దుఃఖసాగరం

ABN , First Publish Date - 2022-05-24T06:21:52+05:30 IST

దుఃఖసాగరం

దుఃఖసాగరం
మంగినపూడి బీచ్‌లో వివరాలు సేకరిస్తున్న పోలీసులు

మంగినపూడి బీచ్‌లో విషాదం

ఇద్దరు బీ-ఫార్మసీ విద్యార్థినుల మృతి

ఒకరిది బందరు, మరొకరిది భీమవరం

క్యాంపస్‌ సెలక్షన్లలో ఉద్యోగం.. వారంలో జాబ్‌

ఆనందంలో ముగ్గురు స్నేహితులు బీచ్‌కు రాక

అల ధాటికి సముద్రం లోతుకు..

మెరైన్‌ పోలీసుల సహకారంతో ఒకరు క్షేమం


క్యాంపస్‌ పరీక్షల్లో నెగ్గిన ఆ చిట్టితల్లులు కడలి పరీక్షను మాత్రం ఎదుర్కోలేకపోయారు. కొత్త ఆశలతో అడుగు ముందుకేసిన చదువుల తల్లులు అలల ధాటికి ఎదురు నిలవలేక పోయారు. వారంలో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా, అంతకుముందే తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువతుల దీనగాథ ఇది. 


మచిలీపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి) : మచిలీపట్నానికి చెందిన కళ్లేపల్లి పూజిత (22), భీమవరం సమీపంలోని పిప్పర గ్రామానికి చెందిన ప్రమీల (22), గరకపర్రు గ్రామానికి చెందిన దత్తాల ఆశ బీ-ఫార్మసీ కోర్సు పూర్తిచేసి, క్యాంపస్‌ సెలక్షన్లలో ఉద్యోగాలు సాధించారు. మరో వారంలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంది. కానీ, ఈ దుర్ఘటనలో పూజిత, ప్రమీల మరణించగా, ఆశ ప్రాణాలతో బయటపడింది. ఎస్‌ఐ వాసు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరంలోని శ్రీవిష్ణు కళాశాలలో చదువు పూర్తిచేసుకున్న ఈ ముగ్గురు ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో సోమవారం ఉదయం మంగినపూడి బీచ్‌కు వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా, పెద్ద అల వచ్చి లోపలకు లాక్కెళ్లిపోయింది. ప్రాణభయంతో వీరు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మెరైన్‌ పోలీసులు, పోలీసులు, సముద్రంలో స్నానం చేస్తున్నవారు రక్షించే ప్రయత్నం చేశారు. పూజిత, ప్రమీల సముద్రపు లోతులోకి వెళ్లిపోవడంతో పోలీసులు చేతులు పైకెత్తడంటూ కేకలు వేశారు. అనంతరం వారిని అతికష్టంమీద ఒడ్డుకు చేర్చారు. అయితే, ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా, పూజిత, ప్రమీల మరణించారు. ఆశ మాత్రం ప్రాణాలతో బయటపడింది.

తీరని కడుపుకోత

పూజిత, ప్రమీల మృతితో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఉద్యోగం సాధించి, అండగా నిలుస్తారనుకున్న చిట్టితల్లులు మృతిచెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇంటికి వచ్చినా ఎప్పుడూ చదువుతూనే ఉండేదని, ఉద్యోగం వచ్చిందనే ఆనందంలో ఉన్న సమయంలో తమను వదిలి వెళ్లిపోయిందని పూజిత తల్లిదండ్రులు విలపించిన తీరు అక్కడి వారందరికీ కంటతడి తెప్పించింది. పూజిత స్వగ్రామం బందరు మండలంలోని రుద్రవరం గొల్లపాలేనికి చెందిన గ్రామస్థులు, బంధువులు ఆసుపత్రికి భారీగా తరలివచ్చారు. విషయం తెలుసుకున్న ప్రమీల తండ్రి అగస్టీన్‌, బంధువులు మచిలీపట్నానికి వచ్చారు. ప్రమీల మృతదేహాన్ని చూసి వారంతా గుండెలవిసేలా విలపించారు. ఇద్దరు యువతుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. 

పెద్ద అల లాక్కెళ్లిపోయింది

పూజిత, ప్రమీల, తాను సోమవారం ఉదయం 9 గంటలకు మంగినపూడి బీచ్‌కు వచ్చామని, స్నానం చేస్తుండగా పెద్ద అల వచ్చి సముద్రం లోతుకు తీసుకెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షి ఆశ విలేకరులకు తెలిపింది. తాను కొంతదూరం మాత్రమే వెళ్లగా, తన ఇద్దరు స్నేహితులు మరింత లోతులోకి వెళ్లిపోయారని, బయట ఉన్న పోలీసులు చేతులు పైకెత్తండని కేకలు వేశారని, ఒడ్డు నుంచి కొద్దిదూరంలో ఉన్న తనను వచ్చి కాపాడారని, కొంతసేపటి తరువాత పూజిత, ప్రమీలను ఒడ్డుకు చేర్చారని తెలిపింది. ఒడ్డుకు చేర్చిన కొద్దిసేపటి వరకు ప్రాణాలతోనే ఉన్నారని, వాహనంలో తరలించే ప్రయత్నం చేస్తుండగా చనిపోయారని కన్నీటిపర్యంతమైంది. కాగా, మెరైన్‌ పోలీసులతో పాటు ఈత వచ్చిన లక్ష్మణ్‌, శివ, నరేష్‌, స్వామి, ప్రైవేట్‌ ఫొటోగ్రాఫర్లు ప్రాణాలకు తెగించి యువతులను బయటకు తీసుకొచ్చారు. 

Updated Date - 2022-05-24T06:21:52+05:30 IST