమైనా కాంగ్రెస్‌తోపాటు అనుచరుల పరిస్థితి ఇలాగే ఉంటే ఓదెలు ఒంటరి పోరాటం తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు కాంగ్రెస్‌ క్యాడర్‌ సపోర్ట్‌ లేకపోవడం, నా అనుకున్నవాళ్లు సైలెంట్‌గా ఉంటుండడంతో రాబోయే రోజుల్లో ఓదెలు ఎలా ముందుకెళ్తారో చూడాలి మరి.



Updated Date - 2022-09-04T00:43:26+05:30 IST