రాజ్యాధికార సాధన పోరాటం మొదలైంది

ABN , First Publish Date - 2021-02-28T05:17:45+05:30 IST

రాజ్యాధికార సాధన పోరాటం మొదలైంది

రాజ్యాధికార సాధన పోరాటం మొదలైంది
సమావేశంలో మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ

వర్గీకరణ అంతిమ విజయానికి చేరువలో ఉన్నాం..

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

భూపాలపల్లిటౌన్‌, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో రాజ్యాధికార సాధన పోరాటం మొదలైందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. భూపాలపల్లిలోని దేవి ఫంక్షన్‌ హాల్‌లో శనివారం ఎమ్మార్పీఎస్‌, మహాజన సోషలిస్టు పార్టీ అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ గత 27 సంవత్సరాల ఉద్యమ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్‌ అనుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నామని తెలిపారు. ఇందుకు రుజువు ఇటీవల సుప్రీంకోర్టు ప్రకటనేనని స్పష్టం చేశారు. 2004లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు 2020లో వర్గీకరణ సరైందేనని, దానిని తేల్చుకునే అవకాశం రాష్ట్రాలకే ఇచ్చిందని అన్నారు. ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తమ వర్గానికి న్యాయం చేయబోతోందని అన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మార్పీఎస్‌ ఎంఎస్‌పీగా అవతరించి రాజ్యాధికారం కోసం మరో పోరాటానికి ముందుకు సాగనుందని చెప్పారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించి జయశంకర్‌ సార్‌తో కలిసి పనిచేసి ఉద్యమాన్ని ఉధృతం చేసేలా చేశామని చెప్పారు. 

కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ తమకు పూర్తిగా మోసం చేశాయని మంద కృష్ణమాదిగ పలు ఉదాహరణలతో చెప్పారు. అధికారం, పలుకుబడి ఉపయోగించి ఎన్నో సంస్కరణలు చేస్తున్న బీజేపీ తలుచుకుంటే... 24 గంటల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించవచ్చని చెప్పారు. అలాగే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మోసం చేశాయని అన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక దళితుడు సీఎం కాలేదని, మూడు ఎకరాల భూమి లేదని, 11 ఎస్సీ ఎమ్మెల్యేలు ఉంటే ఒకరికి కూడా మంత్రి పదవి లేదని ధ్వజమెత్తారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు సూరన్న, బొల్లి బాబు, అంబాల చంద్రమౌళి, మంద రాజు, అంతడుపుల సురేష్‌, భట్టు విజయ్‌, కుమార్‌, స్వామి, సాంబయ్య, కృష్ణ, రవీందర్‌, తిరుపతి, భిక్షపతి, సీకాసం నాయకులు పోశం, కొంరయ్య, శంకర్‌, యాకోబ్‌, సారయ్య, సమ్మయ్య, వివిధ సంఘాల నాయకులు ఎంవీ రావు, క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T05:17:45+05:30 IST