ఎస్పీ బాలు మరణాంతరం సీఎం జగన్‌కు మండలి రెక్వెస్ట్

ABN , First Publish Date - 2020-09-26T22:33:49+05:30 IST

లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు ఇవాళ ముగిశాయి.

ఎస్పీ బాలు మరణాంతరం సీఎం జగన్‌కు మండలి రెక్వెస్ట్

అమరావతి : లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు ఇవాళ ముగిశాయి. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని తెలుగు రాష్ట్రాల ప్రముఖులు మీడియా ముఖంగా, ప్రకటనల ద్వారా చెప్పుకుని తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. తాజాగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పలు అభ్యర్థనలు చేశారు. తెలుగు భాష తీయదనాన్ని, తెలుగు గళ మాధుర్యాన్ని విశ్వవ్యాపితం చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతి శాశ్వతంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఎంను ఆయన కోరారు.


బాలు కోరికను మన్నించి...!

ఎస్పీబీ జన్మించిన నెల్లూరులో వారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు నెల్లూరులో నెలకొల్పిన సంగీత కళాశాలకు ఆయన పేరు పెట్టాలి. నెల్లూరులో తిక్కన విగ్రహం పెట్టాలన్న బాలు కోరికను మన్నించి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ తయారు చేయించిన కాంస్య విగ్రహాన్ని నెల్లూరులో ఆవిష్కరించి ఆయన కోర్కెను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వానిదే. బాలు ఆరోగ్యం కోసం తమిళనాడు ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్మృతిని భావి తరాలకు అందించేందుకు ముందుకు రావాలి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరిట తెలుగుదేశం హయాంలో ప్రభుత్వం రూ.10 లక్షలతో జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. అలాగే బాలు పేరిట ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఒక రాష్ట్ర స్థాయి సంస్థకు బాలు పేరు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను’ అని ప్రకటన రూపంలో మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.

Updated Date - 2020-09-26T22:33:49+05:30 IST