ఆంధ్రజ్యోతిపై జరిగిన దాడిని సమర్థిస్తా.. మా ఆత్మగౌరవంపై దాడి జరిగింది కాబట్టే..

Published: Wed, 13 May 2020 15:39:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆంధ్రజ్యోతిపై జరిగిన దాడిని సమర్థిస్తా.. మా ఆత్మగౌరవంపై దాడి జరిగింది కాబట్టే..

నిజంగా పోరాడుతున్నది విద్యార్థులే

జేఏసీలో అందరూ అగ్రవర్ణాల వారే

కాంగ్రెస్‌ పార్టీని నెనెన్నడూ విశ్వసించలేదు

దళితుడిని కాబట్టే పార్టీలు దూరం చేశాయి

చంద్రబాబు దిగొచ్చి మా ఆత్మగౌరవ సభకు హాజరయ్యారు

చచ్చేవరకు పేదల ప్రయోజనాల కోసం పోరాడతా..

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో మందకృష్ణ మాదిగ


మంద కృష్ణ మాదిగ. పేరు చివర మూడక్షరాలతో దళిత ఉద్యమానికి ఆత్మగౌరవం సమకూర్చిన నాయకుడు. అణగారిన వర్గాల్లోనూ అసమానతలు ఉన్నాయంటూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తెరపైకి తీసుకొచ్చారు. తాజాగా తెలంగాణ ఉద్యమంలో సామాజిక వాటా కోసం నినదిస్తున్నారు. ‘‘అన్నం లేకపోయినా బాధపడలేదు గానీ ఆత్మగౌరవం దెబ్బతింటే తట్టుకోలేకపోయాను. అందుకే ఉద్యమంలోంచి బయటకు వచ్చా.. సత్యమూర్తినీ విడిచిపెట్టా. అసెంబ్లీ ముట్టడి హెచ్చరికతో చంద్రబాబు దిగొచ్చి మా ఆత్మగౌరవ సభకు హాజరయ్యారు. దళితుణ్ని కావడం వల్లే పార్టీలు నన్ను దూరం పెట్టాయి. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చాం. కానీ, కేసీఆర్‌ సహా ఏ నాయకుడికీ విద్యార్థి ఉద్యమం బలపడటం ఇష్టం లేదు. ఈ ఉద్యమంలో ఎవరి ప్రయోజనాలు వారికున్నాయి. తెలంగాణ కోసం నిజంగా పోరాడుతున్నది విద్యార్థులే. జేఏసీలో అందరూ అగ్రవర్ణాల వారే. దీన్ని ప్రశ్నించినందుకే నాపై గుర్రు. చచ్చేవరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణ పేదల ప్రయోజనాల కోసమూ పోరాడతా’’ అంటున్న మంద కృష్ణ మాదిగతో 15-02-2010న జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే... విశేషాలు


ఆర్కే: వెల్‌కమ్‌ మందకృష్ణ గారూ. మనం తొలిసారి కలుస్తున్నాం. గత ఏడాదిన్నర క్రితం జరిగిన సంఘటనలు, ఆంధ్రజ్యోతి మీద ఎమ్మార్పీఎస్‌ దాడి, ఆ నేపథ్యంలో ఈ ప్రోగ్రాంలో ఇలా కలవడాన్ని మీరెలా ఫీలవుతున్నారు?

మందకృష్ణ మాదిగ: ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలతో ఒక పెద్ద ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ తర్వాత కలయిక రావడం అనుకోని సంఘటన, చాలా సంతోషం.


ఆర్కే: మీ కుటుంబ నేపథ్యమేంటి?

మందకృష్ణ మాదిగ: వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని హంటర్‌ రోడ్‌ షాంపేట్‌. మా తల్లిదండ్రులు చిన్నకొమరయ్య, కొమరమ్మ. మేం పదిమంది. నేను చివరివాణ్ని. నేను పది వరకు చదివాను. ఇంటర్‌లోకి వెళ్లేటపుడు గ్రామాల్లో వివక్ష కనిపించేది. ఓసారి ఊరొచ్చేసరికి ఓ మాల సోదరుణ్ని కొట్టి బజార్లో పడేశారు. తమ బంధువుల అమ్మాయిని ఇబ్బందిపెడుతున్నారేమని ప్రశ్నించినందుకు ఆ గతి పట్టింది. అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్తే, అక్కడ మామీదా దాడి జరిగింది. తర్వాత హైదరాబాద్‌ నుంచి వస్తూ సంతోష్‌ అనే అబ్బాయి టీషర్టు, ప్యాంటు వేసుకున్నాడని అతణ్నీకొట్టారు. దీన్నెదుర్కోవాలని యువకులమంతా కలిసి వాళ్లని పిలిపించాలనుకున్నాం. వాళ్లు వందల మంది వచ్చారు. లోపలకు రాగానే చుట్టుముట్టి కొట్టాం. వాళ్ల ప్రాంతం వరకు పరిగెత్తించి కొట్టాం. రాడికల్‌ యువజన సంఘంతో పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పుడే అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లాం.


ఆర్కే: అసలుపేరు ఎల్లయ్య కదా.. మంద కృష్ణగా ఎలా మారారు?

మందకృష్ణ మాదిగ: అమ్మా నాన్నా పెట్టిన పేరు ఏలియా. అది క్రిస్టియన్‌ పేరని స్కాలర్‌షిప్‌ రాదని ఎల్లయ్యగా మార్చారు. రాడికల్స్‌, పీపుల్స్‌ వార్‌ సంబంధాల తర్వాత జనగామ ఆర్గనైజర్‌గా నన్ను పంపారు. నేనోసారి వరంగల్‌కు వచ్చా. నా దగ్గర తపంచా ఉండేది. తీగరాజుపల్లెలో తపంచా తుడుస్తున్నపుడు షెల్టర్‌ ఇచ్చిన వ్యక్తి గమనించి, నన్ను వెళ్లనివ్వకుండా సినిమాకు తీసుకెళ్లారు. బయటికొచ్చేసరికి పోలీసులు పట్టుకున్నారు.

               

ఆర్కే: పీడబ్ల్యుజీలో ఉన్నపుడు కూడా మీమీద కొన్ని ఆరోపణలొచ్చాయంటారు?

మందకృష్ణ మాదిగ: అది ఏనాడూ లేదు. ఆత్మగౌరవం కోసమే బయటకొచ్చాను. ఓసారి అప్పుల వాళ్లు మాదిగ అబ్బాయికి రెండువేలు అప్పిస్తే రిక్షా కొనుక్కుని తొక్కుకునేవాడు. అతడికి టీబీ రావడంతో డబ్బు కట్టలేక, రిక్షా అమ్ముకున్నాడు. ఐదారొందలు అప్పుండగా మరో రిక్షా కొనుక్కున్నాడు. అప్పిచ్చిన వ్యక్తి (మావోయిస్టుల సానుభూతిపరుడు) ఆ రిక్షా లాక్కుని, బట్టలిప్పి ఇంటికి తీసుకొచ్చాడు. అది తట్టుకోలేకపోయాను. వాళ్లని మళ్లీ పిలించాను. అతడు తప్పు ఒప్పుకుని, అన్నల వద్దకు వెళ్లి దానికి కారణం ఎల్లయ్యేనని, పంచాయితీలు చేస్తున్నానన్నాడు. అదీ ఆరోపణ. ఓసారి నేను ఇంట్లో ఉండగా చుట్టుముట్టి బయటకు పిలిచారు. రాగానే ఆశన్న.. నువ్వింకా పంచాయితీలు చేస్తావురా అంటూ కొట్టాడు. తర్వాత మిగిలినవాళ్లూ కొట్టారు. తర్వాత పురుషోత్తంరావుగారు జీవితం ఇచ్చారు. దూరం వెళ్లిపొమ్మని సలహా ఇచ్చారు. అపుడే సత్యమూర్తిగారు ఉద్యమం నుంచి బయటకొచ్చి సమతా వాలంటరీ ఫోర్స్‌ మొదలుపెట్టారు. నేను ఆయన దగ్గరకు వెళ్లి, పరిచయం చేసుకున్నా. నీ పేరేంటి అన్నారు. అండర్‌గ్రౌండ్‌లో నా పేరు కిషన్‌. ఆయన కృష్ణా అన్నారు. అదే నా పేరు అయిపోయింది.


ఆర్కే: వర్గీకరణ ఉద్యమం ఎందుకు మొదలుపెట్టారు?

మందకృష్ణ మాదిగ: అపుడు చీమకుర్తి ఘటన జరిగింది. అక్కడ దళితుల ఆత్మగౌరవ ఉద్యమం నిర్మించాను. 9 నెలలు మాలపల్లిలో పడుకున్నా. తర్వాత ఏబీసీడీ వర్గీకరణ ప్రసక్తి సత్యమూర్తి వద్ద తెస్తే.. పరిష్కారం మన చేతుల్లో కాదు, ప్రభుత్వం చేతుల్లో ఉందన్నారు. నేను పదే పదే వెంటపడితే రెండేళ్ల తర్వాత ఓ మాట చెప్పారు. ఇప్పుడీ సమస్యను పట్టించుకుంటే మాలలు దూరమవుతారన్నారు. దాంతో బయటకు వెళ్లిపోయాను. ఈదుమూడిలో ఉద్యమాన్ని మొదలు పెట్టాను. 1994 జూలై 7న ఎమ్మార్పీఎస్‌ మొదలుపెట్టా. హైదరాబాద్‌లో 1996 మార్చి 2న హైదరాబాద్‌లో ఆత్మగౌరవ సభ పెట్టాం. అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించడంతో చంద్రబాబు ఆ సభకు వచ్చారు.

ఆంధ్రజ్యోతిపై జరిగిన దాడిని సమర్థిస్తా.. మా ఆత్మగౌరవంపై దాడి జరిగింది కాబట్టే..

ఆర్కే: పేరు చివర మాదిగ అని పెట్టుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

మందకృష్ణ మాదిగ: నేను ఎమ్మార్పీఎస్‌ పెట్టినపుడు అది వద్దని చాలామంది అన్నారు. మాదిగలు తమ కులాన్ని దాచుకునేంత ద్రోహం ఏమైనా చేశారా? చెప్పులుకుట్టి, డప్పులు కొట్టి సేవ చేశామే తప్ప ఎవరికీ అన్యాయం చేయలేదు కదా. దాంతో మనమే మొదలుపెట్టాలని పేరు పెట్టుకున్నాను.


ఆర్కే: పోరాట క్రమంలో మీరు మిలిటెంట్‌ ఎత్తుగడలను అనుసరిస్తారెందుకు?

మందకృష్ణ మాదిగ: ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకునే క్రమంలోనే ఆత్మవిశ్వాసం వచ్చింది. నేను నాలుగో తరగతిలో ఉన్నపుడు మా అమ్మ కూలి డబ్బులకెళ్తూ నన్నూ తీసుకెళ్లింది. ఎదురుగా వచ్చే రైతుకు నా చెయ్యి తగిలితే, ఎదమీద తన్నారు. నేను కింద పడ్డాను. మా తల్లి నన్ను లేపకుండా ఆయన కాళ్లమీద పడింది. తర్వాత కూలికెళ్లేటపుడు మా దోసిల్లో నీళ్లుపోసేవారు. ఆకుల్లో తిండి పెట్టేవారు. తర్వాత టెంత్‌లోకి వచ్చేసరికి కులవివక్ష అసలు రూపం తెలిసింది.


ఆర్కే: గాంధీభవన్‌పై దాడిలో ముగ్గురి ప్రాణాలు పోతే మీకు బాధ కలిగించలేదా?

మందకృష్ణ మాదిగ: గాంధీ భవన్‌పై దాడిలో నా తమ్ముళ్లను కోల్పోవడం ఎప్పటికీ మరువలేను. ఆంధ్రజ్యోతి విషయమే తీసుకుంటే.. ఆ రోజు మిమ్మల్ని సమర్థించినవారూ ఉన్నారు. మమ్మల్ని సమర్థించినవారూ ఉన్నారు. ఆంధ్రజ్యోతిపై జరిగిన దాడిని ఇప్పటికీ మనస్ఫూర్తిగా సమర్థించుకుంటున్నాను. అది మా ఆత్మగౌరవంపై జరిగిన దాడికి ప్రతిదాడిగానే భావిస్తాను. మా ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు మా కార్యకర్తలు పోరాడతారు. వాటి ఫలితాలూ మేం అనుభవించాం. కానీ ఈ రెండు సంఘటనల నేపథ్యంలో.. మేం చాలా అప్రమత్తమయ్యాం.


ఆర్కే: దొరల తెలంగాణ వద్దని.. అదే దొరకు నిమ్మరసంతో దీక్ష విరమింపజేశారు?

మందకృష్ణ మాదిగ: కేసీఆర్‌ ఎన్ని హామీలు ఇచ్చినా మేం విశ్వసించి గుడ్డిగా ఆయన వెంట నడవలేదు. తెలంగాణ పేరు చెప్పి ఆయన చేసిన జిమ్మిక్కుల వల్ల విశ్వాసాన్ని కోల్పోయారు. పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. ఆ దశలో ఆయన తెలంగాణ సాధన కోసం నిజాయతీగా.. దీక్ష ప్రారంభించారు. ఆ సమయంలో ఆయనను పార్టీలు తేలిగ్గా కొట్టి పారేయొచ్చు. అందుకే.. ఉద్యమకారులుగా మేం మద్దతిచ్చాం.


ఆర్కే: ఇంతకూ కేసీఆర్‌ మీకు వ్యతిరేకమా? అనుకూలమా?

మందకృష్ణ మాదిగ: నాలుగుకోట్ల మందికి ప్రతినిధి అయిన జేఏసీ కన్వీనర్‌ ఎంపికలోనే అసలు గుట్టు బయటపడింది. కేసీఆర్‌, జానారెడ్డి ఇద్దరూ కలిసి కోదండరామ్‌ను ఎంపిక చేశారు. నాలుగు కోట్ల మంది ప్రతినిధిని కేవలం ఇద్దరు ఎన్నుకున్నారు. మహిళా జేఏసీ కన్వీనర్‌ ఉమాదేవి రెడ్డి.. యువజన జేఏసీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి. వికలాంగుల జేఏసీకి అధిపతి సత్యనారాయణ రెడ్డి. ఇదీ జేఏసీల తీరు. దీనిని ప్రశ్నించినందుకే నాపై గుర్రు. వీటన్నింటికీ పరాకాష్ట కాకతీయ వర్సిటీ ఘటన. అందుకే.. నేను ఈ సంఘటనకు కేసీఆర్‌ బాధ్యుడిని చేశాను. నిజంగా తెలంగాణ కోసం పోరాడుతున్నది విద్యార్థులే. నిజానికి విద్యార్థి ఉద్యమం బలపడడం కేసీఆర్‌ సహా ఏ నాయకుడికీ ఇష్టం లేదు. ఎవరి ప్రయోజనాలు వారికున్నాయి.


ఆర్కే: మీది లవ్‌ మ్యారేజియా?

మందకృష్ణ మాదిగ: అవును. వాళ్ల పేరెంట్స్‌కు ఇష్టం లేదు. ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నా. నేనప్పుడు మిలిటెంట్‌గా మారాను. చంపుడు, చావడాల వద్దకు వెళ్లిపోయింది పరిస్థితి. వాళ్ల తల్లిదండ్రులు నాకివ్వడానికి అంగీకరించలేదు. అప్పుడూ మిలిటెంట్‌ దాడే. అమ్మాయిని ఎత్తుకొచ్చి.. తెల్లారే పెళ్లి చేసుకున్నాను.


ఆర్కే: మీ జీవిత లక్ష్యం

మందకృష్ణ మాదిగ: చచ్చే వరకు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు, అగ్రవర్ణ పేదల ప్రయోజనాల కోసం పోరాడతా. ఎంత సాధిస్తానో, ఏం సాధిస్తానో తెలియదు. ఇందుకోసం నా జీవితాన్ని వెచ్చిస్తా.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.