మదిని దోచే... మ్యాంగో స్వీట్స్‌..!

ABN , First Publish Date - 2022-06-11T06:11:01+05:30 IST

మామిడిపండ్లు తిని తిని బోర్‌ కొట్టిందా? అయితే ఈసారి వాటితో ఫిర్ని, టిరమిసు, అమర్‌ఖండ్‌, బేక్డ్‌ యోగర్ట్‌...

మదిని దోచే... మ్యాంగో స్వీట్స్‌..!

మామిడిపండ్లు తిని తిని బోర్‌ కొట్టిందా? అయితే ఈసారి వాటితో ఫిర్ని, టిరమిసు, అమర్‌ఖండ్‌, బేక్డ్‌ యోగర్ట్‌... వంటివి ట్రై చేయండి. ఈ మ్యాంగో స్వీట్స్‌ కచ్చితంగా మీ మదిని దోచేస్తాయి.


మ్యాంగో టిరమిసు


కావలసినవి

మామిడిపండ్లు - రెండు, కోడిగుడ్లు - ఐదు, పంచదార - పావుకేజీ, మైదా - 150గ్రా, కాఫీ లిక్కర్‌ - 15ఎంఎల్‌, చీజ్‌ - 200ఎంఎల్‌, క్రీమ్‌ - 200ఎంఎల్‌, వైట్‌ చాక్లెట్‌ - 100గ్రా, నిమ్మరసం - కొద్దిగా.


తయారీ విధానం

స్టవ్‌పై పాన్‌ పెట్టి మామిడి పండు ముక్కలు, పంచదార వేసి, కొద్దిగా నీళ్లు పోసి చిన్న మంటపై కాసేపు ఉడికించాలి.


తరువాత స్టవ్‌పై నుంచి దింపి ఫోర్క్‌ సహాయంతో మామిడిపండు ముక్కలను గుజ్జుగా చేయాలి. నిమ్మరసం వేసి కలియబెట్టి బౌల్‌లోకి మార్చుకుని చల్లారే వరకు పక్కన పెట్టాలి.


మరొక బౌల్‌లో మైదా, చీజ్‌, క్రీమ్‌, వైట్‌ చాక్లెట్‌, కాఫీ లిక్కర్‌ వేసి, కోడిగుడ్లు కొట్టి కలుపుకోవాలి.  

టిన్‌లో చీజ్‌ మిశ్రమాన్ని లేయర్‌గా పోయాలి. దానిపై మామిడిపండు మిశ్రమాన్ని లేయర్‌గా పోసుకోవాలి. 


ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లటి టిరమిసు సర్వ్‌ చేసుకోవాలి.


మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌


కావలసినవి

మిల్క్‌ మేడ్‌ - 300ఎంఎల్‌, హంగ్‌కర్డ్‌ - 300గ్రా, కుకింగ్‌ క్రీమ్‌ - 250ఎంఎల్‌, మామిడిపండ్లు - రెండు, మ్యాంగో పల్ప్‌ - 100ఎంఎల్‌.


తయారీ విధానం

ముందుగా ఓవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు ప్రీహీట్‌ చేసుకోవాలి.


ఒక మిక్సింగ్‌ బౌల్‌ తీసుకుని అందులో మిల్క్‌మేడ్‌, హంగ్‌కర్డ్‌, కుకింగ్‌ క్రీమ్‌, మామిడి పండు ముక్కలు, మ్యాంగో పల్ప్‌ వేసి బీటర్‌ సహాయంతో బాగా కలపాలి.


ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ బౌల్‌లోకి మార్చుకోవాలి.


బేకింగ్‌ టిన్‌ తీసుకుని అందులో సగం వరకు నీళ్లు నింపాలి. ఆ నీళ్లలో బేకింగ్‌ బౌల్‌ పెట్టాలి.


తరువాత ఓవెన్‌లో పెట్టి 20 నిమిషాలు బేక్‌ చేసుకోవాలి.


జాగ్రత్తగా బయటకు తీసి చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. 


సర్వ్‌ చేసుకునే ముందు మామిడిపండు ముక్కలతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


అమర్‌ఖండ్‌ 


కావలసినవి

హంగ్‌కర్డ్‌ - 300ఎంఎల్‌, పంచదార - 300గ్రా, యాలకులు - రెండు, మామిడిపండ్లు - పావుకేజీ, మ్యాంగో కలర్‌ - 100ఎంఎల్‌, బేకింగ్‌ పౌడర్‌ - 15గ్రా, కుంకుమపువ్వు - రెండు రెక్కలు, బాదం పలుకులు - నాలుగైదు, పిస్తా పలుకులు - నాలుగైదు. 


తయారీ విధానం

ఒక బౌల్‌లో హంగ్‌ కర్డ్‌ తీసుకుని బీటర్‌ సహాయంతో మెత్తగా చేసుకోవాలి. తరువాత అందులో మామిడి పండు ముక్కలు, పంచదార, యాలకులను పొడిగా చేసి కలుపుకోవాలి. 


రెండు టేబుల్‌స్పూన్ల పాలలో కుంకుమపువ్వు రేకులు వేయాలి. ఈ పాలను కూడా పెరుగు మిశ్రమంలో కలుపుకోవాలి. మ్యాంగో కలర్‌, బేకింగ్‌ పౌడర్‌ వేసుకోవాలి. పెరుగులో పంచదార కరిగే వరకు కలియబెట్టాలి.


నలగ్గొట్టిన బాదం పలుకులు, పిస్తా పలుకులను వేసుకుంటే అమర్‌ఖండ్‌ రెడీ


మ్యాంగో ఫిర్ని


కావలసినవి

పాలు - ఒక లీటరు, పంచదార - 200గ్రా, బాస్మతి బియ్యం - పావుకేజీ, యాలకులు - 5, మామిడి పండ్లు - పావుకేజీ, పిస్తా పలుకులు - నాలుగైదు, రోజ్‌వాటర్‌ - కొద్దిగా, కుంకుమపువ్వు - కొంచెం. 


తయారీ విధానం

మందంగా ఉన్న ఒక పాత్రను స్టవ్‌పై పెట్టి పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో బాస్మతి బియ్యం వేయాలి.


తరువాత పంచదార వేసి కలియబెట్టి చిన్నమంటపై ఉడికించాలి. అప్పుడప్పుడు కలియబెడుతూ ఉండాలి. 


బియ్యం ఉడికిన తరువాత స్టవ్‌పై నుంచి దింపుకోవాలి. తరువాత అందులో పిస్తా పలుకులు, యాలకుల పొడి, కొద్దిగా రోజ్‌ వాటర్‌ వేయాలి. తరువాత కుంకుమపువ్వు వేసుకోవాలి. 


ఇవన్నీ వేసిన తరువాత బాగా కలియబెట్టాలి. మూత పెట్టి ఫిర్ని చల్లబడేంత వరకు పక్కన పెట్టాలి. 


తరువాత మామిడిపండ్లను మిక్సీలో వేసి ప్యూరీని తయారుచేసుకుని కలుపుకొంటే మ్యాంగో ఫిర్ని రెడీ.


మ్యాంగోలెట్‌ బ్రౌనీ విత్‌ హాట్‌ చాక్లెట్‌


కావలసినవి

డార్క్‌ చాక్లెట్‌ - 200గ్రా, వెన్న - 150గ్రా, కోడిగుడ్లు - ఐదు, పంచదార - పావుకేజీ, మైదా - పావుకేజీ, బేకింగ్‌పౌడర్‌ - 15గ్రా, కుకింగ్‌ క్రీమ్‌ - 100ఎంఎల్‌, మామిడి పండ్లు - రెండు, వెనీలా, ఆల్మండ్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ - కొద్దిగా, ఆలివ్‌ ఆయిల్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, దాల్చినచెక్క పొడి - చిటికెడు, ఉప్పు - చిటికెడు, వాల్‌నట్స్‌ - నాలుగైదు. 


తయారీ విధానం


ముందుగా డబుల్‌ బాయిలర్‌లో చాక్లెట్‌ను కరిగించుకుని పక్కన పెట్టుకోవాలి.


ఒక బౌల్‌లో మైదా తీసుకుని అందులో దాల్చినచెక్క పొడి, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టాలి.


మరొక బౌల్‌లో ఆలివ్‌ ఆయిల్‌ తీసుకుని అందులో వెనీలా, ఆల్మండ్‌ ఎక్స్‌ట్రాక్ట్స్‌ వేయాలి. తరువాత పంచదార వేసి కలపాలి. కోడిగుడ్లు కొట్టి వేయాలి. చల్లారిన చాక్లెట్‌ మిశ్రమం కూడా వేసి కలుపుకోవాలి. బేకింగ్‌ పౌడర్‌, కుకింగ్‌ క్రీమ్‌ వేయాలి. 


ఇప్పుడు మైదా మిశ్రమం వేసి, వాల్‌నట్స్‌, మామిడి పండు ముక్కలు వేసి కలపాలి.


ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ పాన్‌లో లేయర్‌లా పోసుకోవాలి. 350 డిగ్రీలకు ప్రీహీట్‌ చేసుకున్న ఓవెన్‌లో పెట్టి 40 నిమిషాలు బేక్‌ చేసుకోవాలి. 


చల్లారిన తరువాత సర్వ్‌ చేసుకోవాలి.


కొడాలి వెంకటేశ్వర రావు

ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌, హోటల్‌ గోల్కొండ 

హైదరాబాద్‌

Updated Date - 2022-06-11T06:11:01+05:30 IST