మునుగోడు కాంగ్రెస్ లో మండల సమన్వయ కమిటీలు

ABN , First Publish Date - 2022-08-11T08:02:08+05:30 IST

మునుగోడులో పార్టీ ఫిరాయించిన మండల కాంగ్రెస్‌ అధ్యక్షుల స్థానంలో ముగ్గురు/అయిదుగురు సభ్యులతో సమన్వయ కమిటీలను నియమించి ఉప ఎన్నిక కోసం పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార వ్యూహ కమిటీ నిర్ణయించింది.

మునుగోడు కాంగ్రెస్ లో మండల సమన్వయ కమిటీలు

అభిప్రాయ సేకరణ తర్వాతే అభ్యర్థి ఖరారు

ఉపఎన్నిక ప్రచార వ్యూహకమిటీ నిర్ణయం

అధిష్ఠానం అభ్యర్థిని ఖరారు చేసే వరకు ఎవరూ తమ పేరు ప్రచారం చేసుకోవద్దు

ఆశావహులతో సమావేశంలో స్పష్టీకరణ


హైదరాబాద్‌/నల్లగొండ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మునుగోడులో పార్టీ ఫిరాయించిన మండల కాంగ్రెస్‌ అధ్యక్షుల స్థానంలో ముగ్గురు/అయిదుగురు సభ్యులతో సమన్వయ కమిటీలను నియమించి ఉప ఎన్నిక కోసం పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార వ్యూహ కమిటీ నిర్ణయించింది. రెండుమూడు రోజుల్లో ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీల్లో పార్టీ సమన్వయ కమిటీలను ఖరారు చేయాలని తీర్మానించింది. మునుగోడు అభ్యర్థి ఎంపికపై ఈ నెల 16 నుంచి రోజుకు రెండు మండలాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అప్పటి వరకు మునుగోడులో తామే పార్టీ అభ్యర్థులమంటూ ఎవ్వరూ ప్రచార కార్యక్రమాలు చేపట్టరాదని సమావేశం తీర్మానించింది. ఈ నెల 16-18 వరకు ప్రతి రోజు రెండు మండలాల నాయకులు, కార్యకర్తలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సమావేశం కానున్నారు. మునుగోడులో ఎవరిని నిలబెడితే బాగుంటుందన్న అంశంపై లోతుగా అభిప్రాయ సేకరణ చేయనున్నారు. 


సర్వే తర్వాతనే అభ్యర్థి ఎంపిక

మునుగోడులో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీపడుతున్న ఆశావహులు, ముఖ్య నాయకులతో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు బుధవారం గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు. ఎన్నికలో గెలుపు కోసం అవలంబించాల్సిన వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పాల్వాయి స్రవంతి, పల్లె రవి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పున్న కైలాశ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘నేనే అభ్యర్థి’ అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకోవద్దని సమావేశంలో బోసు రాజు స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానమే అభ్యర్థిని ఖరారు చేస్తుందని చెప్పారు. సర్వేలు, గ్రామస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తైన తర్వాతనే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. సమావేశం అనంతరం కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆశావహులకు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-11T08:02:08+05:30 IST