మాదిగలను మోసం చేసిన బీజేపీ

ABN , First Publish Date - 2022-06-24T05:32:20+05:30 IST

మాదిగలను మోసం చేసిన బీజేపీ

మాదిగలను మోసం చేసిన బీజేపీ
సమావేశంలో మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ

 ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

హనుమకొండ రూరల్‌, జూన్‌ 23: ఎస్సీ వర్గీకరణ ప్రకటించకపోతే బీజేపీకి నిరసన సెగ తప్పదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. గురువారం నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని జూలై 2వ తేదీలోపే తీసుకోవాలన్నారు. 1996లో ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతు ఇచ్చి, 1997లో కాకినాడలో ఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హిందూ దేవుళ్ల సన్నిధిలో వర్గీకరణ తీర్మానం చేశారని, ఇంకా వర్గీకరణ చేయలేదంటే దేవుళ్లపై బీజేపీకి నమ్మకం లేనట్లేనన్నారు. వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగలను మోసం చేశారని, మాదిగల ఆవేదన ఆగ్రహంగా మారితే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంద కృష్ణ హెచ్చరించారు. మాదిగల ఆగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ నేతలకు చూపిస్తామన్నారు. ఎస్సీ రిజర్వేషన్లను పెంచమనడం లేదని, దామాషా ప్రకారం పంచాలంటున్నామని తెలిపారు. 

ఎనమిదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఎస్సీ వర్గీకరణ చేయకపోవడం మాదిగలను కించపర్చడమేనన్నారు. జూలై 2వ తేదీన కర్ణాటక, ఆంధ్రప్ర దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సడక్‌బంద్‌, జూలై 3న చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చామన్నారు. నిరసనలో ఏ పరిణామాలు జరిగినా బీజేపీ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 

అరెస్టులు తమకు కొత్త కాదని మంద కృష్ణమాదిగ అన్నారు. ఈ సమావేశంలో ఎంఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్‌గౌడ్‌, ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్‌మా దిగ, ఎంఎస్‌పీ, ఎమ్మార్పీఎస్‌ నేతలు వేల్పుల సూరన్న, బండారి సురేందర్‌, విజయ్‌ మాదిగ, బొక్కల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-24T05:32:20+05:30 IST