టీకాపై రాష్ట్రాలకే నిర్ణయాధికారం

ABN , First Publish Date - 2021-04-19T07:22:06+05:30 IST

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడంపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి కట్టడికి పక్కా వ్యూహంతో వ్యాక్సినేషన్‌ ఒకటే మార్గమని సూచించారు...

టీకాపై రాష్ట్రాలకే నిర్ణయాధికారం

  • పక్కా వ్యూహంతో వ్యాక్సినేషన్‌ 
  • ఆర్నెల్ల టార్గెట్‌తో ఆర్డర్లివ్వండి
  • పంపిణీలో పారదర్శకత అవసరం
  • ఉత్పత్తికి ‘లైసెన్సింగ్‌’ నిబంధన వద్దు
  • టీకాలను దిగుమతి చేసుకోవాలి
  • ప్రధానికి మన్మోహన్‌ సింగ్‌ లేఖ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడంపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి కట్టడికి పక్కా వ్యూహంతో వ్యాక్సినేషన్‌ ఒకటే మార్గమని సూచించారు. వ్యాక్సినేషన్‌ కోసం పంచ సూత్రాలను సూచిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘‘కోట్ల మంది పేదరికంలో చిక్కుకుపోయారు. ఎంతో మంది తమ జీవనాధారాన్నే కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో మహమ్మారి సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. తమ జీవితాలు మామూలు స్థితికి ఎప్పుడు చేరుతాయా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు’’ అని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటానికి తప్పనిసరిగా ఆచరించాల్సినవి ఎన్నో ఉన్నాయని, అందులో ప్రధానమైనది వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడమేనని స్పష్టం చేశారు. దేశంలో ‘హెల్త్‌ ఎమర్జెన్సీ’ విధించాలని, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ర్యాలీలపై మారటోరియం విధించాలని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబ్బల్‌ సూచించారు. దేశంలో ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌, ఆస్పత్రుల్లో బెడ్ల కొరత లేదంటూ కేంద్రం చేసిన ప్రకటనపై కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తీవ్రంగా స్పందించారు. ‘‘వ్యాక్సిన్‌ కొరత లేదంటున్నారు.. కానీ, టీకా కేంద్రాల వద్ద స్టాక్‌ లేదంటూ బోర్డులు దర్శనమిస్తున్నా యి. ఆక్సిజన్‌, బెడ్ల విషయంలోనూ ప్రభుత్వం కొరత లేదని చెబుతోంది. మరి దేనికి కొరత ఉంది? దేశంలో కరోనా రోగులకా?’’ అని ఆయన ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కరోనా మొదటి వేవ్‌ను మనం జయించామన్న ప్రభుత్వ వాదన సరికాదన్నారు. జయించి ఉంటే అన్ని మరణాలు నమోదై ఉండేవి కాదన్నారు.



మన్మోహన్‌ పంచ సూత్రాలివే

  1. రానున్న ఆర్నెల్ల టార్గెట్‌కు అనుగుణంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులకు ఆర్డర్లు ఇవ్వాలి. ఆ వివరాలను బహిరంగపరచాలి. ఆర్డర్ల మేరకు కంపెనీలు ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి.
  2. వ్యాక్సిన్‌ రాష్ట్రాలకు పంపిణీ చేయడంలో పారదర్శకత ఉండాలి. కేంద్రం వద్ద 10ు అత్యవసర బఫర్‌ స్టాక్‌ ఉండాలి. మిగతాదంతా రాష్ట్రాలకు పంపాలి. ఏ రాష్ట్రానికి ఎన్ని డోసులు పంపిస్తున్నారో తెలపాలి. 
  3. వ్యాక్సిన్‌ పంపిణీలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి. స్కూలు టీచర్లు, బస్‌ డ్రైవర్లు, ఆటోరిక్షా వాలాలు, ట్యాక్సీ డ్రైవర్లు, పంచాయతీల సిబ్బంది, లాయర్లు వంటి వర్గాలను ఈ కేటగిరీలో గుర్తించాలి. 
  4. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో కంపెనీలకు ‘లైసెన్సింగ్‌ తప్పనిసరి’ నిబంధనను కొంతకాలం తొలగించాలి. తద్వారా పేటెంట్‌ ఉన్నా.. ఇతర కంపెనీలు ఆ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయవచ్చు. వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులకు కేంద్రం ప్రోత్సాహకాలు, నిధులు అందించాలి. 
  5. ఐరోపా వైద్య సంస్థ(ఈయూఏ), అమెరికా ఎఫ్‌డీఏ వంటి సంస్థలు ఆమోదించిన టీకాలను దిగుమతి చేసుకోవాలి. 

Updated Date - 2021-04-19T07:22:06+05:30 IST