పరేడ్‌ మైదానంలో మార్చ్‌ఫాస్ట్‌

ABN , First Publish Date - 2022-01-27T05:08:26+05:30 IST

మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరింపచేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు.

పరేడ్‌ మైదానంలో మార్చ్‌ఫాస్ట్‌
జెండాను ఎగురవేస్తున్న కలెక్టర్‌

 గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు

కర్నూలు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరింపచేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు అన్నారు. 73వ గణతంత్ర వేడుకలు పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో బుధవారం ఘనంగా జరిగాయి. కలెక్టర్‌ 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు. అనంతరం సాయుధ బలగాలు కవాతు నిర్వహించాయి. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, జిల్లాకు కేటాయించిన నిధుల గురించి సమగ్రంగా వివరించారు. 

-  హాలహర్వి మండలం గూల్యం వద్ద రూ.1,942 కోట్ల అంచనా వ్యయంతో వేదవతి ఎత్తిపోతల పథకం ద్వారా 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు పనులు ప్రారంభించినట్లు చెప్పారు. పశ్చిమ ప్రాంతంలో 40 వేల ఎకరాలకు నీరందించేందుకు రూ.1,995 కోట్లతో రాజోలిబండ కుడిగట్టు కాలువ పనులు, రూ.224 కోట్లతో పశ్చిమ ప్రాంతంలోని కరువు పీడిత మండలాల్లో నీరందించేందుకు 68 చెరువులను హంద్రీనీవా నీటితో నింపేందుకు చేపడుతున్న పనులు పూర్తి కావచ్చాయన్నారు. రూ.1,415 కోట్ల వ్యయంతో కుందూ నది వెడల్పు పనులు, బ్రిడ్జి నిర్మాణ పనులు, అలాగే కుందూ నది మీద 2.95 టీఎంసీలు నిల్వ చేసే రిజర్వాయర్‌ నిర్మాణానికి, జోలదరాసి వద్ద రూ.312 కోట్లతో 0.80 టీఎంసీల నిల్వ ద్వారా 91 వేల ఎకరాలకు నీరందించే రిజర్వాయర్‌ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయన్నారు. అనంతరం జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను కలెక్టర్‌, ఎస్పీ, జేసీలు శాలువాలు కప్పి సత్కరించారు.

-  కార్యక్రమంలో ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, జేసీలు మనజీర్‌ జిలానీ సామూన, ఎంకేవీ శ్రీనివాసులు, జడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ జిల్లా స్థాయి అధికారులు, పోలీసు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

-  అలరించిన శకటాలు

గణతంత్ర వేడుకల్లో భాగంగా జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శకటానికి మొదటి బహుమతి, అగ్నిమాపక శాఖ శకటానికి రెండో బహుమతి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటానికి మూడో బహుమతి లభించాయి. కన్సోలేషన బహుమతిని డీఆర్‌డీఏ శకటం అందుకుంది.

- ఈసారి ఓమైక్రాన నేపథ్యంలో అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు. దీంతో ప్రతి ఏటా మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాగే వేడుకలు ఈసారి 11:30 కల్లా ముగిశాయి. ప్రశంసా పత్రాలను అందుకునేందుకు ఉద్యోగులు రాకపోవడంతో సందడి లేకుండా పోయింది. 394 మంది ప్రశంసా పత్రాలు అందుకోవాల్సి ఉంది. సరైన పీఆర్సీ ఇవ్వనందుకు వీటిని బహిష్కరిస్తున్నట్లు ఉద్యోగులు చెప్పడంతో ఆ వేడుకలు కూడా జరగలేదు.






Updated Date - 2022-01-27T05:08:26+05:30 IST