టీడీపీ మహానాడులో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేయాలి

ABN , First Publish Date - 2022-05-17T08:50:21+05:30 IST

పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ మహానాడు సభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఎమ్మార్పీఎస్‌

టీడీపీ మహానాడులో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేయాలి

చంద్రబాబు వల్లే మాదిగలకు వర్గీకరణ ఫలాలు: మంద కృష్ణమాదిగ

టీడీపీ నేత వర్ల రామయ్యతో భేటీ


విజయవాడ, మే 16 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ మహానాడు సభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కోరారు. ఈ అంశంపై చొరవ తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను కోరారు. సోమవారం విజయవాడలోని వర్ల రామయ్య నివాసానికి వెళ్లిన మంద కృష్ణ మాదిగ ఆయనతో ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించారు. గతంలో 2000-2004 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వల్లే మాదిగలకు రిజర్వేషన్‌ ఫలాలు దక్కాయని కృష్ణమాదిగ తెలిపారు. రిజర్వేషన్ల అమలులో మాదిగలకు అన్యాయం జరిగిందని తొలుత దివంగత ఎన్టీ రామారావు గుర్తిస్తే.. దానికి కొనసాగింపుగా చంద్రబాబునాయుడు వ్యవహరించారని వివరించారు.


ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం వద్ద ఇంకా పెండింగ్‌లో ఉన్నందున చంద్రబాబు దీనిపై చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో కూడా మాల, మాదిగ, రెల్లి కులాల వారికి 50:50 నిష్పత్తిలో సీట్లు కేటాయించేలా చొరవ చూపాలని వర్ల రామయ్యను మంద కృష్ణ మాదిగ కోరారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ ఎస్సీలందరికీ సమానంగా రాయితీ ఫలాలు దక్కేలా మంద కృష్ణ కృషి చేస్తున్నారని కితాబునిచ్చారు. ఆయన లేవనెత్తిన అంశాలన్నీ తమ పార్టీ చర్చల్లో ఉన్నాయన్నారు.  

Updated Date - 2022-05-17T08:50:21+05:30 IST