Margaret Alvaకు 19 పార్టీల మద్దతు..19న Nomination

ABN , First Publish Date - 2022-07-17T23:47:21+05:30 IST

రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వాను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్ష పార్టీలు..

Margaret Alvaకు 19 పార్టీల మద్దతు..19న Nomination

న్యూఢిల్లీ: రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వా (Margaret Alav)ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్ష పార్టీలు ప్రకటించాయి. 80 ఏళ్ల మార్గరెట్ ఆల్వాకు 19 పార్టీలు మద్దతు ఇస్తుండగా, ఈనెల 19న ఆమె నామినేషన్ (Nomination) వేయనున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) నివాసంలో ఆదివారం సుమారు 2 గంటల సేపు సమావేశమైన విపక్ష పార్టీల నేతలు ఆల్వా అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నారు. 17 పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


సమావేశానంతరం విపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వాను ఎంపిక చేసినట్టు శరద్ పవార్ ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా తమ నిర్ణయానికి మద్దతు పలికినట్టు చెప్పారు. దీంతో 19 పార్టీల మద్దతు ఆల్వాకు లభించింది. పవార్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేతలు డి.రాజా, బినయ్ విశ్వసం, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, డీఎంకే నేతలు టీఆర్ బాలు, తిరుచ్చి శివ, ఎస్‌పీ నేతలు రామ్ గోపాల్ యాదవ్, ఎండీఎంకే నేతలు వైకో, టీఆర్ఎస్ నేత కె.కేశవరావు, ఆర్జేడీ నేత ఏడీ సింగ్, ఐఎంయూఎల్ నేత మొహమ్మద్ బషీర్, కేరళ కాంగ్రెస్ (ఎం) నేత జోష్ కె.మణి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎన్టీయే ఇప్పటికే తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌ పేరును ప్రకటించింది. ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్లు వేసే గడువు ఈనెల 19వ తేదీతో ముగియనుంది.

Updated Date - 2022-07-17T23:47:21+05:30 IST