నెలాఖరులోపు మామిడి బకాయిలు చెల్లించాలి

ABN , First Publish Date - 2022-05-22T06:39:45+05:30 IST

మామిడి రైతుల బకాయిలను నెలాఖరులోపు చెల్లించాలి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు.

నెలాఖరులోపు మామిడి బకాయిలు చెల్లించాలి
సమావేశంలో ప్రసంగిస్తున్న పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి

లేదంటే ఉద్యమిస్తాం, కొకొకోలా కంపెనీని ముట్టడిస్తాం  

రైతు సంఘాల హెచ్చరిక 


తిరుపతి(కొర్లగుంట), మే 21: ‘మామిడి రైతుల బకాయిలను నెలాఖరులోపు చెల్లించాలి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. జూన్‌ నుంచి కొకొకోలా కంపెనీని ముట్టడిస్తాం’ అని జిల్లా రైతు సంఘాల గౌరవాధ్యక్షుడు పెద్దిరెడ్డి చెంగల్‌రెడ్డి, అధ్యక్షుడు మాంగాటి గోపాల్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం వారు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది కొకొకోలా కంపెనీ మార్కెట్‌ ధర కంటే రూపాయి అదనంగా చెల్లిస్తామని తోతాపురి మామిడి కాయలను రైతుల నుంచి నేరుగా కొనుగులు చేసిందన్నారు. పదిరోజుల్లోనే నగదు చెల్లిస్తామని అంగీకరించడంతో నెల వ్యవధిలోనే 4,875 టన్నుల కాయలను రైతులు సరఫరా చేశారని చెప్పారు. ఏడాది కావస్తున్నా ఒప్పందం ప్రకారం అదనపు నగదు చెల్లించలేదని వాపోయారు. అనేకసార్లు కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపినా సమాధానం లేదని మండిపడ్డారు. దీంతో ఉమ్మడి జిల్లా రైతులు సంఘటితమయ్యామన్నారు. కొకొకోలా కంపెనీ.. కాయల కొనుగోలు ధరలతో పోలిస్తే వందశాతం అధికంగా మాజాను విక్రయిస్తూ లాభం గడిస్తోందన్నారు. గత ఏడాది రూ.3,884కోట్ల లాభం వచ్చినట్లు కంపెనీ డైరెక్టర్లు ప్రకటించారని, దీన్నిచూస్తే రైతులను ఏస్థాయిలో మోసం చేస్తున్నారో అర్థమవుతోందని అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఐదేళ్లుగా మామిడి తోటల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపణ చేశారు. ఇకనైనా తోతాపురం మామిడికి కనీస ధర కిలో రూ.25, నగదు చెల్లించే సమయం ముందుగానే తెలియజేయాలని, పంట నష్టానికి బీమా చెల్లించాలని, బ్యాంకులు పంట రుణాలు ఎకరాకు రూ.40వేలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘాల నాయకులు కొత్తూరు బాబు, వెంకటరెడ్డి, నాగేశ్వరరాజు, శేఖర్‌రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T06:39:45+05:30 IST