BJP : త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-05-15T17:50:59+05:30 IST

త్రిపుర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసన సభాపక్ష నేత మాణిక్

BJP : త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం

అగర్తల : త్రిపుర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసన సభాపక్ష నేత మాణిక్ సాహా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. బిప్లబ్ కుమార్ దేబ్ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ శాసన సభా పక్షం మాణిక్ సాహాను తమ నేతగా ఎన్నుకుంది. అనంతరం సాహా రాజ్‌ భవన్‌లో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిసి, ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని కోరారు. 


శనివారం బీజేపీ శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత మాణిక్ సాహా ఇచ్చిన ట్వీట్‌లో, శాసన సభా పక్ష నేతగా ఎన్నికవడంతో తాను గవర్నర్‌ను రాజ్ భవన్‌లో కలిశానని తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపానని, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించానని తెలిపారు. 


ఇదిలావుండగా, ముఖ్యమంత్రి పదవికి మాణిక్ సాహా పేరును బిప్లబ్ కుమార్ దేబ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 


త్రిపురకు మరో ‘మాణిక్యం’

త్రిపురకు ముఖ్యమంత్రిగా ఇరవయ్యేళ్ళపాటు సీపీఎం నేత మాణిక్ సర్కార్ వ్యవహరించారు. 2018 వరకు మాణిక్ సర్కార్ ప్రభుత్వం ఉంది. ఆయన తర్వాత త్రిపురకు లభించిన మరొక మాణిక్యం ప్రస్తుత ముఖ్యమంత్రి మాణిక్ సాహా.


మాణిక్ సాహా లక్నో కింగ్ జార్జి మెడికల్ కాలేజ్‌లో మాక్సిలోఫేషియల్ సర్జన్. ఆయన 2016లో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు. 2020లో త్రిపుర బీజేపీ చీఫ్‌గా నియమితులయ్యారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అయిన సాహా త్రిపుర క్రికెట్ సంఘానికి అధ్యక్షునిగా ఉన్నారు. 


త్రిపుర శాసన సభ ఎన్నికలు వచ్చే సంవత్సరం జరుగుతాయి. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలని మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రయత్నిస్తోంది. బహుముఖ పోటీ ఉండే ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించే విధంగా బీజేపీని నడిపిస్తారని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. సాహా ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 


Updated Date - 2022-05-15T17:50:59+05:30 IST