మావోయిస్టుల లొంగుబాటు!

ABN , First Publish Date - 2021-06-21T07:21:23+05:30 IST

నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలను లొంగుబాటు దిశగా తిప్పుకునే ప్రయత్నాలను పోలీసులు మరోసారి ము మ్మరం చేస్తున్నారు. జిల్లాకు చెందిన కొంతమంది మావోయిస్టులు ఇప్పటికీ చత్తీస్‌ఘడ్‌, మహరాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్‌ రాష్ర్టాల్లో పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు.

మావోయిస్టుల లొంగుబాటు!
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత సట్వాజీకి భూమి పత్రాలను అందిస్తున్న ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌(ఫైల్‌)

అజ్ఞాత మావోయిస్టుల లొంగుబాటుకు ప్రయత్నాలు 

జిల్లాకు చెందిన అగ్రనేతలే లక్ష్యంగా పోలీసుల వ్యూహం 

నజరానాలు, పునరావాసం కల్పిస్తామంటూ భరోసా 

కుటుంబ సభ్యులు, మాజీలతో పోలీసు ఉన్నతాధికారుల వ్యూహరచన 

అయినా.. అంతటా అప్రమత్తత

నిర్మల్‌, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి) నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలను లొంగుబాటు దిశగా తిప్పుకునే ప్రయత్నాలను పోలీసులు మరోసారి ము మ్మరం చేస్తున్నారు. జిల్లాకు చెందిన కొంతమంది మావోయిస్టులు ఇప్పటికీ చత్తీస్‌ఘడ్‌, మహరాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్‌ రాష్ర్టాల్లో పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. మరికొందరు కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో లలో సభ్యులుగా కొనసాగుతూ ఉద్యమ కార్యకలాపాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత సట్వాజీ, అలియాస్‌ సుధాకర్‌ దంపతులకు పోలీసులు ఇటీవలే పూర్తిస్థాయి పునరావాసాన్ని అందించారు. ఆయనకు మొదట్లో నిర్ధేశించిన నగదు రివార్డును అందించిన పోలీసులు, ఇంటి స్థలాన్ని, ఐదు ఎకరాల భూమిని ఉపాధి కోసం అందించారు. ఇలా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయే విధంగా మరోసారి పకడ్బందీ వ్యూహరచన తెరపైకి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన పలువురు మావోయిస్టులు ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో కొనసాగుతున్నారు. కొద్దిరోజుల క్రితం వీరి లొంగుబాట్ల కోసం పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేశారు. పోలీసులు చివరి వరకు వీరి లొంగుబాట్ల కోసం చేసిన ప్రయత్నాలు తృటిలో విఫలమయ్యాయన్న ప్రచారం ఉంది. ఇప్పటికే జిల్లాలోని చాలా మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోగా.. వారందరికీ నగదు రివార్డుతో పాటు పునరావాసం కూడా కల్పించారు.

ఇప్పటికే కొందరికి పునరావాసం

జిల్లాకు చెందిన సట్వాజీతో పాటు ఆయన భార్య, అలాగే మురళీ అలియాస్‌ రవి, ఆయన భార్య సుజాతలతో పాటు తదితరులు ఇప్పటికే లొంగిపోయి పునరావాసం పొందారు. ప్రస్తుతం లక్ష్మణచాంద మండలం కూచన్‌పల్లికి చెందిన ఇర్వి మోహన్‌ రెడ్డి, ఖానాపూర్‌ మండలానికి చెందిన కంతి లింగవ్వతో పాటు జిల్లాతో సంబంధం ఉన్న మైలారపు అడెల్లు అలియా స్‌ భాస్కర్‌, తదితరులు ఇప్పటికే మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతూ ఆ పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన కేంద్ర కమిటీ సభ్యులు, మిలటరీ విభాగం చీఫ్‌గా చెప్పుకునే కట్కం సుదర్శన్‌, అలియాస్‌ ఆనంద్‌ కూడా అజ్ఞాత కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే జిల్లాకు చెందిన మోహన్‌రెడ్డితో పాటు కంతి లింగవ్వ, మైలారపు అడెల్లు, తదితరుల లొంగుబాటుకు పోలీసులు గత యేడాదిన్నర నుంచి అన్నిరకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీరు లొంగిపోతే.. ఇక ఆ పార్టీ తీవ్రత జిల్లాలో ఏ మాత్రం ఉండదని పోలీసులు విశ్వసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పోలీసులు మైలారపు అడెల్లు, అలియాస్‌ భాస్కర్‌తో పాటు కంతి లింగవ్వల లొంగుబాటు కోసం పెద్దఎత్తున ప్రయత్నాలు చేశారు. ఓ దశలో వీరు ఇద్దరు పోలీసులకు లొంగిపోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది.

సామాజిక సేవా కార్యక్రమాలు

కంతి లింగవ్వ స్వగ్రామం లక్ష్మిపూర్‌తో చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు సా మాజిక సేవా కార్యక్రమాలను చేపట్టి అక్కడి ప్రజల సానుభూతిని పొందారు. అ యితే కంతి లింగవ్వ కుటుంబ సభ్యులు సైతం భాస్కర్‌తో పాటు లింగవ్వ లొం గుబాటుకు పూర్తిగా సహకరిస్తామని, వారు లొంగిపోవాల్సిందిగా బహిరంగంగా ప్రకటించారు. అయితే లొంగుబాటు ప్రక్రియ సక్సెస్‌ అవుతుందన్న ప్రచారం మొ దలుకాగానే మైలారపు అడెల్లు ఆ ప్రచారాన్ని ఖండించడమే కాకుండా జిల్లా నుంచి తరలిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాదాపు రెండు, మూడు నెలల పాటు అడెల్లు, లింగవ్వలతో పాటు మరికొంతమంది మావోయిస్టులు జిల్లాలో సంచరించడమే కాకుండా పార్టీ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నాలు చేశా రు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు అప్పటి ఎస్పీ శశిధర్‌ రాజు నేతృత్వం లో జిల్లాలోని మారుమూల పల్లెలపై పకడ్బందీ నిఘా సారించారు. వారి లొంగుబాటు ప్రయత్నాలు ఫలించకపోవడం, మావోయిస్టుల కార్యకలాపాలు కొంతమేర తగ్గుముఖం పట్టడంతో పోలీసు యంత్రాంగం కరోనా వారియర్స్‌గా మారిపోయింది. గత యేడాదిన్నర కాలం నుంచి పోలీసు యంత్రాంగం అంతా సాధారణ కార్యకలాపాలతో పాటు కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలు పనుల్లోనే నిమగ్నమయ్యాయి. అయినప్పటికీ పోలీసు నిఘా వర్గాలు జిల్లావ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలపై ఓ కన్నేశాయి. దీని కోసం  జిల్లాలో మరోసారి ఆపరేషన్‌ సరేండర్‌ను వ్యూహత్మకంగా అమలు చేయాలని పోలీసు యంత్రాంగం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాకు చెందిన మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత, ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడైన సట్వాజీ ఆలియాస్‌ సుధాకర్‌కు గతంలో ఇచ్చిన హామీ మేరకు పునరావాసం కింద ఐదు ఎకరాల స్థలాన్ని పోలీసులు ఇటీవలే అందించి అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టుల లొంగుబాట్ల కు మార్గం సులభతరం చేస్తున్నారంటున్నారు. 

పకడ్బందీగా ఆపరేషన్‌ సరెండర్‌

కరోనా కారణంగా స్తంబ్ధంగా ఉన్న పోలీసులు మరోసారి మావోయిస్టు కార్యకలాపాలపై ప్రస్తుతం ఫోకస్‌ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ నేతల కుటుంబ సభ్యులతో మరోసారి సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారంటున్నారు. అలాగే మాజీ మావోయిస్టుల సహకారం కూడా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన ఐదారుగురు మావోయిస్టులు చాలా యేళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అధికారికంగా ముగ్గురు, నలుగురి పేర్లు వెల్లడవుతున్నప్పటికీ మరో నలుగురైదుగురు కూడా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభించిన్నా.. మావోయిస్టులు లొంగుబాటుకు తలొగ్గలేదు. పలు కారణాల వల్ల మావోయిస్టుల లొంగుబాట్లు ఫలించలేదు. అందుకు పోలీసులు కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా లొంగుబాట్లు ఫలించకపోవడంతో మావోయిస్టు కార్యకలాపాలపై మరింత నిఘా పెంచారు. రహస్యంగా ప్రత్యేక బలగాలను రంగంలోకి దించి కూంబింగ్‌లను సైతం కొనసాగించారు. అలాగే ప్రభావిత గ్రామాలపై కూడా దృష్టి కేంద్రీకరించారు.

కరోనాతో మావోయిస్టుల లొంగుబాటుపై ఆశలు

గత కొద్ది రోజుల నుంచి చాలామంది మావోయిస్టులు అడవుల్లో కరోనా వైరస్‌ బారిన పడ్డారంటూ పెద్దఎత్తున జరుగుతున్న ప్రచారం పోలీసుల్లో ఈ లొంగుబాట్లపై మరోసారి ఆశలు రేపింది. దీనికి అనుగుణంగానే పోలీసులు మారుమూల పల్లెలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. అలాగే పల్లెల్లోని దవాఖా నాలతో పాటు అజ్ఞాతంలో ఉన్న మావోయస్టుల బంధువులపై కూడా నిఘా సారించారు. మావోయిస్టులు కరోనా చికిత్సల కోసం జిల్లాలోకి వచ్చే అవకాశాలున్నట్లు ఇంటలిజెన్స్‌ వర్గాలు సైతం ధ్రువీకరించాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు పల్లెల్లో తమకున్న నెట్‌వర్క్‌ ద్వారా వివరాలను సేకరిస్తూ వచ్చారు. పట్టణ ప్రాంత దవాఖానాల్లోని డాక్టర్లతో పాటు పల్లెల్లోని ఆర్‌ఎంపీలను అప్రమత్తం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు కరోనా చికిత్స కోసం వస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు పలు ప్రైవేటు ఆసుపత్రులకు తాఖీదులు జారీ చేశారన్న ప్రచారం కూడా జరిగింది. దీనికి అనుగుణంగానే అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కుటుంబ సభ్యులతో కూడా పోలీసులు మరోసారి సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలిసింది. కరోనాతో బాధపడుతున్న మావోయిస్టులు లొంగిపోయినట్లయితే వారికి పూర్తి రక్షణ కల్పించి నగదు రివార్డు, పునరావాసం కల్పిస్తామని కూడా పోలీసు శాఖ ఉన్నతాధికారులు బహిరంగ ప్రకటనలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లు పూర్తిగా తగ్గుముఖం పట్టినా..  మావోయిస్టుల కదలికలు బయట పడలేదు. దీంతో నిరాశకు గురైన పోలీసు లు తమవంతు ప్రయత్నాల్లో రాజీపడడం లేదంటున్నారు. 

Updated Date - 2021-06-21T07:21:23+05:30 IST