మన్యంలో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-10-04T06:43:59+05:30 IST

పశ్చిమ బంగాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం మన్యంలోని పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

మన్యంలో భారీ వర్షం
పాడేరు మెయిన్‌రోడ్డులో భారీ వర్షం కురుస్తున్న దృశ్యం


ఉపరితల ఆవర్తన ప్రభావం.... జన జీవనానికి అంతరాయం 


పాడేరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బంగాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం మన్యంలోని పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పాడేరులో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ముసురు వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత భారీ వర్షం మొదలై సమారు గంటన్నరపాటు ఏకధాటిగా కురిసింది. రోడ్లన్నీ జలమయం కాగా, పంట పొలాల్లో నీరు చేరింది. దసరా పండుగ సందర్భంగా నిత్యావసర సరకులు, గృహోపకరణాలు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం చుట్టుపక్కల మండలాల నుంచి పాడేరు వచ్చిన గిరిజనులు ఇబ్బంది పడ్డారు. కాగా హుకుంపేట, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. 

చింతపల్లి, జీకేవీధిలో భారీ వర్షం

చింతపల్లి, అక్టోబరు 3: చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైవుంది. మధ్యాహ్నం చిరు జల్లులతో మొదలైన వర్షం సాయంత్రం నాలుగు గంటల ఊపందుకున రాత్రి వరకు కుండ పోతగా కురిసింది. రహదారులన్నీ వర్షపు నీటితో కాలువలను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అన్నవరం, ఆర్‌వీనగర్‌ వారపు సంతల్లో చిరువ్యాపారులు, వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. 

Updated Date - 2022-10-04T06:43:59+05:30 IST