పెళ్లితో తన లైఫ్ సెట్ అయిందనుకున్న భర్తకు భారీ షాకిచ్చిన NRI భార్య..!

ABN , First Publish Date - 2022-07-07T22:52:41+05:30 IST

NRI మహిళను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోవాలనుకున్న ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. తనను అమెరికా తీసుకెళతానని మాటిచ్చిన భార్య చివరకు మోసం చేసిందంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

పెళ్లితో తన లైఫ్ సెట్ అయిందనుకున్న భర్తకు భారీ షాకిచ్చిన NRI భార్య..!

ఎన్నారై డెస్క్: NRI మహిళను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోవాలనుకున్న ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. తనను అమెరికా తీసుకెళతానని మాటిచ్చిన భార్య చివరకు మోసం చేసిందంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. భార్యపై చీటింగ్ కేసు పెట్టాడు. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రం నవాన్‌షహర్ జిల్లాకు చెందిన జస్కరణ్ అనే యువకుడికి 2016లో సవితతో వివాహమైంది. సవిత అప్పటికే అమెరికాలో నివసిస్తోంది. సత్నామ్ అనే మరో వ్యక్తి ద్వారా సవిత గురించి జస్కరణ‌్‌కు తెలిసింది. సత్నామ్‌ స్థానికంగా ఓ ఫర్నీచర్ షాప్ నిర్వహిస్తాడు. సవిత తన మేనకోడలేనని సత్నామ్‌ జస్కరణ్‌కు తెలిపాడు. సవిత అమెరికాలోనే సెటిలైందని,  ఆమెను పెళ్లి చేసుకుంటే అమెరికాలో సెటిలవ్వాలన్న అతడి కోరిక నెరవేరుతుందన్నాడు. అంతా అనుకున్నట్టు జరగాలంటే రూ. 40 లక్షలు ఖర్చవుతుందన్నాడు. ఇద్దరి మధ్య బేరసారాలు జరిగాక చివరకు రూ.20 లక్షలు చెల్లించేందుకు జస్కరణ్ అంగీకరించాడు. 


2015లో తొలి విడతగా సత్నామ్‌కు రూ. 5.5 లక్షలు చెల్లించాడు.  ఆ తరువాత..సవిత ఆమె తల్లి, అత్తకు మరింత మొత్తాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలోనే 2016లో సవిత, జస్కరణ్‌ల వివాహం జరిగింది. అయితే.. పెళ్లైన కొద్ది రోజులకే ఆమె  అమెరికాకు వెళ్లిపోవడంతో అతడు షాకైపోయాడు. వెళుతూ వెళుతూ ఆమె బంగారు నగలు, ఖరీదైన దుస్తులు తన వెంట తీసుకెళ్లిపోయింది. ఆ తరువాత.. అతడి ఫోన్‌ నెంబర్‌ను బ్లాక్ చేసింది. అటు సత్నామ్ కూడా అతడి నుంచి తప్పించుకు తిరుగుతుండటంతో చివరకు బాధితుడు ఇటీవలే పోలీసులను ఆశ్రయించాడు. సవిత అడిగిన డబ్బులు ఇచ్చేందుకు తన పొలం కూడా అమ్మాల్సి వచ్చిందని ఫిర్యాదు చేశాడు.  సవితకు, ఆమె తరపు వారికి మొత్తం 20 లక్షలు చెల్లించానని వాపోయాడు. రూ. 3 లక్షల విలువైన నగలతో భార్య అమెరికాకు వెళ్లిపొయిందని ఆరోపించాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సవితపై సెక్షన్ 420(చీటింగ్), సెక్షన్ 120బీ(నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-07-07T22:52:41+05:30 IST