పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తోలు బొమ్మ: సిద్ధూ

ABN , First Publish Date - 2022-04-22T00:02:46+05:30 IST

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తోలు బొమ్మ: సిద్ధూ

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తోలు బొమ్మ: సిద్ధూ

చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించే వారిపై పోలీసుల్ని ప్రయోగిస్తూ, పోలీసు వ్యవస్థను స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పై పీపీసీసీ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ విరుచుకుపడ్డారు. నిజానికి భగవంత్ మాన్ కు స్వతంత్రమైన అధికారాలు ఏమీ లేవని, ఢిల్లీలోని ఆప్ నాయత్వానికి ఆయన తోలు బొమ్మ అని దుయ్యబట్టారు. పంజాబ్ లో శాంతిభద్రతలు ప్రమాదంలో పడ్డాయని, కానీ ప్రభుత్వం మాత్రం తమ పార్టీ వ్యతిరేకుల మీద కేసులు పెడుతూ ప్రజా సమస్యలను వదిలేసిందని సిద్ధూ అన్నారు.


గురువారం ఈ విషయమై పంజాబ్ రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ను సిద్ధూ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు కలిశారు. అనంతరం సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ ‘‘పంజాబ్ లో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇక్కడ శాంతి భద్రతల ప్రస్తావనే కనిపించడం లేదు. మాన్ ప్రభుత్వంలో ఒకే నెలలో 40 చనిపోయారు. రాష్ట్రంలోని తీవ్ర పరిస్థితులపై గవర్నర్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. కానీ మాన్ పంజాబ్ గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా? ఆయన కేవలం ఆప్ ఢిల్లీ నాయకత్వం చేతిలో తోలు బొమ్మలా వ్యవహరిస్తున్నారు’’ అని అన్నారు.


ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ పై పంజాబ్ పోలీసులు కేసు పెట్టిన మరునాడే మాన్ ప్రభుత్వంపై సిద్ధూ గవర్నర్ ని కలవడం విశేషం. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‌పై కుమార్ విశ్వాస్ తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ రూప్ నగర్ పట్టణంలో కేసు నమోదైంది. కుమార్ విశ్వాస్ ఇటీవలి శాసన సభ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ, కేజ్రీవాల్‌కు ఖలిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నట్లు ఆరోపించారు.

Updated Date - 2022-04-22T00:02:46+05:30 IST