మామిడికి.. కరోనా దడ..!

ABN , First Publish Date - 2021-04-21T05:09:18+05:30 IST

దక్షిణ భారతదేశంలోనే మామిడికి రైల్వేకోడూరు నియోజకవర్గం ప్రసిద్ధి.

మామిడికి.. కరోనా దడ..!
పచ్చళ్లకు బస్తాల్లో నింపిన తోతాపూరి మామిడి కాయలు

దిగుబడులు తగ్గినా.. ధరలు అంతంతమాత్రమే

ఇతర రాష్ట్రాల ఎగుమతికి కరోనా కష్టాలు

ముంబై, పూణే, నాసిక్‌ నగరాల్లో మార్కెట్లు లాక్‌డౌన్‌


ఈ ఏడాది వాతావరణంలో మార్పులతో మామిడి దిగుబడులు తగ్గిపోయాయి. పూత ఆశాజనకంగా వచ్చినా వాతావరణం అనుకూలించకపోవడంతో కాపు తగ్గింది. దిగుబడితో పాటు మామిడి ధరలూ కూడా తగ్గిపోయాయి. ముంబై, పూణే, నాసిక్‌ వంటి నగరాల్లోని మార్కెట్లలో లాక్‌డౌన్‌ పెట్టడడంతో ఇక్కడి మామిడిని ఎగుమతి చేయడం వీలుకాలేదు. దీంతో ఇటు వ్యాపారులు, అటు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.


రైల్వేకోడూరు, ఏప్రిల్‌ 20: దక్షిణ భారతదేశంలోనే మామిడికి రైల్వేకోడూరు నియోజకవర్గం ప్రసిద్ధి. ఇక్కడ సుమారుగా 150 రకాల మామిడి కాయలను రైతులు పండిస్తున్నారు. ఇందులో బేనీషా, రుమాని, తోతాపూరి, నీలం, ఖాదర్‌, మల్లికా, పులిహోరా, మనోరంజన్‌, నూనేపసందు, నీలిషాన్‌ తదితర రకాలు ఉన్నాయి. ఎక్కువగా జ్యూస్‌కు తోతాపూరి రకాన్ని చిత్తూరు జిల్లాలోని పరిశ్రమలకు ఎగుమతి చేస్తారు. గత ఏడాది బేనీషా రకం మామిడి టన్ను రూ.60వేల నుంచి రూ.70 వేల వరకు పలికింది. రుమాని రూ.18 నుంచి రూ.20, తోతాపూరి కాయలు టన్ను రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకు పలికాయి. ప్రస్తుతం బేనీషా టన్ను రూ.40 వేల నుంచి రూ.42 వేల వరకు నిలిచిపోయింది. తోతాపూరి కాయలు టన్ను రూ.18వేల నుంచి రూ.19 వేలు పలుకుతున్నాయి. పులిహోరా మాగుడు కాయలు టన్ను రూ.26 వేల నుంచి రూ.28 వేల వరకు ఉన్నాయి. 

ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్లోకి రావడంతో..

రాష్ట్రంలోని విజయవాడ, విసన్నపేట, దామలచెరువు, కొత్తకోట, కర్ణాటక రాష్ట్రంలోని శ్రీనివాసపూర్‌ తదితర ప్రాంతాల నుంచి ఒకేసారి మామిడికాయలు మార్కెట్‌లోకి రావడంతో రైల్వేకోడూరు మామిడికి దెబ్బ పడింది. రైల్వేకోడూరు నుంచి మహరాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, మఽధ్యప్రదేశ్‌, ఒడిశా, కర్ణాటక తదితర ప్రాంతాలకు కాయలను ఎగుమతి చేస్తారు. అక్కడి చాలా ప్రాంతాల్లో కరోనా ఉధృతి వల్ల లాక్‌డౌన్‌ పెట్టారు. కొన్ని పెద్ద, పెద్ద మార్కెట్లలో ఆంక్షలు విధించడంతో మామిడి ఎగుమతులు సాఽధ్యం కావడం లేదు. ఇంకా కరోనా ఉధృతి పెరిగితే మామిడి వ్యాపారం పూర్తి స్థాయిలో దెబ్బతింటుందని రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోతాపూరి, రుమాని రకం మామిడి కాయలను పచ్చళ్లకు పంపిస్తున్నారు. పులిహోరా, బేనీషా మాగబెట్టి అమ్మకం చేయడానికి పంపిస్తున్నారు. ఈ ఏడాది 20 నుంచి 25 శాతం మేరకు మాత్రమే దిగుబడులు వచ్చాయని రైతులు అంటున్నారు. వచ్చిన దిగుబడులను అయినా కరోనాతో అమ్ముకోగలమో లేదో అని రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఈ ఏడాది ధరలు తక్కువే

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మామిడి ధరలు తక్కువగా ఉన్నాయి. కరోనా వల్ల మార్కెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేయాలంటే ఆంక్షలు ఉన్నాయి. పెద్ద పెద్ద మార్కెట్లలో లాక్‌డౌన్‌ విధించారు. కొన్ని ప్రాంతాలకు ప్రస్తుతం పచ్చళ్ల కు పంపిస్తున్నాము. గత ఏడాది ఎలాగో సొమ్ము అయింది. ఈ ఏడాది మామిడి సీజన్‌ను ఎలా గట్టెక్కించాలో అంతుపట్టకుండా ఉంది. ఒకేసారి మార్కెట్‌లోకి కాయలు రావడంతో ధరలు అంతంత మాత్రంగా ఉన్నాయి.

- సర్దార్‌, మామిడి వ్యాపారి, రైల్వేకోడూరు 


ఎగుమతికి వీలు కల్పించాలి

మామిడి ఎగుమతికి ప్రభుత్వాలు వీలు కల్పించాలి. రైతుల దగ్గర మామిడి తోటలు తీసుకున్నాము. ఇతర ప్రాంతాల్లో ఉన్న మార్వాడీలు కాయలకోసం ఎదురుచూస్తున్నారు.  పంపించాలంటే కరోనాతో చాలా ఇబ్బందిగా మారింది. తోటల్లో దిగుబడులు తక్కువగా ఉన్నాయి. రైతులకు తోటల కొనుగోలుకు డబ్బులు ఇచ్చేశాము. ఇటు రైతులు, అటు వ్యాపారులు బాగుపడాలంటే మామిడికాయల ఎగుమతులు జరగాలి. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి.

- నరసింహ, వ్యాపారి, రైతు, గుండాలపల్లె 



Updated Date - 2021-04-21T05:09:18+05:30 IST