Gujarat: భారతరత్నకు సిసోడియా అర్హుడు: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-08-23T01:46:59+05:30 IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గెలిస్తే రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్య చికిత్స అందిస్తామని..

Gujarat: భారతరత్నకు సిసోడియా అర్హుడు: కేజ్రీవాల్

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గెలిస్తే రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్య చికిత్స అందిస్తామని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) అన్నారు. దేశ రాజధానిలో విద్యారంగానికి విశిష్ట సేవలందించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish sisodia) భారతరత్నకు (Bharat ratna) అర్హుడని ప్రశంసించారు. గుజరాత్‌లో రెండ్రోజుల పర్యటన కోసం సిసోడియాతో కలిసి అహ్మదాబాద్ వచ్చిన కేజ్రీవాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌ల తరహాలోనే గుజరాత్‌ సిటీ, గ్రామాల్లో  హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగపరచడంతో పాటు అవసరమైతే కొత్త ఆసుపత్రులను తెరుస్తామని హామీ ఇచ్చారు.


ఢిల్లీ ప్రభుత్వ ఎడ్యుకేషన్ మోడల్‌ను న్యూయార్క్ టైమ్ ప్రశంసించిందని, గుజరాత్ విద్యార్థులకు తాము నాణ్యమైన విద్యను అందిస్తామని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. 27 ఏళ్లుగా గుజరాత్‌లో అధికార బీజేపీ అహంకారాన్ని ప్రజలు చవిచూస్తున్నారని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు ఓటు వేయాలని బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులను కోరాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేజ్రీవాల్ ఇదే తరహా విజ్ఞప్తి చేశారు.


నన్నూ ఆరెస్టు చేస్తారేమో?

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతి ఆరోపణలపై సిసోడియాను సీబీఐ అరెస్టు చేయనుందా అని అడిగినప్పుడు, అరెస్టు చేయవచ్చని ఆయన సమాధానమిస్తాను. ''నేను కూడా అరెస్టవుతానేమో? ఎవరికి తెలుసు? ఇదంతా గుజరాత్ ఎన్నికల కోసమే చేస్తున్నారు'' అని కేజ్రీవాల్ ఆరోపించారు.

Updated Date - 2022-08-23T01:46:59+05:30 IST