ఈ పేటకు ఏమైంది?

ABN , First Publish Date - 2022-05-20T05:12:34+05:30 IST

నరసన్నపేట.. అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఒకటి. వ్యాపారం, విద్య పరంగా ఎంతో గుర్తింపు పొందింది. ఇలాంటి చోట ప్రజల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఈ మేజర్‌ పంచాయతీలో పాలకమండలి కొలువుదీరి ఏడాది దాటింది. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. ప్రారంభించిన పనులు కూడా మధ్యలో ఆగిపోయాయి.

ఈ పేటకు ఏమైంది?
నరసన్నపేటలో తాగునీటి కోసం ఇబ్బందులు

అంధకారంలో వీధులు
తాగునీటికి తీవ్ర ఇక్కట్లు
రోడ్డు మీదకు మురుగునీరు
ఇబ్బంది పడుతున్న ప్రజలు
(నరసన్నపేట)

నరసన్నపేట.. అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఒకటి. వ్యాపారం, విద్య పరంగా ఎంతో గుర్తింపు పొందింది. ఇలాంటి చోట ప్రజల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. ఈ మేజర్‌ పంచాయతీలో పాలకమండలి కొలువుదీరి ఏడాది దాటింది. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. ప్రారంభించిన పనులు కూడా మధ్యలో ఆగిపోయాయి. నరసన్నపేటలో 20 వార్డుల్లో 48,532 మంది జనాభా ఉన్నారు. ఈ పట్టణం బంగారం, స్టీల్‌, రైస్‌ వ్యాపారాలకు ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో వర్తక, విద్య పనులు మీద రోజూ ఇతర ప్రాంతాల నుంచి 20వేల మంది వరకు వచ్చి పోతుంటారు. కాగా, అధ్వాన రహదారులతో ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలు కిందట బజారువీధి గుండా డ్రైనేజ్‌ కోసం గుంత తీయగా.. పనులు జరగకపోవడంతో ఎంతోమంది ఈ గోతుల్లో పడి గాయపడ్డారు. ఈ మార్గంలో ప్రయాణం చేసేందుకు వాహనాలకు అవకాశం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బజారువీధి, తిరుమలవీధి, శ్రీవెంకటేశ్వర ఆలయం, శాంతమ్మ ఆలయాలకు వచ్చే మార్గంలో స్థానిక వార్డు సభ్యులు పనులు చేపట్టారు. సగం పూర్తయ్యాక చేతులు ఎత్తివేయడంతో.. పాతపైపులు బయటకు వచ్చి మురికినీరు రోడ్డుమీదకు వస్తోంది. మారుతీనగర్‌, శ్రీరామనగర్‌లో కూడా తాగునీటి పైపుల కోసం రోడ్లను గుంతలు చేసి అలా వదిలేశారు. వంశధార నగర్‌లో డ్రైనేజీలేక మురుగు నీరు రోడ్ల మీద పారుతోంది. చాలా వీధుల్లో ఇదే పరిస్థితి. ప్రశాంతనగర్‌, శ్రీరామనగర్‌, శ్రీనివాసనగర్‌, బండివీధి పందులు అవాసాలుగా మారాయి. వీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమం అటకెక్కడంతో రోడ్ల మీద ఎక్కడికక్కడ చెత్త కనిపిస్తోంది.

చీకటి పడితే అంతే
నరసన్నపేట మెయిన్‌ రోడ్డు  ఆరు నెలలుగా వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు చీకటిపడితే బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. మెయిన్‌రోడ్డు సత్యవరం జంక్షన్‌ నుంచి పల్లిపేట జంక్షన్‌ వరకు రాత్రి పూట బస్సు దిగి ఈ రోడ్డు మీద నడవాలంటే భయం. శ్రీనివాసనగర్‌, జమ్ముజంక్షన్‌, జయలక్ష్మీనగర్‌, బర్మాకాలనీ, రాజులు చెరువు గట్టు, శివానగర్‌ కాలనీ తదితర చోట్ల కూడా వీధిదీపాలు లేవు.

తాగునీటికి కటకట..
పంచాయతీ ట్యాంకును మూడు రోజులకు ఒకసారి పంపించడంతో నీటి కోసం వీరన్నాయుడు కాలనీవాసుల కష్టాలు పడుతున్నారు. సామాజిక మాద్యమాల ద్వారా పంచాయతీ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. సత్యవరం, జయలక్ష్మీ నగర్‌, శ్రీరామనగర్‌, మారుతీనగర్‌, శివనగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

పనులు జరగక.. పార్కింగ్‌ ఇలా
పల్లిపేట జంక్షన్‌ నుంచి సత్యవరం జంక్షన్‌ వరకు రోడ్డు విస్తరణ పనులు ఏడాది కిందట ప్రారంభించారు. ఇప్పటికీ నత్తనడకన సాగడంతో పేట మెయిన్‌ రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది. నిత్యం ట్రాఫిక్‌ స్తంభించి పోతోంది. మెయిన్‌రోడ్డుపై బ్యాంకులు, విద్యాసంస్థలు, వాప్యార సంస్థలు ఉండటంతో అడుగువేసి ముందుకు వెళ్లలేని పరిస్థితి.
 
పట్టణాన్ని వల్లకాడు చేశారు:
పంచాయతీ పాలకవర్గం అధికారంలోకి వచ్చిన నుంచి అభివృద్ధి పేరిట పట్టణాన్ని వల్లకాడు చేశారు. వీధిదీపాలు వెలగడంలేదు. తాగునీరు పంపిణీ చేయడం లేదు. డ్రైనేజీ పనులు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
- బెవర రాము, నరసన్నపేట

మెయిన్‌ రోడ్డుపై వీధి దీపాలేవీ?:
ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రాత్రిపూట బస్సు దిగితే మెయిన్‌రోడ్డుపై విద్యుత్‌ దీపాలు లేకపోవడంతో నడవాలంటే భయం వేస్తోంది. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. కనీసం వీధి దీపాలు అయినా వేయించండి.
- బుద్దల కేశవరావు, టీచర్‌, నరసన్నపేట

తాగునీరు ఇవ్వండి
వేసవిలో అయినా పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా చేయండి. మోటార్లు రిపేర్లు అయితే కొత్తవి ఏర్పాటు చేసి తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి.
- బాబు, సరియపల్లి మధు, బండివీధి నరసన్నపేట  

ఆర్డర్‌ పెట్టాం:
మేజర్‌ పంచాయతీలో వీధిదీపాలు వేసేందుకు ఆర్డర్‌ పెట్టాం. ఇంకా రాలేదు. రోడ్డు విస్తరణ పనులతో తాగునీటి ఇబ్బందులు వచ్చాయి. మోటార్లు మరమ్మతుల వల్ల తాగునీరు పంపిణీకి ఆటంకం ఏర్పడింది. బజారువీధిలో డ్రైనేజ్‌ పనులు చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం.
- నల్లాన రమేష్‌, ఈవో, నరసన్నపేట  

Updated Date - 2022-05-20T05:12:34+05:30 IST