కిసాన్‌ ఘాడి.. ఢిల్లీకి మామిడి!

ABN , First Publish Date - 2021-04-20T04:29:21+05:30 IST

సాధారణంగా మామిడికాయలు అధిక భాగం రోడ్డు మార్గం ద్వారా రవాణా అవుతాయి. దేశ రాజధాని నుంచి బడా ట్రేడర్లు వీటిని విమానాల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు.

కిసాన్‌ ఘాడి..  ఢిల్లీకి మామిడి!
విజయనగరం రైల్వేస్టేషన్‌లో లోడింగ్‌ చేస్తున్న దృశ్యం



జిల్లా నుంచి కిసాన్‌ రైలు ప్రారంభం

విజయనగరం నుంచి రోజు విడిచి రోజు ప్రయాణం

200 మెట్రిక్‌ టన్నుల చొప్పున రవాణా

ఆసక్తిచూపుతున్న రైతులు, చిరు వ్యాపారులు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

మామిడి రైతులు, చిరు వ్యాపారులు రైలుబాట పట్టారు. కిసాన్‌ రైలులో ఎంచక్కా ఢిల్లీకి మామిడి ఉత్పత్తులు పంపిస్తున్నారు. విజయనగరం రైల్వేస్టేషన్‌ నుంచి రెండురోజులకు ఒకసారి కిసాన్‌ రైలు బయలుదేరుతోంది. ఒక్కో ట్రిప్‌నకు 200 మెట్రిక్‌ టన్నుల మామిడి ఉత్పత్తులను ఢిల్లీకి తరలిస్తున్నారు. తద్వారా రైతులకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు రాయితీలు వర్తిస్తున్నాయి. రైల్వేశాఖకు కూడా ఆదాయం సమకూరుతోంది. ఉభయతారకంగా ఉండడంతో ఇటు రైతులు, అటు రైలు అధికారులు మామిడి ఎగుమతులపై ఆసక్తికనబరుస్తున్నారు. ఇప్పటికే విజయవాడ రైల్లే డివిజన్‌ పరిధిలో కిసాన్‌ రైళ్ల రాకపోకలు ప్రారంభంకాగా... వాల్తేరు డివిజన్‌ పరిధిలో విజయనగరం నుంచి శ్రీకారం చుట్టారు. 

సాధారణంగా మామిడికాయలు అధిక భాగం రోడ్డు మార్గం ద్వారా రవాణా అవుతాయి. దేశ రాజధాని నుంచి బడా ట్రేడర్లు వీటిని విమానాల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. రోడ్డు మార్గం ద్వారా రవాణా వల్ల మామిడి రైతులు, వ్యాపారులు, చిన్న ట్రేడర్లకు అధిక ఖర్చు అవుతోంది. రైల్వే అధికారులు తమ బీడీయూ యూనిట్స్‌ను రంగంలోకి దించి కిసాన్‌ రైలులో రవాణా వల్ల రాయితీలు పొందే విషయాన్ని వివరించడంతో జిల్లాకు చెందిన మామిడి రైతులు, వ్యాపారులు, చిన్న ట్రేడర్లు కిసాన్‌ రైళ్ల ద్వారానే రవాణా చేయటానికి ముందుకొచ్చారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రిత్వ శాఖ ఆపరేషన్‌ గ్రీన్స్‌ పేరుతో రైతులు, ట్రేడర్ల కోసం కిసాన్‌ రైళ్లను ప్రారంభించి, రవాణా చార్జీలో 50 శాతం రాయితీ ఇస్తోంది. ఈ రాయితీలను ఇటీవలే మరికొంత కాలం పొడిగించింది. దీంతో ఈ ఒక్క రైలు ద్వారా మామిడి రైతులు, ట్రేడర్లకు లక్షలాది రూపాయల రాయితీ లభిస్తోంది.  


 జిల్లాలో మామిడి సాగు అధికం

జిల్లాలో మామిడి సాగు గణనీయం. జిల్లావ్యాప్తంగా  42 వేల హెక్టార్లలో మామిడి తోటలను రైతులు పెంచుతున్నారు.  కొత్తవలస, ఎల్‌.కోట, ఎస్‌.కోట, జామి, గంట్యాడ, వేపాడ, తెర్లాం, బాడంగి, సాలూరు, రామభద్రపురం, దత్తిరాజేరు, గజపతినగరం, చీపురుపల్లి, గుర్ల తదితర మండలాల్లో మామిడి సాగు అధికం. కొత్తవలస మార్కెట్‌ నుంచి మామిడి రవాణా ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాధి రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి మామిడిని కొనుగోలు చేస్తుంటారు. ముందుగానే వచ్చి రైతులకు కొంత మొత్తం ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుంటారు. సీజన్లలో లారీల్లో ఎగుమతి చేస్తుంటారు. అయితే గత ఏడాది నుంచి కరోనాతో రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ఏడాది అదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కిసాన్‌ రైలు ద్వారా తరలింపు ప్రారంభంకావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


 కళకళాడుతున్న రైల్వేస్టేషన్‌

జిల్లా నలుమూలల నుంచి వస్తున్న మామిడి ఉత్పత్తులతో విజయనగరం రైల్లేస్టేషన్‌ కళకళలాడుతూ కనిపిస్తోంది. కార్టన్‌ బాక్సుల్లో ముందుగానే ప్యాక్‌ చేస్తున్నారు. ట్రాక్టర్లు, లారీల్లో రైల్వేస్టేషన్‌కు చేర్చుతున్నారు. రోజు విడిచి రోజు నడిచే కిసాన్‌ రైలులో 200 మెట్రిక్‌ టన్నుల మామిడిని లోడింగ్‌ చేస్తున్నారు. ఈ నెల 13న ఒక ర్యాక్‌తో లోడు ఢిల్లీ వెళ్లింది. అటు తరువాత 17, 19 తేదీల్లో మరో రెండు లోడులు వెళ్లాయి. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, రాయగడ మీదుగా ఈ కిసాన్‌ రైలు ఢిల్లీ చేరుతుంది. గతంలో దళారులు ప్రవేశించి ముందుగానే తోటలు కొనుగోలు చేసేవారు. ముందస్తు ఒప్పందం ప్రకారం మార్కెట్‌లో ధర పెరిగినా అప్పట్లో మాట్లాడుకున్న రేటు ప్రకారమే వ్యాపారులు నగదు చెల్లించేవారు. దీంతో రైతులకు నష్టం కలిగేది. ఇప్పుడా పరిస్థితి లేదు. నేరుగా రైతులు రాయితీపై తరలించేందుకు వీలుగా కిసాన్‌ రైలును ఏర్పాటుచేశారు. ఇది లాభసాటిగా ఉందని రైతులు చెబుతున్నారు. మరోవైపు రైలులో లోడింగ్‌, రవాణాతో కలాసీలు, కూలీలకు గిట్టుబాటవుతోంది.





Updated Date - 2021-04-20T04:29:21+05:30 IST