నా గొంతు దేవుడిచ్చిన వరం

ABN , First Publish Date - 2021-03-04T05:38:24+05:30 IST

జానపదాలు ఆమె గొంతులో కొత్త హంగులు అద్దుకుంటయి. బతుకమ్మ పాటలతో మొదలైన ఆమె పాటల ప్రయాణంలో సారంగ దరియా... బూమ్‌ బద్దల్‌.. రాములో రాముల...శైలజా రెడ్డి అల్లుడు చూడే...వంటి హిట్‌ పాటలు ఉన్నాయి. ఫోక్‌ గీతాల రారాణిగా

నా గొంతు దేవుడిచ్చిన వరం

జానపదాలు ఆమె గొంతులో కొత్త హంగులు అద్దుకుంటయి. బతుకమ్మ పాటలతో మొదలైన ఆమె పాటల  ప్రయాణంలో సారంగ దరియా... బూమ్‌ బద్దల్‌.. రాములో రాముల...శైలజా రెడ్డి అల్లుడు చూడే...వంటి హిట్‌ పాటలు ఉన్నాయి. ఫోక్‌ గీతాల రారాణిగా పేరు తెచ్చుకున్న ఆమె తన అసలు పేరు సత్యవతి రాథోడ్‌ కన్నా మంగ్లీగానే అందరికీ తెలుసు. అతి త్వరలోనే ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పూర్తిగా శివుడి పాటలతో అలరించనున్న మంగ్లీ నవ్యతో పంచుకున్న ముచ్చట్లివి...


టాప్‌ వ్యూస్‌

  • 1.40 కోట్లు సారంగదరియా (లవ్‌స్టోరీ) 
  • 2.60 కోట్లు బూమ్‌బద్దల్‌ (క్రాక్‌)
  • 31 కోట్లు రాములో రాముల(అల వైకుంఠపురములో)
  • 7.9 కోట్లు బుల్లెట్‌ సాంగ్‌(జార్జిరెడ్డి)
  • 12.8 కోట్లు ‘ఎండి కోండాలు ఏలెటోడా అడ్డబొట్టూ శంకరుడా’ పాట


ఈషా ఫౌండేషన్‌ వారి నుంచి ఆహ్వానం రావడం ఎలా అనిపించింది?

ఈషా ఫౌండేషన్‌ వారు నన్ను పాటలు పాడేందుకు పిలవడంతో నా సంతోషానికి హద్దులు లేవు. ఎన్ని ప్రోగ్రామ్స్‌ ఉన్నా అన్నీ వదులుకొని అక్కడి వెళ్లాననే పట్టుతోని ఉన్నాను. అక్కడ నేను మొత్తం శివుడి పాటలు పాడబోతున్నా. ఒక్క పాట కూడా కాదు అయిదు పాటలు పాడే అవకాశం వచ్చింది నాకు.


ఏయే పాటలు పాడనున్నారు?

‘‘అజ్ఞానికేం ఎరుక సద్గురుల మరుగు..’’  అనేది ఒక పాట. ‘‘నా గురుడు నన్నింకా యోగి గమ్మననే యోగి గమ్మననే త్యాగి గమ్మననే.’’ మరొక పాట. ఇవి రెండూ  తత్వాన్ని చెప్పే పాటలే!. ‘‘వెండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్ట్టూ శంకరుడా..’’ మరో పాట.  ‘సాదు జంగమా ఆది దేవుడా.. శంభో శంకర హర లింగ రూపుడా.. సంచార జగతినావ తోవ నీవురా.. ఆది అంతమేది నీకు లేదురా’.’’ అనేది మరొక పాట. దీనిని రాసింది గోరటి వెంకన్న. నర్సపల్లి సాంగ్‌ ఫేమ్‌ మదీన్‌ సంగీతం అందించారు. మరొకటి ఈషా ఫౌండేషన్‌ వారి ‘‘హలె హలె హాయిని వెతుకున్నదోయి బతుకు నైజం ఎరుగదానిదోయి’’ అనే పాట. ఇప్పటి వరకు నేను సద్గురును కలవలేదు. ప్రపంచ వేదిక మీద మొదటిసారి ఆయనను కలవనున్నాను. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది.


జనం మధ్యలో పాడటానికి.. రికార్డింగ్‌ స్టూడియోలో  పాడటానికి తేడా ఏమిటి?

తేడా అంటే- వాస్తవానికి బయట పడేటోళ్లు స్టూడియోలో పాడలేరు. స్టూడియోలో పాడేటోళ్లు బయట పాడలేరు. అది కొంచెం కష్టం. స్టూడియోలో అనుకోండి ఎవరూ ఉండరు. అదే జనం చప్పట్ల మధ్య పాడుతుంటే తెలియని మజా వస్తది. వాళ్లు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్‌ చేస్తుంటే మనం ఎక్కడికో వెళ్లిపోతం. స్టూడియోలో అంటే మనసు పెట్టి పాడాలి. డైరెక్టర్‌కి, అందరికీ నచ్చేటట్టు పాడాలి. పాట సరిగా రాలేదనుకోండి. ఫీల్‌ సరిగా వచ్చేంత వరకూ పాడుతం. అదే జనం మధ్యలో అనుకోండి ఒక్కసారే పాడేస్తం. అక్కడ ఇలాంటి అవకాశం ఉండదు.


మీ మనసుకు బాగా నచ్చిన జానపద గీత రచయిత ఎవరు?

ఒక్కొక్కరూ ఒక్కో టైప్‌ అండీ. గోరటి వెంకన్న అనుకోండి ఆయన తత్వం, సాహిత్యం చాలా లోతుగా ఉంటుంది. ఆయనకు తెలియంది ఏదీ లేదండి. సూఫీలు పాడుతడు, రాస్తడు. శివుడి పాట రాస్తున్నప్పుడు శివుడితో మాట్లాడుతున్నట్టు అంతగా లీనమైపోతడు. పాట రాయడంలో ఎంత కష్టం ఉంటదో ఆయనను చూశాక నాకు అనుభవమైంది. ఆయన టకటక పాట రాసేస్తడు. సుద్దాల అశోక్‌ తేజ అన్నది వేరే శైలి. మిట్టపల్లి సురేందర్‌, మాట్ల తిరుపతి, కందికొండ, కాసర్ల శ్యామ్‌... వీళ్లందరూ జానపద గీతాలను చాలా బాగా రాస్తరు. అందరూ అద్భుతమైన రిసిరిస్ట్స్‌. అందరూ ఇష్టమే నాకు. మొన్న రాబర్ట్‌ ‘కన్నె అదిరింది’. అది డబ్బింగ్‌ పాట. ఆ పాటను జనాలు ఎంతో ఆదరించారు. నాకు ఆ పాట ఎంతో సంతోషాన్నిచ్చింది. అది శ్రేయాఘోషాల్‌ సాంగ్‌. ఆమె వాయిస్‌కు, నా వాయిస్‌ పూర్తిగా విరుద్ధంగా ఉంటది. నా గొంతు మారుతి గారిలా ఉంటది. నాది రా వాయిస్‌. నాది హాట్‌ అయితే ఆమెది స్వీట్‌ వాయిస్‌. అలాంటిది ఆ పాటకు సంగీత దర్శకుడు అర్జున్‌ జెనియా నన్ను ఎందుకు సెలక్ట్‌ చేసుకున్నరో అని అనుకున్న. కానీ ఆ పాటకు మన తెలుగులోనే బాగా ఆదరణ వచ్చింది. 


మీరు పాడిన మొదటి జానపదం?

ఏం లేదండీ. నేను సినిమా పాటలు పాడుతుండే మొదట్లో. తరువాత ఫోక్‌ సాంగ్‌ పాడాను. నాకు గుర్తింపు వచ్చింది మాత్రం రేలారేరేలతోనే. అదే నేను పాడిన తొలి ఫోక్‌ సాంగ్‌.


చిన్నప్పటి నుంచి ఎవరి జానపద పాటలు వింటూ పెరిగారు?

గోరటి వెంకన్న, గద్దర్‌, గూడ అంజన్న .... అందరి పాటలు వింటూ పెరిగాను. మా కుటుంబం ఒక్కచోట ఉండలేదు. మేము సంచారం చేస్తూ ఉన్నాం. మావాళ్లు మొదట్లో పాలమూరు, తరువాత కర్నూలు, ఆ తరువాత అనంతపూర్‌ కొన్నిరోజులు ఉన్నాం. మాది తండా, గూడెం కదా... ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లేవారు. అక్కడి నుంచి సంగారెడ్డి... ఇలా అని ప్రాంతాల జానపదాలు విన్నాను. బండి యాదగిరి రాసిన ‘బండెనక బండి కట్టి’, గోరటి వెంకన్న ‘గల్లీ సిన్నది’ పాటలు వినేదాన్ని. కానీ నేను ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు. అనుకోకుండా నేను తిరుపతిలోని ఎస్వీ మ్యూజిక్‌ అండ్‌ క్లాసిక్స్‌లో సంగీతం నేర్చుకున్నా. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసిన. తరువాత ఒక ఛానెల్‌లో యాంకర్‌గా చేసిన. ఆ తరువా రేలారేరేల.. తరువాత బొబ్బిలి సురేశ్‌తో ‘నీదినాది ఒకేకథ’, శైలజారెడ్డి అల్లుడులో, తరువాత రాములో రాముల సాంగ్‌... 


మీ ఉద్దేశంలో- మీకు ఫోక్‌ ఎక్కువ నచ్చుతుందా? క్లాసికల్‌ ఎక్కువ నచ్చుతుందా?

నాకు ఫోక్‌ నచ్చుతది. క్లాసిక్‌ నచ్చుతది. అదొక ప్రపంచం. ఇదొక ప్రపంచం. ఫోక్‌ అనేది జనాల ప్రపంచం. క్లాసిక్‌ అనేది కొందరి ప్రపంచం. సారంగదరియా పాట ఫోక్‌ అయినప్పటికీ కొంత క్లాసిక్‌ కలిసి ఉంటది. ఆ పాటలో గమకాలు, ట్యూనింగ్‌ బాగా వచ్చాయి. సారంగ దరియాను ఫోక్‌ సింగర్స్‌ ఒకలా, క్లాసిక్‌ సింగర్స్‌ మరోలా పాడతరు. హై పిచ్‌లో పాడడం నాకు దేవుడిచ్చిన వరం. జనాలకు నచ్చేలా పాడేందుకు ఎంతైనా కష్టపడుత. సాదు జంగమా పాటను జనాలకు బాగా ఇవ్వాలనే ఆలోచనతో వారణాసి వెళ్లి అక్కడ షూట్‌ చేశాం. అక్కడికి వెళ్లాక అనిపించింది నా గొంతు పలికించేది ఆ ఈశ్వరుడేనని.  


సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్‌ వస్తాయి కదా.. వాటిలో మరచిపోలేవి ఏవైనా ఉన్నాయా?

సోషల్‌మీడియాతోనే నాకు గుర్తింపు వచ్చింది. యూట్యూబ్‌ లేకపోతే నేను లేను. నాకు సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ కామెంట్లు వస్తయి. మరిచిపోలేని కామెంట్లు చాలా వచ్చాయి. తెలుగు ప్రజలు నన్ను ఇంత ఆదరిస్తున్నరా అని ఒక్కసారిగా ఏడుపొచ్చేది. సారంగదరియా పాట విన్నాక టర్కీ నుంచి ఒకరు ‘లవ్‌ యువర్‌ సాంగ్‌’ అని కామెంటు చేశారు. బతుకమ్మ పాటలు చేసినప్పుడు కొందరు నామీద పెద్ద పెద్ద కవిత్వమే రాశారు. అవన్నీ మరచిపోలేను. 


కొన్ని నెగిటివ్‌ కామెంట్స్‌ కూడా వస్తాయి కదా..

అవన్నీ కామన్‌ అండీ. నేను మీడియాకు చాలా దూరంగా ఉంటాను. సోషల్‌ మీడియాను మంచికి వాడుకుంటే మంచిగుంటది. 

సివిఎల్‌ఎన్‌

Updated Date - 2021-03-04T05:38:24+05:30 IST