పాపం పసిపాప

ABN , First Publish Date - 2020-11-21T10:24:05+05:30 IST

ఏ తల్లి కన్న ఆడబిడ్డనో.. కానీ జిల్లా ఆస్పత్రిలో వదిలివెళ్లారు. భూమ్మీదపడ్డ ఆ పసికూనను గుర్తుతెలియని మహిళ వదిలివేయడంతో

పాపం పసిపాప

ఆడశిశువును వదిలేసిన గుర్తుతెలియని మహిళ

మానుకోట జిల్లా ఆస్పత్రిలో ఘటన


మహబూబాబాద్‌ రూరల్‌, నవంబరు 20: ఏ తల్లి కన్న ఆడబిడ్డనో.. కానీ జిల్లా ఆస్పత్రిలో వదిలివెళ్లారు. భూమ్మీదపడ్డ ఆ పసికూనను గుర్తుతెలియని మహిళ వదిలివేయడంతో అనాథగా మారిపోయింది. ఆ పసికందుకు ఐసీడీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని సర్కార్‌ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. మానుకోట ఐసీడీఎస్‌ ఏసీడీపీవో ఎల్లమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఓ మహిళ అప్పుడే పుట్టిన పసికందును అనారోగ్య కారణాల సాకు చూపుతూ శుక్రవారం ఉదయం 7.30 గంటలకు జిల్లా ఆస్పత్రిలోని శిశు సంజీవని వద్దకు తీసుకువచ్చింది. అక్కడ విధుల్లో ఉన్న నర్సు.. పాప వివరాలు అడుగగా ‘ పాప తల్లి గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉంది, పాపను ఇక్కడ ఉంచండి.. కిందకు వెళ్లి వివరాలు తెలుసుకుని వస్తాను’ అని చెప్పి కనిపించకుండా వెళ్లిపోయింది. తర్వాత ఆమె కోసం వేచి చూసిన సిబ్బంది విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో పసికందును వదిలివెళ్లిన విషయాన్ని వారు ఐసీడీఎస్‌ అధికారులకు తెలిపారు. ఏసీడీపీవో ఎల్లమ్మ, సూపర్‌వైజర్‌ దైద ఉషారాణి, చైల్డ్‌లైన్‌-1098 సిబ్బంది ఉమారాణి, ఉపేందర్‌, వెంకన్న ఆస్పత్రికి చేరుకుని పసికందు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.


పాపను పరీక్షించిన వైద్యులు బరువు తక్కువగా జన్మించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఆ శిశువుకు ఆక్సిజన్‌ అందిస్తూ మెరుగైన వైద్యచికిత్స చేస్తున్నారు. పాప పూర్తిగా కోలుకున్న తర్వాత వరంగల్‌ శిశువిహార్‌ కేంద్రానికి తరలించనున్నట్లు ఏసీడీపీవో ఎల్లమ్మ తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలోని సీసీ పుటేజీ ఆధారంగా పాపను తీసుకువచ్చిన మహిళను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2020-11-21T10:24:05+05:30 IST