కొరియా పాప్‌లో మణిపూర్‌

ABN , First Publish Date - 2020-11-11T06:17:57+05:30 IST

చాన్‌చుయ్‌ ఖాయి... ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బీఏ చదువుతోంది. మణిపూర్‌లోని మారుమూల తియానెమ్‌ ప్రాంతం నుంచి వచ్చిన

కొరియా పాప్‌లో మణిపూర్‌

పాప్‌ రాగాలు వింటే యువత హుషారెత్తిపోతుంది. అందులోనూ ‘బీటీఎస్‌’ బృందం పాడే కె-పాప్‌ అయితే ఇక చెప్పక్కర్లేదు... ఉత్సాహంగా గొంతు కలిపి... పాదం కదుపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయిన ‘బీటీఎస్‌’కు భారత్‌లో ఇప్పుడు కోట్లమంది అభిమానులున్నారు. అలాంటి ఒక అభిమానే చాన్‌చుయ్‌ ఖాయి. మణిపూర్‌కు చెందిన ఈ 19 ఏళ్ల అమ్మాయి... మొన్నామధ్య నిర్వహించిన ‘కె-పాప్‌’ వర్చ్యువల్‌ పోటీల్లో విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. 



చాన్‌చుయ్‌ ఖాయి... ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బీఏ చదువుతోంది. మణిపూర్‌లోని మారుమూల తియానెమ్‌ ప్రాంతం నుంచి వచ్చిన ఆమె బడి వయసు నుంచే కె-పాప్‌ (కొరియన్‌ పాప్‌ సంగీతం)పై మక్కువ పెంచుకుంది. చాన్‌చుయ్‌ పాడుతుంటే... ఈ పిల్ల సియోల్‌లో పుట్టి పెరిగిందా అనిపిస్తుంది. అంతలా అచ్చుగుద్దినట్టు కొరియన్లు ఉచ్ఛరించినట్టే పొల్లు పోకుండా కొరియా పదాలు పలుకుతుంది. ఈ ప్రతిభే ‘కొరియన్‌ కల్చరల్‌ సెంటర్‌ ఇండియా’ నిర్వహించిన ‘కె-పాప్‌ సోలో సింగింగ్‌ కాంపిటీషన్‌’లో ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. 


తొలిసారి వర్చ్యువల్‌లో... 

‘కొరియన్‌ కల్చరల్‌ సెంటర్‌ ఇండియా’ ఈ పోటీలను ఏటా నిర్వహిస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఔత్సాహికులంతా ఒకే వేదికను పంచుకొంటారు. తమ ప్రతిభ చూపి న్యాయనిర్ణేతల మనసు గెలిచే ప్రయత్నం చేస్తారు. అయితే కరోనా వల్ల ఈ ఏడాది తొలిసారిగా వర్చ్యువల్‌ విధానంలో పోటీలకు శ్రీకారం చుట్టింది కల్చరల్‌ సెంటర్‌. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ప్రిలిమినరీ రౌండ్‌లో 1,348 మంది పోటీపడ్డారు.


తరువాత రీజినల్‌ రౌండ్‌ వడపోత దాటుకొని 458 మంది తుది పోరుకు ఎంపికయ్యారు. చివరకు అద్భుతమైన గాత్రంతో, ఒరిజినల్‌ పాటను తలపించేలా అదరగొట్టిన చాన్‌చుయ్‌ విజేతగా నిలిచి, రికార్డులకెక్కింది. పోటీలో ఆమె ‘ఐయూ ఎఫ్‌టీ సుగా’ ఆల్బమ్‌ నుంచి ‘ఎయిట్‌’ అనే పాట పాడింది. ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచిన విదిసెన్యో బెల్హో కూడా ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌ నుంచి వచ్చిన యువతే కావడం విశేషం. 

ఈ పోటీలో పాల్గొనేవారు ఒక కొరియన్‌ పాట పాడి, ఆ వీడియోను నిర్వాహకులకు పంపిస్తారు. 50 శాతం గూగుల్‌ ఓటింగ్‌ ద్వారా, మరో 50 శాతం ‘కొరియన్‌ కల్చరల్‌ సెంటర్‌ ఇండియా’ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో అప్‌లోడ్‌ చేసిన సదరు వీడియోకు వచ్చిన లైక్స్‌ ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. 


అంత కష్టమేమీ కాదు...  

ఈశాన్య రాష్ట్రంలోని ఎక్కడో మారుమూల గ్రామానికి చెందిన చాన్‌చుయ్‌కు అసలు కొరియన్‌ పాప్‌ సంగీతం ఎలా పరిచయమైందనేది అందరి మదిలో మెదిలిన ప్రశ్న. అయితే అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక... అది స్మార్ట్‌ఫోన్లలో ఇమిడిపోయాక... యూట్యూబ్‌, వీడియో షేరింగ్‌ యాప్‌ల యుగం మొదలయ్యాక... కె-పాప్‌ ఏమిటి... ప్రపంచమే మన గుప్పిట్లో ఉన్నట్టుంది అంటుంది చాన్‌చుయ్‌. 

‘‘నేనూ అందరిలానే ఇంట్లో సరదాగా హమ్మింగ్‌ చేస్తుండేదాన్ని. అయితే ఒకరోజు మా ఇంటి దగ్గర చర్చిలో  ఓ కార్యక్రమం నిర్వహించారు. అందులో మా అక్కతో కలిసి నేను పాట పాడాను. నలుగురిలో పాడడం అదే తొలిసారి. ఎంతో ఉత్కంఠకు లోనయ్యాను. అక్కడున్నవారంతా అభినందిస్తుంటే... ఆ అనుభూతి అద్భుతమనిపించింది. ఆ తరువాత నుంచి పాట నా జీవితంలో భాగమైపోయింది. ఇక కె-పాప్‌ ప్రచారంలోకి వచ్చాక ఆ బీట్స్‌కు అభిమాని అయిపోయాను.


ఆరేడేళ్ల కిందట అనుకుంటా... సెకండ్‌ జనరేషన్‌ కె-పాప్‌ బృందాలు... ‘బిగ్‌బ్యాంగ్‌, గర్ల్స్‌ జనరేషన్‌, షైనీ, బీటీఎస్‌’లను మా అక్కే నాకు పరిచయం చేసింది. ఎప్పుడైతే వాటి గురించి బాగా తెలిసిందో... ఇక వదిలిపెట్టలేకపోయాను. ఆ సంగీతాన్ని ఆస్వాదించడమే కాదు... నేర్చుకోవడం కూడా మొదలుపెట్టాను. ఇన్నేళ్ల సాధనవల్లే ఇప్పుడు బాగా పాడగలుగుతున్నా. నిజానికి అంతా అనుకున్నట్టు కొరియన్‌ లిరిక్స్‌ నేర్చుకోవడం అంత కష్టమేమీ కాదు’’ అంటూ తన అనుభవాన్ని పంచుకుంది చాన్‌చుయ్‌. 




అందాల రాణి కూడా... 

చాన్‌చుయ్‌ పాప్‌ గీతాలు పాడడంలోనే కాదు... అందాల రాసిగానూ పేరు తెచ్చుకుంది. గత ఏడాది జరిగిన ‘మిస్‌ నార్తీస్ట్‌ ఇండియా కంటెస్ట్‌’లో ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచింది. ‘మోస్ట్‌ గ్లామరస్‌ లుక్‌’ టైటిల్‌ కూడా దక్కించుకుంది. ఢిల్లీలో డిగ్రీ చేస్తున్న ఈ మణిపూర్‌ యువతి ప్రస్తుతం చదువుపైనే దృష్టి పెట్టింది. ‘‘అలాగని కె-పాప్‌ డ్రీమ్స్‌ పక్కన పెట్టినట్టు కాదు. భవిష్యత్తులో ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొనడానికి ప్రయత్నిస్తా’’నంటూ ఆమె ఉత్సాహంగా చెబుతుంది. కరోనా పరిస్థితులు మెరుగయ్యాక పోటీ విన్నర్స్‌, రన్నర్స్‌ దక్షిణ కొరియా వెళ్లి ‘బీటీఎస్‌’ బాయ్స్‌ను కలుస్తారు. ఆ క్షణం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది చాన్‌చుయ్‌.   


అన్ని రోజులు ఆగలేకే... 

తొలుత ‘కె-పాప్‌ ఇండియా’ పోటీలు ప్రకటించినప్పుడు ఇప్పుడే పాల్గొనవద్దని చాలామంది చాన్‌చుయ్‌కు సలహా ఇచ్చారు. అంత పెద్ద పోటీలో నెగ్గాలంటే ఆమెకున్న సంగీత పరిజ్ఞానం సరిపోదనేది వారి అభిప్రాయం. వచ్చే ఏడాది జరిగే పోటీలకు వెళ్లమని సూచించారు. అయితే చాన్‌చుయ్‌లో ఆత్మవిశ్వాసం పాళ్లు ఎక్కువ. అందుకే ఎవరేమీ చెప్పినా వినలేదు. ఈ ఏడాదే పోటీలోకి దిగింది.


‘‘ఎందుకంటే దీని కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. మరో ఏడాది ఆగలేను. అవకాశం వచ్చినప్పుడు ఎందుకు ప్రయత్నించ కూడదనేది నా అభిమతం. ఈ విషయంలో నా కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా మా అక్క. వాళ్లే లేకపోతే నేనీ విజయం సాధించగలిగేదాన్ని కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది ఈ మణిపూర్‌ యువతి. 


Updated Date - 2020-11-11T06:17:57+05:30 IST