ఛత్తీస్‌గఢ్‌లో కీలక మావోయిస్టు కమాండర్‌ అరెస్టు

ABN , First Publish Date - 2021-07-27T04:45:57+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పలు విధ్వంసాలకు పాల్పడిన కీలక మావోయిస్టు నేత హుంగాను సోమవారం సుక్మా జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో కీలక మావోయిస్టు కమాండర్‌ అరెస్టు

చర్లలో పట్టుబడ్డ ఐదుగురు మిలీషియా సభ్యులు 

దుమ్ముగూడెం/చర్ల, జూలై 26: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో పలు విధ్వంసాలకు పాల్పడిన కీలక మావోయిస్టు నేత హుంగాను సోమవారం సుక్మా జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం దుమ్ముగూడెం మండల సరిహద్దు సుక్మా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్‌ పరిధి అటవీప్రాంతంలో 17ప్రధాన సంఘటనల్లో మావోయిస్టు కమాండర్‌ టైగర్‌ హుంగా కీలక నిందితుడిగా ఉన్నాడు. పోలోడి అటవీ ప్రాంతంలో 2018 మార్చిలో రహదారుల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న లాండ్‌మైన్‌ ప్రూఫ్‌ వాహనాన్ని పేల్చివేసిన సంఘటనలో హుంగా మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించాడు. ఈ పేలుడులో తొమ్మిది మంది జవాన్లు మృతిచెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే 2020లో హుంగా నేతృత్వంలో జరిగిన ఐఈడీ పేలుడు ఘటనలో సీఆర్‌పీఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ ప్రాణాలు కోల్పోయాడు.

మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్ట్‌

భద్రాద్రి జిల్లా చర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధి బూరుగుపాడుకు చెందిన ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను సోమవారం చర్ల పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో పండో ఇరమయ్య, రవ్వ బండి, మడివి లక్ష్మయ్య, వంజం గంగయ్య, సోడి భద్రయ్యలున్నారు. ఈనెల 28నుంచి మావోయిస్టులు తలపెట్టిన అమరుల సంస్మరణ వారోత్సవ వాల్‌పోష్టర్లు, కరపత్రాలను ఆర్‌కొత్తగూడెం-కుర్నపల్లి రహదారిపై వేసేందుకు వస్తున్న క్రమంలో కుర్నపల్లి అటవీప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు పట్టుబడ్డారు. వీరి వద్ద ఐదు వాల్‌పోష్టర్లు, 30కరపత్రాలు లభించాయి. నింధితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదివాసీ ప్రజలు నిషేధిత మావోయిస్టు పార్టీ కోసం పనిచేయొద్దని పోలీసు అధికారులు కోరారు.

Updated Date - 2021-07-27T04:45:57+05:30 IST