Advertisement

ఫలించని ప్రగతి మంత్రాలు

Aug 8 2020 @ 01:40AM

ప్రజలు ఖర్చు చేయడానికి భయపడుతున్నారు. అసలే చేతినిండా డబ్బులేని పరిస్థితి. హఠాత్తుగా అనారోగ్యానికి గురై, ఆస్పత్రిపాలైతే వైద్యం ఖర్చులు ఎలా భరించాలి? ఈ భయం ఎంతోమందిని వెంటాడుతోంది. తత్కారణంగా తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బును జాగ్రత్తగా దాచి పెట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో డిమాండ్ పునరుద్ధరణ ఎలా సాధ్యమవుతుంది? కనుకనే ప్రజలకు నగదు బదిలీ అవసరం గురించి డాక్టర్ మన్మోహన్ సింగ్ పునరుద్ఘాటించారు. 


దేశఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే విషయమై డాక్టర్ మన్మోహన్ సింగ్ రాసిన వ్యాసం ఒకటి కొద్ది రోజుల క్రితం ఒక జాతీయ దినపత్రికలో వెలువడింది (ఆర్థిక వేత్త ప్రవీణ్ చక్రవర్తి ఆ వ్యాసానికి సహ రచయిత). అందులో మూడు వాస్తవిక సూచనలు ఉన్నాయి. అవి: ప్రజల మధ్య ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడం; బ్యాంకర్లలో నమ్మకాన్ని పూర్వస్థితికి తీసుకురావడం; అంతర్జాతీయ సంస్థలలో విశ్వాసాన్ని పునఃస్థాపించడం. మన్మోహన్, చక్రవర్తి చేసిన సూచనలు విపులమైనవి. ప్రజల శ్రేయస్సు పట్టించుకునే ప్రభుత్వం అర్థం చేసుకోదగ్గవి. వాటి అమలు సైతం ప్రజాహిత ప్రభుత్వ సామర్థ్యానికి మించిన వ్యవహారమేమీ కాదు. 


ఊహించినట్టే మన్మోహన్ వ్యాసానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిస్పందన లేదు. సరే, ‘ప్రభుత్వం ప్రతి వ్యాసానికి ప్రతిస్పందించాలా?’ అని మీరు అడగవచ్చు. అటువంటి అవసరం లేదన్నదే నా సమాధానం. అయితే మన్మోహన్, చక్రవర్తిల వ్యాసం అసాధారణమైనది. పాలకులు తప్పక పట్టించుకోవల్సిన ప్రాముఖ్యత దానికి వున్నది. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఆర్థిక సంస్కరణల రచయిత, మాజీ ఆర్థిక మంత్రి (ఐదు సంవత్సరాలు), మాజీ ప్రధానమంత్రి (పది సంవత్సరాలు) అయిన మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిపై ఏమి చెబుతున్నారన్నది పాలకులు పట్టించుకోనవసరం లేదా? 


ఈ విషయాన్ని అలా వుంచుదాం. మన్మోహన్,-చక్రవర్తి సూచనలు అంగీకార యోగ్యమైనవేనా? ఆ వ్యాసంలోని భావాలు మీ చుట్టుపక్కల కన్పిస్తున్న వాస్తవ పరిస్థితులను వివరించేవేనని మీలో ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నేను నా సొంత జిల్లా (తమిళనాడులోని) శివగంగై, దాని చుట్టుపక్కల జిల్లాలలోని పరిస్థితులను ఆ భావాల వెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూడండి. 


ప్రజలు ఖర్చు చేయడానికి భయపడుతున్నారు. ఈ భయం వారిలో మహా విస్తారంగా ఉన్నది. అసలే చేతినిండా డబ్బులేని పరిస్థితి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు; ఇంకా పలువురు తమ ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయోనన్న ఆందోళనలో ఉన్నారు. హఠాత్తుగా అనారోగ్యానికి గురై, ఆస్పత్రిపాలు అయితే వైద్యం ఖర్చులు ఎలా భరించాలి? ఈ ఆలోచన, కాదు, భయం ఎంతోమందిని వెంటాడుతోంది. తత్కారణంగా తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బును చాలా జాగ్రత్తగా దాచి పెట్టుకుంటున్నారు. ఎవరికైనా జేబు నిండా డబ్బు వుంటే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు (పసిడి రూపేణా డబ్బును నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించడం ఆర్థిక అనిశ్చితికి తార్కాణం).


2020 జూలై 31 నాటి ప్రజల వద్ద రూ.26,72,446 కోట్ల కరెన్సీ ఉన్నది. గత 12 మాసాలలో డిమాండ్ 12.0 శాతం, గడువు డిపాజిట్ (టైం డిపాజిట్)లు 10.5 శాతం చొప్పున పెరిగాయి. ప్రజలు తమ డబ్బును ఖర్చు చేయడానికి సంసిద్ధపడుతున్న ప్రదేశాలు కిరాణా దుకాణాలు, కూరగాయాల, పండ్ల దుకాణాలు, ఫార్మసీలు మాత్రమే. తత్ఫలితంగా చాలా బట్టల షాపులు, చెప్పుల దుకాణాలు, ఫర్నిచర్, ఆట బొమ్మల విక్రయ కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఎలక్ట్రానిక్స్ దుకాణాలలో వినియోగదారులు చాల తక్కువగా మాత్రమే కన్పిస్తున్నారు. ఎక్కడ, ఎవరి నుంచి కరోనా వైరస్ తమకు సోకుతుందోనని ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఆ భీతితోనే డాక్టర్ల వద్దకు వెళ్ళడానికి, ఆస్పత్రులను సందర్శించడానికి భయపడుతున్నారు. జనరల్ ప్రాక్టీషనర్స్ చాలా మంది తమ క్లినిక్లను మూసివేసుకున్నారు. సంప్రదాయ వైద్యులకు డిమాండ్ పెరిగింది.


ఇటువంటి పరిస్థితులలో డిమాండ్ పునరుద్ధరణ ఎలా సాధ్యమవుతుంది? కనుకనే ప్రజలకు నగదు బదిలీల గురించి డాక్టర్ మన్మోహన్ సింగ్ పునరుద్ఘాటించారు. ప్రజలకు నగదు బదిలీలు జరగని ఏకైక పెద్ద దేశం భారత్ మాత్రమే. దారిద్ర్యరేఖకు ఎగువున ఉన్న కోట్లాది ప్రజలు పేదరికంలోకి కూరుకుపోవచ్చని భయపడుతున్నప్పటికీ ప్రజలకు నగదు బదిలీలు చేసేందుకు దేశ పాలకులు వెనుకాడుతున్నారు!


ఆర్థిక వ్యవస్థపై బ్యాంకర్లలో నమ్మకం ఎలా అడుగంటిపోయిందో చూద్దాం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ఉద్దీపనల గురించి చెబుతున్న మాటలను నాకు తెలిసిన బ్యాంకర్లు ఎవ్వరూ విశ్వసించడం లేదు. పాలకుల మాటకు వారు ఏమాత్రం విలువనివ్వడం లేదు. 2021 మార్చి నాటికి బ్యాంకుల నిరర్థక ఆస్తులు 14.7 శాతానికి పెరగనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ చేసిన హెచ్చరిక గురించే వారు చర్చించుకుంటున్నారు. సంభావ్య రుణగ్రహీతల తాజా ఆస్తి అప్పుల పట్టీ (బ్యాలెన్స్ షీట్) ఆధారంగా అప్పు ఇవ్వడానికి ఏ బ్యాంకూ సంసిద్ధంగా లేదు. ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన ‘రూ.3 లక్షల కోట్ల రుణ హామీ పథకం’ విషయమే చూడండి. ఈ పథకం కింద రూ.3 లక్షల కోట్ల విలువైన రుణాల ఎగవేత సొమ్మును బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లిస్తుందని మనం నమ్మాము. నిరర్థక ఆస్తుల విలువ రూ.3 లక్షల కోట్లు అయితే బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల విలువ రూ.30 లక్షల కోట్లు దాకా ఉంటుంది కదా. అయితే మనం పొరపడ్డాం. రూ.3 లక్షల కోట్ల అప్పులకు మాత్రమే హామీ ఇచ్చినట్టు ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది. ఇందులో రూ.1,36,000 కోట్లు మంజూరు చేశారు; రూ.87,227 కోట్లు పంపకం చేశారు! గాడిద తనను తాను నల్ల చీమగా కుదించుకున్నదనే తమిళ లోకోక్తి ఒకటి నాకు గుర్తుకు వస్తోంది. ‘రూ.3 లక్షల కోట్ల రుణ హామీ పథకం’ పట్ల ఇప్పుడు ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. అయితే ప్రభుత్వం దాని గురించి గొప్పగా చెప్పుకుంటోంది. అంతేకాదు దాన్ని బడా వ్యాపారసంస్థలకు, స్వయం ఉపాధి వృత్తి నిపుణులకు కూడా విస్తరింపచేసింది.


అయినప్పటికీ రుణాలు తీసుకునే వారిలో నమ్మకం జనించడం లేదు. తిర్పూర్ వస్త్ర పరిశ్రమలు కుదేలైపోయాయి హార్‌్డవేర్ వ్యాపారి, సిమెంట్, టైర్ డీలర్లు తమ డీలర్‌షిప్‌ను నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. సంభావ్య రుణ గ్రహీతలు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? తిరిగి చెల్లించలేని దుస్థితి వస్తుందేమోనన్న భయమే. సొంత డబ్బు వుంటే వ్యాపారంలో మదుపు చేస్తున్నాడు. లేనిపక్షంలో తక్కువ సామర్థ్యంతో ఉత్పాదక లేదా వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు ఇష్టపడుతున్నాడు. చిన్న పట్టణాలలోని చిన్న పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలే కాదు బడా వ్యాపార సంస్థలు కూడా ఇటువంటి విపత్కర పరిస్థితి పేర్కొంటున్నాయి. మూలధన వ్యయాలను తగ్గిస్తామని పలు బడా వ్యాపార సంస్థలు బహిరంగంగా ప్రకటించాయి. డబ్బును పొదుపు చేసుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నాయి. అప్పుల భారాన్ని పూర్తిగా వదిలించుకోవడమే తమ లక్ష్యమని ప్రముఖ వ్యాపార సంస్థలు ప్రకటించాయి. మరి ఇటువంటి పరిస్థితులు ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల సృష్టిపై ఎటువంటి ప్రభావాన్ని చూపగలవో మరి చెప్పనవసరం లేదు.


ప్రస్తుత ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్యాన్ని అపఖ్యాతి పాలు చేసింది. ఫలితంగా భారత్‌తో వ్యాపార లావాదేవీలు నిర్వహించే విషయమై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమ నిబంధనల ఉల్లంఘన గురించి భారత్ బహిరంగంగా మాట్లాడుతున్నది. బహుళపాక్షిక, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల వ్యతిరేక వైఖరిని తీసుకొంటుంది. ఆర్థికాభ్యుదయానికి దిగుమతి ప్రత్యామ్నాయం (ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్- స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా విదేశీ దిగుమతులను తగ్గించుకునే విధానం) కొత్త (పాత?) మార్గం అయింది. పరిమాణాత్మక పరిమితులు, అధిక సుంకాలు, సుంకాలేతర అవరోధాలు మళ్ళీ వచ్చాయి. ఇది ట్రంప్ ప్రభావమని నేను అంటాను; ప్రభుత్వమేమో ఆత్మనిర్భర్ అని అంటున్నది 1960-------–90 సంవత్సరాల మధ్య అనుసరించిన సంపూర్ణ సార్వభౌమాధికార విధానాలకు ఇది భిన్నమైనది కాదు.


సరే, వివిధ రాజ్యాంగ సంస్థల పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది. ఎలా ఉండవలసినవి ఎలా అయిపోయాయి? సమాచార కమిషన్, ఎన్నికల సంఘం, కాంపిటీషన్ కమిషన్, నీతి ఆయోగ్ (గతంలో ప్రణాళికా సంఘం), ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల మండలి, ప్రధాన ఆర్థిక సలహాదారు కార్యాలయం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొదలైనవెన్నో పాలకుల ఇష్టాయిష్టాలకు దాసోహమయిపోలేదూ? వివిధ హక్కుల సంఘాలు గాఢనిద్రలో ఉన్నాయి మానవ హక్కుల సంఘం మరీనూ! నేడు భారత్ పట్ల వ్యాపారసంస్థలు, సంస్థాగత మదుపుదారులు, పెన్షన్ ఫండ్స్, వెల్త్ ఫండ్స్ వైఖరి ప్రతికూలంగా ఉన్నది. మూడు సంక్షోభాలు- ఆర్థిక వ్యవస్థ దుర్నిర్వహణ, కొవిడ్-–19 ఉపద్రవం, చైనాతో ఘర్షణలు భారత్ బలహీనతలను బహిర్గతం చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ బయటపడేందుకు అనుసరించాల్సిన ఆచరణీయ, అనుకూల మార్గాన్ని పరిపూర్ణ దేశభక్తుడైన డాక్టర్ మన్మోహన్ సింగ్, ప్రవీణ్ చక్రవర్తి చూపారు. మరి మన పాలకులు ఆ మార్గాన్ని అనుసరిస్తారా?

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.