పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభంపై మనీశ్ తివారీ ఆవేదన

ABN , First Publish Date - 2021-09-29T19:39:19+05:30 IST

కాంగ్రెస్‌ పంజాబ్ శాఖలో ఏర్పడిన సంక్షోభంపై ఆ పార్టీ సీనియర్

పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభంపై మనీశ్ తివారీ ఆవేదన

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పంజాబ్ శాఖలో ఏర్పడిన సంక్షోభంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఆనంద్‌పూర్ సాహిబ్ ఎంపీ మనీశ్ తివారీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్నదాని పట్ల సంతోషంగా ఉన్నవారు కేవలం పాకిస్థాన్ సైన్యం, నిఘా వర్గాలు, ప్రభుత్వాధినేతలేనని చెప్పారు. వేలాది మంది కాంగ్రెస్‌వాదుల త్యాగాల వల్ల రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంతత దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.


తాను పంజాబ్‌ నుంచి ఎన్నికైన ఓ ఎంపీగా రాష్ట్రంలో పరిస్థితుల పట్ల చాలా విచారంగా ఉన్నానని మనీశ్ తివారీ చెప్పారు. పంజాబ్‌లో చాలా కష్టపడి ప్రశాంతతను సాధించామన్నారు. 1980-1995 మధ్య కాలంలో అతివాదం, ఉగ్రవాదాలతో పోరాటంలో దాదాపు 25 వేల మంది, ముఖ్యంగా కాంగ్రెస్‌వాదులు, త్యాగం చేసిన తర్వాత, రాష్ట్రంలో మళ్ళీ శాంతి ఏర్పడిందని చెప్పారు. 


సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లో తీవ్రమైన సాంఘిక ఒడుదొడుకులు ఎదురవుతున్నాయన్నారు. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతేనని చెప్పారు. నిజాయితీలేనివారి కార్యకలాపాల వల్ల రాష్ట్రంలో స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ప్రాంతీయ భద్రతా సదస్సులో పాల్గొని వస్తున్నానని, పంజాబ్‌లో పరిణామాల పట్ల సంతోషంగా ఉన్నవారు కేవలం పాకిస్థాన్ పెద్దలేనని అన్నారు. ఈ పరిస్థితుల నుంచి లబ్ధి పొందగలమని పాకిస్థానీలు భావిస్తున్నారన్నారు. అధికారం కన్నా, మంత్రులు సంస్థాగత పదవులు నిర్వహించడం కన్నా ఆదర్శప్రాయమైనది ఒకటి ఉందన్నారు. పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రంలో శాంతి, సుస్థిరతలను కాపాడటమే ఆ ఉత్తమ ఆదర్శమని చెప్పారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది అత్యంత దురదృష్టకరమని తెలిపారు. 


మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చాలా గొప్ప నేత అని తెలిపారు. తన తండ్రికి ఆయన చాలా మంచి స్నేహితుడని చెప్పారు. కెప్టెన్ సింగ్ ఊహించి చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయన్నారు. విభజన రాజకీయాలకు అతీతంగా చూడగలిగే తమవంటివారికి ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల పర్యవసానాలు రాష్ట్ర సుస్థిరతపై ప్రభావం చూపుతాయనేదే తమ ఆందోళన అని వివరించారు. రైతుల ఆందోళన కారణంగా ఏర్పడిన సాంఘిక సంక్షోభాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో నౌకను గాడిలో పెట్టడానికి సురక్షితమైన హస్తాల అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యవహారాలను చూసే బాధ్యతగలవారికి విస్తృత దృశ్యం గురించి కనీస సమాచారం లేదన్నారు. 


మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో నవజోత్ సింగ్ సిద్ధూకు విభేదాలు రావడంతో కొద్ది నెలలపాటు సంక్షోభం ఏర్పడింది. ఆ తర్వాత జూలై 23న సిద్ధూకు పీపీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ముఖ్యమంత్రి పదవికి దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఎంపిక చేశారు. సిద్ధూ అకస్మాత్తుగా మంగళవారం పీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.  సిద్ధూ  రాజీనామా చేయడంతో ఆయనకు సన్నిహితులైన ఓ మంత్రి, ముగ్గురు కాంగ్రెస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొద్ది నెలల్లో శాసన సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామాలు కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి.




Updated Date - 2021-09-29T19:39:19+05:30 IST