రాయలసీమ రైతు బాంధవుడు మన్రోలప్ప

Published: Wed, 06 Jul 2022 00:39:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాయలసీమ రైతు బాంధవుడు మన్రోలప్ప

తెలుగు ప్రజలు మరువరాని తెల్లదొరలలో అగ్రగణ్యుడు సర్ థామస్ మన్రో. రాయలసీమ వాసులకు ఆపద్భాంధవుడు. రాయలసీమ ప్రధాన కలెక్టర్‌గా రైతుల పట్ల ఎంతో ఉదారంగా వ్యవహరించాడు. రైత్వారీ విధానం ప్రవేశపెట్టి తరతరాల నుంచి పాలెగాండ్ర దోపిడీకి గురై ఇబ్బందుల పాలైన రైతులను ఆదుకున్నాడు. 1804లో కడప జిల్లాకు వరదలు వచ్చినప్పుడు చెరువులను, కాలువలను సకాలంలో మరమ్మత్తు చేయించి పుష్కలంగా పంటలు పండే ఏర్పాటుచేశాడు. మన్రో 1820 జూన్ 8న మద్రాసు గవర్నరుగా తిరిగివచ్చాక రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేశాడు.


థామస్‌ మన్రో పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కానుకగా ఇచ్చాడు. దీనినే మన్రో గంగాళం అంటారు. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు. తాడిపత్రిలోని చింతల రాయస్వామి ఆలయ ఆస్థాన మంటపాన్ని, కళ్యాణ మంటపాన్ని మరమ్మతు చేయించాడు. ఆలయంలో సక్రమంగా పూజలు జరిపే ఏర్పాటు చేశాడు. రాయదుర్గంలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామిని దర్శించాడు. ఆలయానికి మాన్యాలిచ్చాడు. రాయలసీమ తరతరాలుగా అనావృష్టికి గురి అయిన ప్రాంతం. ప్రకృతి వైపరీత్యానికి తోడుగా, పిండారీల దోపిడీలు, పాలెగాండ్ర దురాగతాలు సీమ ప్రజలను నానా యాతనలకు గురిచేసేవి. అశాంతితో పరితపిస్తున్న ప్రజానీకాన్ని ఆదుకొని, సీమలో శాంతిభద్రతలను నెలకొల్పిన మహనీయుడు మన్రో.


ప్రజలు, రైతుల నుంచి ఎటువంటి కానుకలు స్వీకరించేవాడు కాదు. మన్రోకు స్వాతగమివ్వటానికి ఒక గ్రామాధికారి తన గ్రామంలో పెద్ద పందిరి వేయించాడు. అందుకు కూలీలకు పైసా ఇవ్వలేదని తెలుసుకున్న మన్రో, పందిరి వద్దకైనా వెళ్ళక, చెట్టునీడన చిన్న డేరాలో మకాం చేశాడు. తన కింది అధికారులను కూడా అలాగే ఉండాలనేవాడు. రైతుల నుంచి ఎక్కువ శిస్తులు వసూలు చేయటం న్యాయం కాదనేవాడు. భూసంబంధమైన చట్టాల ముందు, బీదలు, ధనికులు అన్న తేడా ఉండకూడదన్నాడు. రాయలసీమ ప్రాంతంలో తానున్న ఏడేళ్ళకాలంలో మన్రో 2,06,819 పట్టాలను రైతులకు అందజేశాడు. రైతులకు భూమిపై సర్వహక్కులు ఉంటాయని ప్రకటించాడు. ఇందువల్ల భూమిసాగు గణనీయంగా పెరిగింది. ప్రభుత్వాదాయం పెరిగింది. భూస్వాములు రైతులకు అన్యాయం చేస్తున్నట్లు వార్త వచ్చిన వెంటనే వారి వద్దకు వెళ్ళి వారి కష్టసుఖాలను విచారించేవాడు. మైళ్ళ తరబడి కాలినడకన గ్రామాలను చూసేవాడు. పూడిపోయిన చెరువులలో వెంటనే పూడిక తీయించే ఏర్పాటు చేసేవాడు. ఉదారమైన భూమిశిస్తును ప్రకటించడం మన్రో గొప్పదనానికి నిదర్శనం.


అరాచకంగా వున్న రాయలసీమ జిల్లాల్లో జిల్లా కోర్టులు, పోలీసు యంత్రాంగాలు ఏర్పాటు చేశాడు. మన్రో కఠినచర్యల వల్ల సుస్థిరమైన పాలన ఏర్పడింది. 1813 లో ఛార్టర్ చట్టానికి సంబంధించిన పార్లమెంటు కమిటీ ముందు సాక్ష్యమిస్తూ, భారతదేశ సంస్కృతిని అనుసరించటం వల్ల ఇంగ్లండు లాభపడుతుందన్నాడు. భారతీయులు తయారుచేసే వస్తువుల నాణ్యత, ఐరోపాతో సమానమైనదన్నాడు. భారతీయులు తెలుగు, ఇంగ్లీషు భాషలు నేర్చుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పొందటానికి వీలుగా జిల్లా తాలూకా స్థాయిలో పాఠశాలలు నెలకొల్పాడు. 1805 నాటికే మన్రో తెలుగు రాయడం, చదవడం నేర్చుకున్నాడు. రైతులతో ఆయన తెలుగులో మాట్లాడేవాడు. తన కింది అధికారులు కూడా విధిగా తెలుగులోనే వ్యవహరించాలని ఆదేశించాడు. మన్రో భారతీయులను పెద్ద పదవులలో నియమించాడు. కలరా వ్యాధి సోకి పత్తికొండ వద్ద 1827జూలై 6న సర్ థామస్ మన్రో మరణించాడు. రాయలసీమ రైతుల పాలిట పెన్నిధిగా ప్రశంసలందుకున్న మన్రో శిలా విగ్రహాన్ని పత్తికొండ తాలూకా కార్యాలయం ఎదుట స్థాపించారు.

ముచ్చుకోట సురేష్ బాబు

(నేడు మన్రో వర్ధంతి)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.