మందుల్లేవ్‌!

ABN , First Publish Date - 2022-08-01T05:13:28+05:30 IST

వైద్యసేవల్లో ఎంతో గుర్తింపు పొందిన ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో రోగులకు అవసరమైన మందులు దొరకడం లేదు. చిన్నచిన్న సమస్యలకు కూడా బ

మందుల్లేవ్‌!

రూ.3.50కోట్ల బడ్జెట్‌ ఉన్నా ప్రయోజనం సున్నా

రూ.వందలు పెట్టి బయట కొనాల్సిందే

కనీసం.. కన్ను, చెవి మందులూ అందుబాటులోలేని వైనం

ఇదీ ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో దుస్థితి

ఖమ్మం కలెక్టరేట్‌, జూలై 31: వైద్యసేవల్లో ఎంతో గుర్తింపు పొందిన ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో రోగులకు అవసరమైన మందులు దొరకడం లేదు. చిన్నచిన్న సమస్యలకు కూడా బయటి మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి. కళ్ల సమస్యలు, చెవినొప్పికి సంబంధించిన మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో వైద్యులు బయటకు రాస్తుండటంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులు రూ.వందలు వెచ్చించి మందులు కొనుక్కోవాల్సి వస్తోంది. 

సౌకర్యాలు సరే మందులేవీ?

ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రధాన విభాగంతో పాటు మాతాశిశు సంరక్షణ కేంద్రం ఉంది. వీటి పరిధిలో 520 పడకలున్నాయి. నిత్యం జిల్లా ఆస్పత్రికి 700మంది వరకు, మాతాశిశు సంరక్షణ కేంద్రానికి 500మంది వస్తుంటారు. జిల్లా ఆస్పత్రికి ఇటీవల క్యాథ్‌ల్యాబ్‌ను ప్రారంభించారు. క్యాథ్‌లాబ్‌, ఆర్థోవిభాగంలో ఎలాంటి సర్జరీలకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా మందులు పంపిణీ చేయడంలేదు. దీంతో ఆరోగ్యశ్రీలో బయటి నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఉస్మానియా, నిమ్స్‌ లాంటి ఆస్పత్రులకు సరఫరా చేసిన విధంగానే ఖమ్మం క్యాథ్‌లాబ్‌కు కూడా స్టెంట్లు, ఎంజియోగ్రామ్‌కు అవసరమైన పరికరాలు, మందులు పంపిణీ చేయడం లేదు. దీంతో రోగులు, ఇటు వైద్యులు అవస్థలు పడుతున్నారు. స్టెంట్లు, బెలూన్స, గైడ్‌వైర్‌, గైడింగ్‌ క్యాపిటర్‌, షీట్లు సరఫరా చేయడం లేదు. దీనితో పాటు థ్రాంబోలైటిక్స్‌, యాంటిక్యాగ్‌లెంత, యాంటి ప్లేట్‌లెంత మందులు అందుబాటులో ఉండడం లేదు. ఇవి ఎంతో అత్యవసరమైన మందులు. ఆరు నెలల క్రి తం క్యాథ్‌లాబ్‌ అందుబాటులో కి వచ్చింది. ప్రజలు, రోగుల నుంచి క్యాథ్‌లాబ్‌కు డిమాండ్‌ బాగా ఉంది. కానీ మందులు మాత్రం లేకపోవడంతో వాటిని ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ ద్వారా బయటి మార్కెట్‌ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది. 

ఇన్‌ప్టాంట్స్‌ కూడా బయటనుంచే..

జిల్లా ఆస్పత్రికి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి రోగులు వస్తుంటారు. ప్రమాదాల్లో గాయపడి వచ్చిన వారికి ఇక్కడ సర్జరీ చేసే థియేటర్‌ సర్జన్లు ఉన్నా ఇనప్లాంట్స్‌ను ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. బయట మార్కెట్‌లోనే కొనుగోలు చేయాల్సి వస్తోంది. స్టీల్‌రాడ్లు, ప్లేట్లు, స్ర్కూలు ఇవన్నీ బయటనే కొనుగోలు చేస్తున్నారు. అత్యవసర సమయంలో అందుబాటులో ఉండకపోవడంతో బయటికి ప్రైవేటు ఆస్పత్రులకు పంపించాల్సి వస్తోంది. అలాగే గటిలాక్స్‌, పోవిడిన సోల్యూషన, ఆపరేషన థియేటర్‌కు వినియోగించే క్యాట్‌ గట్స్‌, గ్లూకోస్‌ స్ర్టిప్స్‌, న్యూరో, అనస్తీషియాకు సంబంధించిన మందులు సరఫరా కావడం లేదు. అత్యంత ఖరీదైన హీమోఫీలియా ఇంజక్షన్ల సరఫరా కూడా అరకొరగానే ఉంటోంది. జిల్లాలో 30మంది రోగులు హీమోఫీలియాతో బాధపడుతున్న వారు ఉండగా.. వీరికి వారానికి కనీసం 3 నుంచి 4 ఇంజక్షన్లు అవసరం ఉంటుంది. బహిరంగ మార్కెట్లో ఈ ఇంజక్షన కనీసం రూ.30వేల నుంచి రూ.40వేలు ఉంటుంది. వీటిని రోగులకు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం నుంచి అంతంతమాత్రంగా అందుతున్నాయి. మొత్తం 40 నుంచి 60రకాల మందులు ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో కొరతగా ఉందని రోగులు ఆరోపిస్తున్నారు.

ఎంఆర్‌ఐకి ప్రతినెలా రూ.2లక్షల చెల్లింపులు..

జిల్లా ఆస్పత్రిలో కీలకమైన ఎంఆర్‌ఐ పరికరం లేదు. దీంతో ప్రమాదాల్లో గాయపడి వచ్చిన క్షతగాత్రులకు తలకు మెదడులో, వెన్నుపూస, నరాల పటిష్ఠత తదితర లోపాలను తెలుసుకునేందుకు ఎంఆర్‌ఐ కీలకమవుతోంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కేంద్రం లేకపోవడంతో బాధితులు, రోగులు ప్రైవేటు డయాగ్నసిస్‌ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్క ఎంఆర్‌ఐ తీయాలంటే ప్రైవేటులో రూ.7వేల నుంచి రూ.8వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లా ఆస్పత్రికి అనుసంధానంగా ఉన్న ఓ డయాగ్నసిస్‌ కేంద్రానికి ప్రతి నెలా కనీసం రూ.2లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సర్కారు వైద్యాన్ని పటిష్ఠ పరుస్తున్నామని చెబుతున్నా.. రోగులకు అవసరమైన మందులనే సరఫరా చేయలేకపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వీటిపై ప్రత్యేక దృష్టిసారించాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-08-01T05:13:28+05:30 IST