జనవరి నుంచి ప్రతీ రోజు మంజీరా నీరు

ABN , First Publish Date - 2020-12-02T05:43:11+05:30 IST

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో జనవరి ఒకటి నుంచి ప్రతీ రోజు 2 గంటల పాటు మంజీరా నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

జనవరి నుంచి ప్రతీ రోజు మంజీరా నీరు
రాజంపేట ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి


సంగారెడ్డి టౌన్‌, డిసెంబరు 1 :  జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో జనవరి ఒకటి నుంచి ప్రతీ రోజు 2 గంటల పాటు మంజీరా నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని రాజంపేట ఫిల్టర్‌బెడ్‌, కులబ్‌గూర్‌ శివారులోని మంజీరా ఇన్‌టెక్‌వెల్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. 2016 నుంచి మంజీరా రిజర్వాయర్‌ ఎండిపోవడంతో ఇన్‌టెక్‌వెల్‌, ఫిల్టర్‌బెడ్‌ ద్వారా నీటి సరఫరా నిలిచిపోయి, నిరాధరణకు గురైన విషయం తెలిసిందే. ఇటీవల భారీ వర్షాల కారణంగా మంజీరా రిజర్వాయర్‌ నిండడంతో ఇన్‌టెక్‌వెల్‌, ఫిల్టర్‌బెడ్‌ మళ్లీ పని చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం వీటిని సందర్శించి పరిశీలించారు. నాలుగేళ్లుగా నిరాధరణకు గురైన ఫిల్టర్‌బెడ్‌, ఇన్‌టెక్‌వెల్‌ను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మున్సిపల్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 20వ తేదీలోగా ఇన్‌టెక్‌వెల్‌, ఫిల్టర్‌బెడ్‌కు సంబంధించి మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. అలాగే పైప్‌లైన్‌ మరమ్మతులు పూర్తి చేసి జనవరి 1 నుంచి ప్రతి రోజూ రెండు గంటల పాటు పట్టణ ప్రజలకు మంజీరా నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. రోజుకు 20 లక్షల గ్యాలన్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన రాజంపేట ఫిల్టర్‌బెడ్‌ను నిర్లక్ష్యం చేయకుండా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. జగ్గారెడ్డి వెంట కౌన్సిలర్లు వెంకట్‌రాజు, నాగరాజు, యువజన కాంగ్రెస్‌ మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అద్యక్షుడు కూన సంతోష్‌, కాంగ్రెస్‌ నాయకుడు ఉదయభాస్కర్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-02T05:43:11+05:30 IST