ఖండాంతరాలకు మన్యం కాఫీ ఘుమఘుమలు

ABN , First Publish Date - 2022-10-01T06:47:52+05:30 IST

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన రైతులు సంప్రదాయేతర వాణిజ్య పంటగా సాగుచేస్తున్న కాఫీ ఘుమఘుమలు ఖండతరాలకు విస్తరించాయి.

ఖండాంతరాలకు  మన్యం కాఫీ ఘుమఘుమలు
ప్యారిస్‌లో ఏర్పాటు చేసిన ‘అరకు కాఫీ’ కేఫ్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ (ఫైల్‌ ఫొటో)

‘అరకు కాఫీ’ పేరుతో పలు దేశాలకు ఎగుమతులు

ఏజెన్సీలో సాగుకు బీజం వేసిన శాస్త్రవేత్త రాఘవేంద్రరావు

ఆయన పేరుతో గ్రామం, కాఫీ ఎస్టేట్‌ ఏర్పాటు

తొలుత అటవీ శాఖ, కాఫీ బోర్డు ఉమ్మడిగా సాగు

1974లో గిరిజనులతో సాగు ప్రారంభించిన ఐటీడీఏ

ఏటేటా పెరుగుతూ లక్షా 60 వేల ఎకరాలకు విస్తరణ

గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదం

నేడు అంతర్జాతీయ కాఫీ దినోత్సవం


చింతపల్లి, సెప్టెంబరు 30: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన రైతులు సంప్రదాయేతర వాణిజ్య పంటగా సాగుచేస్తున్న కాఫీ ఘుమఘుమలు ఖండతరాలకు విస్తరించాయి. మన్యం రైతులు పండిస్తున్న కాఫీ గింజలను ‘అరకు కాఫీ’ బ్రాండ్‌గా ఎగుమతులు చేస్తున్నారు. ప్రపంచంలోని పలు దేశాల ప్రజలు అరకు కాఫీ రుచులను ఆస్వాదించేందుకు ఆసక్తి చూపుతున్నారంటే ఆతిశయోక్తికాదు. ఉత్తమ కాఫీ ఉత్పత్తుల్లో ప్రపంచ దేశాల సరసన భారత దేశాన్ని నిలబెట్టిన ఘనత కూడా అరకు కాఫీకే దక్కుతుందని కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్యారిస్‌లో ఏర్పాటుచేసిన ‘అరకు కాఫీ’ కేఫ్‌లో ఏజెన్సీ గిరిజన రైతులు పండించిన కాఫీని సేవించేందుకు పలు దేశాల పర్యాటకులు క్యూ కడుతుంటారు. అరకు కాఫీ బిస్కెట్లు, చాక్లెట్లను కూడా తయారుచేసి విక్రయిస్తున్నారు. కాగా  భారత్‌ నుంచి ఎగుమతి అవుతున్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీ అగ్రస్థానంలో వుంది. 2015 నుంచి ఏటా అక్టోబరు ఒకటో తేదీన అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అనతి కాలంలోనే ప్రపంచంలో పలు దేశాల గుర్తింపు పొందిన మన్యం కాఫీ సాగుపై ప్రత్యేక కథనం.

ఏజెన్సీలో గిరిజన రైతులు వాణిజ్య సరళిలో కాఫీ సాగు చేపట్టడానికి 1969-70లో కేంద్ర కాఫీ బోర్డులో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రాఘవేంద్రరావు కృషి ఫలితమేనని చెప్పక తప్పదు. ఆయన గిరిజన ప్రాంతాల్లో పర్యటించి కాఫీ సాగుపై లోతుగా అధ్యయనం, పరిశోధనలు నిర్వహించారు. కాఫీ సాగుకి ఏజెన్సీ ప్రాంతం అత్యంత అనుకూలమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందజేశారు. దీంతో కాఫీ సాగుపై ప్రభుత్వాలు దృష్టిసారించాయి. తరువాత ఆయన పేరిట గూడెంకొత్తవీధి మండలంలో ఆర్‌వీనగర్‌(రాఘవేద్రరావు నగర్‌) గ్రామం, కాఫీ ఎస్టేట్‌ ఏర్పాటైంది.  

అటవీ శాఖ, కాఫీ బోర్డు ఉమ్మడిగా కాఫీ సాగు

ఏజెన్సీలో తొలుత అటవీ శాఖ, కాఫీ బోర్డు ఉమ్మడిగా 1970లో కాఫీ సాగును ప్రారంభించాయి. మొదటి ఏడాది 300 హెక్టారుల్లో కాఫీ మొక్కలు వేశారు. రెండేళ్లలో 1200 హెక్టార్లుకి విస్తరించింది. 1976 నుంచి ఏపీఎఫ్‌డీసీ (ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ) ఏజెన్సీలో పది మండలాల్లో కాఫీ సాగు చేపట్టింది. ప్రస్తుతం ఈ సంస్థ ఆధీనంలో 4,010 హెక్టారుల్లో కాఫీ తోటలు వున్నాయి. కాఫీ సాగు విజయవంతం కావడంతో ఐటీడీఏ అధికారులకు ఈ పంటను గిరిజన రైతులతో సాగు చేయించాలని నిర్ణయించారు. 1974లో మొట్టమొదటిసారిగి గిరిజన రైతులు కాఫీ సాగు ప్రారంభించారు. ప్రస్తుతం పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 1.6 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు వున్నాయి. 

కాఫీ సాగు విస్తర్ణకు కృషి

దేశంలో కాఫీ సాగు విస్తరణలో కేంద్ర కాఫీ బోర్డు ప్రధాన భూమిక పోషిస్తున్నది. పాడేరు, అరకు, చింతపల్లి ప్రాంతాల్లో కాఫీ బోర్డు విస్తరణ కార్యాలయాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ పరిశోధన స్థానాలను కాఫీ బోర్డు ఏర్పాటుచేసింది. గూడెంకొత్తవీధి మండలం ఆర్‌వీనగర్‌ వద్ద 1976లో రీజనల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌, 1982లో ప్రయోగశాలను ఏర్పాటుచేశారు. పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి పలు రకాల నాణ్యమైన విత్తనాలను రైతులకు అందజేశారు. 

ఫైన్‌ అవార్డుల్లోనూ..

కాఫీ బోర్డు నిర్వహించే ఫైన్‌ కప్‌ అవార్డుల్లోనూ ఏజెన్సీ రైతులు, ఏపీఎఫ్‌డీసీ సత్తాచాటుతున్నారు. అరకు డివిజన్‌ పరిధిలో ఇద్దరు రైతులు, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఇద్దరు రైతులతోపాటు రెండు స్వయం సహాయక సంఘాల సభ్యులు గత 12 ఏళ్లలో ఫైన్‌ కప్‌ అవార్డులను అందుకున్నారు. ఏపీఎఫ్‌డీసీ 12సార్లు ఫైన్‌ కఫ్‌ అవార్డును సొంతం చేసుకుంది 


Updated Date - 2022-10-01T06:47:52+05:30 IST