మామిడిదీ అదే తీరు!

ABN , First Publish Date - 2021-05-17T03:25:37+05:30 IST

మామిడి రైతులదీ దయనీయ పరిస్థితి. కరోనా ప్రభావంతో కుదేలయ్యారు. లాక్‌డౌన్‌ ఆంక్షలతో రవాణా నిలిచిపోయింది. దీంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు.

మామిడిదీ అదే తీరు!
మామిడికాయలు తీసి పోగులు పెడుతున్న రైతులు

ఏటా ఈ సీజన్‌లో వందల టన్నుల్లో ఎగుమతులు 

ప్రస్తుతం రవాణా లేక దిగాలు

గణనీయంగా తగ్గిన ధరలు

ఆందోళనలో రైతులు

(ఇచ్ఛాపురం రూరల్‌) 

మామిడి రైతులదీ దయనీయ పరిస్థితి. కరోనా ప్రభావంతో కుదేలయ్యారు. లాక్‌డౌన్‌ ఆంక్షలతో రవాణా నిలిచిపోయింది. దీంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దళారులు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గత్యంతరం లేక రైతులు విక్రయిస్తున్నారు. జిల్లాలో సుమారు 7 వేల హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉద్దానంలో అంతర పంటగా మామిడి సాగు చేస్తున్నారు.  ఏటా ఈ సీజన్‌లో జిల్లా నుంచి 1500 నుంచి 2 వేల టన్నుల వరకూ మామిడి ఎగుమతులు జరుగుతుంటాయి. కరోనా కారణంగా గత సంవత్సరం నుంచి సగం ఎగుమతులు కూడా జరగలేదు. దీంతో స్థానికంగా తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోంది. ఈ ఏడాది పొగ మంచుతో పంట పాడవ్వగా..ఉన్న పంట విక్రయించుకోవడానికి రైతులు సతమతమవుతున్నారు. గత ఏడాది కిలో రూ. 25 నుంచి రూ. 30 వరకు ధర పలకగా... ప్రస్తుతం రూ.15 నుంచి రూ.20 మధ్య పలుకుతోంది. మరోవైపు ఎగుమతికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇతర రాష్ట్రాలకు కాయలను తీసుకెళ్లినా, ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో అక్కడ అమ్మకాలు జరక్కపోతే కిరాయి డబ్బులు కూడా వచ్చే అవకాశం లేదని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో వాహన రాకపోకలకు అనుమతులు కల్పించాలని కోరుతున్నారు. 

 

దిగుబడులు ఆశాజనకం

ఈ ఏడాది ప్రారంభంలో తెగుళ్లు నష్టపరిచాయి. కానీ దిగుబడులు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. కానీ లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈదురుగాలులు, వర్షంతో పంట రాలిపోతోంది. ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా రవాణాకు అధికారులు అనుమతి ఇవ్వాలి. 

- డి.హేమాచలం, మామిడి రైతు, టి.బరంపురం.


అనుమతులిస్తున్నాం

 ఉద్యాన పంటల ఎగుమతికి ఎటువంటి ఇబ్బందిలేదు. మామిడి రవాణాకు రైతులందరికీ అనుమతులు ఇస్తున్నాం. అంతే కాకుండా మామిడి నిల్వ చేసే విధానంపైన, వాటి అమ్మకాలకు సంబంధించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం.

- రత్నాల వరప్రసాద్‌, ఉద్యాన సహాయ సంచాలకులు, టెక్కలి

 

Updated Date - 2021-05-17T03:25:37+05:30 IST