మారీచులెవరు మాయలమారీ?

ABN , First Publish Date - 2022-03-20T05:47:59+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి మీడియాపై పిచ్చి కోపం వచ్చింది. తన అడుగులకు మడుగులొత్తని మీడియా సంస్థలను ఉన్మాదులుగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబునాయుడు తనకు నథింగ్‌ అని, ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలే తనకు పోటీ అని...

మారీచులెవరు మాయలమారీ?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి మీడియాపై పిచ్చి కోపం వచ్చింది. తన అడుగులకు మడుగులొత్తని మీడియా సంస్థలను ఉన్మాదులుగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబునాయుడు తనకు నథింగ్‌ అని, ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలే తనకు పోటీ అని, మేం మారీచుల్లాగా ఆయనతో తలపడుతున్నామని జగన్‌రెడ్డి వాపోతున్నారు. మునులు, రుషులు తలపెట్టిన యజ్ఞయాగాదులను కంటికి కనిపించకుండా మారీచుడు అనే రాక్షసుడు భగ్నం చేసేవాడని పురాణాల్లో మనం చదువుకున్నాం. అటువంటి మారీచుడితో ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలను ఆయన పోల్చారు. అదే సమయంలో మరో రెండు మీడియా సంస్థలను కూడా ఉన్మాదులుగా అభివర్ణించారు. ఇప్పుడు మారీచులెవరో పరిశీలిద్దాం. మూడేళ్ల జగన్‌రెడ్డి పాలన గమనించిన వారికి ఆయనలోనే మారీచుడి లక్షణాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. ‘ఒక్క చాన్స్‌’ అంటూ ప్రజలను మాయ మాటలతో బుట్టలో వేసుకొని రాష్ర్టాన్ని చెరబట్టిన ‘కీచకుడు’ జగన్‌రెడ్డి అని అనవచ్చునా మరి? నిను ఏమని వర్ణించుదు అన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని ఏమని వర్ణించాలో, ఆయన లీలలను ఎలా అభివర్ణించాలో తెలియని పరిస్థితి. చరిత్రలో చాలామంది నియంతలను చూశాం. నియంతల్లో చరిత్రకెక్కిన వారెవరూ జగన్‌రెడ్డి వలె ప్రవర్తించలేదు. అప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్య భారతంలో జగన్‌రెడ్డి రూపంలో సరికొత్త నియంతను చూస్తున్నాం. జగన్‌రెడ్డిని అభివర్ణించడానికి తెలుగు భాషలోనే కాదు ప్రపంచంలోని ఏ భాషలో కూడా పదాలు లభించడం లేదు. నలుగురిలో ఉన్నప్పుడు ఒకలా, ఒంటరిగా ఉన్నప్పుడు మరోలా ప్రవర్తించే జగన్‌రెడ్డితో మరొకరిని పోల్చలేం. మమ్మల్ని నిందిస్తున్న జగన్‌రెడ్డిలోనే ఉన్మాద, మారీచుడి లక్షణాలు ఉన్నాయి. అధికారం చేపట్టిన నాటి నుంచి విధ్వంసమే ఎజెండాగా ఆయన సాగుతున్నారు. గోబెల్స్‌ గురించి తరచుగా మాట్లాడే ఈ జగన్‌రెడ్డి, నాటి గోబెల్స్‌ను మించి ఎన్నికలకు ముందు అసత్యాలను ప్రచారం చేశారు. నాడు చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని ఇప్పుడు ఆయన ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తోంది. మీడియాలో ఎవరైనా కట్టుకథలు ప్రచారం చేస్తే వెంటనే కేసులు పెట్టడానికి వీలుగా జీవో తెచ్చిన జగన్‌ ప్రభుత్వం, ఇంతవరకు ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలపై ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేకపోతున్నారో చెప్పగలరా? అంటే ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురిస్తున్న, ‘ఏబీఎన్‌’ ప్రసారం చేస్తున్న కథనాలు అక్షర సత్యాలని ప్రభుత్వ పెద్దలు అంగీకరిస్తున్నట్టే కదా! ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన విషయం వాస్తవమే అయినప్పటికీ జగన్‌రెడ్డి పాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతోందని జగన్‌ అండ్‌ కో చెప్పగలరా? నీలి మీడియా, కూలి మీడియాకు ఆయన వీరుడు, శూరుడిగా కనిపిస్తే కనిపిస్తుండవచ్చు. రాష్ట్రం అభివృద్ధి బాటలో దౌడు తీస్తోందని అనిపిస్తుండవచ్చు. కుల మతాలకు అతీతంగా పాలన సాగుతోందని నమ్ముతుండవచ్చు. వాస్తవంలో జరుగుతున్నది ఏమిటి? ఎక్కడ చూసినా వంచనే. ప్రభుత్వ నిర్ణయాలలో అణువణువునా కపటత్వం నిండి ఉంటుంది. కక్షలూ కార్పణ్యాలకు కొదవే లేదు. వ్యవస్థలను విధ్వంసం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టిన న్యాయవ్యవస్థపై దాడికి తెగబడిన మారీచులు ఎవరు? అటువంటి వారికి వ్యక్తిగత స్వార్థానికి కక్కుర్తిపడకుండా, రాష్ట్రహితం కోసం పోరాడుతున్న మీడియా ఉన్మాదులుగానే కనిపిస్తుంది మరి! అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలను జగన్‌రెడ్డి తన సొంత మీడియాకు ప్రకటనల రూపంలో దోచిపెట్టారు. స్వతంత్ర భారతావనిలో ఒక ప్రభుత్వం ఇంత భారీ మొత్తం ప్రకటనల కోసం ఖర్చు చేయడాన్ని ఇప్పుడే చూస్తున్నా. ఈ మూడేళ్లలో ‘ఆంధ్రజ్యోతి’ పత్రికకు ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా జగన్‌ ప్రభుత్వం ఇవ్వలేదు. అయినా మేం ప్రకటనల కోసం ప్రభుత్వాన్ని దేబిరించలేదు. తనకు ఇష్టమైన పత్రికలకు మాత్రమే ప్రకటనలు ఇస్తూ ‘ఆంధ్రజ్యోతి’ని పూర్తిగా విస్మరించినా మేం పట్టించుకోలేదు. ఈ మూడేళ్లలో 250 కోట్ల రూపాయలకు పైగా మా వాటాగా రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయినా మేం మడమ తిప్పలేదు. ఎంతమంది రాయబారం నడిపినా మా వైఖరి మార్చుకోలేదు. జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వనాశనం అవుతోందని మేం బలంగా నమ్ముతున్నాం. ఎన్నికలకు ముందే జరగబోయేది ఏమిటో ప్రజలకు చెప్పాం. అయినా జగనే ముద్దు అనుకున్న వాళ్లు ఇప్పుడు అనుభవిస్తున్నారు. జగన్‌తో మాకేమీ ఆస్తుల పంచాయితీ లేదుగా? ప్రభుత్వ పోకడల వల్ల రాష్ట్ర విశాల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నదే నాడు–నేడు మా ఆవేదన. అందుకే జగన్‌రెడ్డి వంటి నియంతతో నిలబడి కలబడుతున్నాం. పర్యవసానాల గురించి ఆలోచించే అలవాటు మాకు ఎప్పుడూ లేదు. కొన్ని మీడియా సంస్థలనే తనకు పోటీ అంటున్న జగన్‌రెడ్డి, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకున్నారా? తన గురించి తన సొంత మనుషులు ఏమనుకుంటున్నారో తెలుసుకొనే ప్రయత్నం కూడా ఆయన చేయలేదే! తల్లీ చెల్లీ దూరమవడానికి మేం కారణం కాదే! తోడబుట్టిన షర్మిలకు ఆస్తిలో వాటా ఇవ్వడానికి జగన్‌రెడ్డి నిరాకరించడానికి మేం కారణం కాదు కదా! సొంత బాబాయిని చంపింది ఎవరో, చంపించింది ఎవరో తేటతెల్లమైన తర్వాత కూడా నిందితుల తరఫున జగన్‌రెడ్డి వకాల్తా పుచ్చుకోవడానికి మీడియా కారణం కాదు కదా! అధికారం బాధ్యత అన్న విషయం విస్మరించి రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా బరి తెగించడాన్ని తప్పుబట్ట్టడం మీడియాగా మా బాధ్యత. రాష్ర్టాన్ని రక్షిస్తున్నది ఎవరో, కబళిస్తున్నది ఎవరో ప్రజలు కూడా అవగాహనకు వచ్చారు. మారీచులు, ఉన్మాదులు ఎవరో కూడా ప్రజలు తెలుసుకున్నారు. అధికారంలో ఉన్న వారికి అవతలి వాళ్లు అల్పులుగానే కనిపిస్తారేమో తెలియదు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కూడా ఎవరైనా జగన్‌రెడ్డి గురించి ప్రస్తావిస్తే, అతని పనైపోయిందని వ్యాఖ్యానించేవారు. ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా వచ్చిందో మనం చూశాం. ఇప్పుడు జగన్‌రెడ్డి కూడా అదే బాటలో చంద్రబాబునాయుడు నథింగ్‌ అని చెబుతున్నారు. రాజకీయాలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినవాళ్లు ఐదేళ్లు తిరిగేసరికి ఇంటికి వెళ్లిన సందర్భాలు ఎన్నో! జగన్‌రెడ్డి ఇందుకు మినహాయింపు కాదు. ఆత్మస్తుతి, పరనిందతో కాలక్షేపం చేసుకుంటూ పోతే చివరకు పరాభవమే మిగులుతుంది. జగన్‌రెడ్డి ప్రభుత్వ మోసాలు అన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలు ఒకసారి మోసపోయి ఉండొచ్చు. పదే పదే మోసపోరు. మారీచుల చెర నుంచి రాష్ర్టాన్ని రక్షించుకోకపోతే ఆంధ్రప్రదేశ్‌ ఎప్పటికీ కోలుకోలేదు. జగన్‌రెడ్డి ప్రభుత్వ కపట నాటకాలను ప్రజలు గ్రహిస్తున్నారు. పేదలకు వినోదం అందుబాటులో ఉండొద్దా అంటూ రంకెలు వేసి సినిమా టికెట్‌ ధరలను అమాంతం తగ్గించేసిన ప్రభుత్వం, సినిమా ప్రముఖులు స్వయంగా వచ్చి ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత అహం సంతృప్తి చెంది పేదలను మరచిపోయి టికెట్‌ ధరలను పెంచారు. పవన్‌ కల్యాణ్‌ అంటే జగన్‌రెడ్డికి గిట్టదు కనుక ‘భీమ్లా నాయక్‌’ చిత్రం విడుదలైనప్పుడు టికెట్‌ ధరలు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు మాత్రం విడుదలైన తర్వాత పది రోజుల పాటు టికెట్‌ ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తూ జీవో జారీ చేశారు. జగన్‌రెడ్డి మనస్తత్వం గురించి చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి? కులమతాలు, రాగద్వేషాలకు అతీతంగా జగన్‌రెడ్డి పాలన ఉందని ఇప్పటికీ ఎవరైనా అంటే వినడానికి రోతగా ఉంటుంది.


కొత్త పార్టీతో బ్రదర్‌ అనిల్‌!

పాలకులు–మీడియాకు మధ్య ఘర్షణ నెలకొనడం కొత్తేమీ కాదు గనుక ఆ విషయం కాసేపు పక్కన ఉంచి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తాజాగా చేసిన ప్రకటన విషయానికి వద్దాం. పాలన ప్రజాకంటకంగా మారినప్పుడు పాలకుడికి వ్యతిరేకంగా బాధితులంతా ఏకమవుతారు. ప్రజల్లో ఫీల్‌ గుడ్‌ భావన ఏర్పడితేనే అధికారంలో ఉన్నవారు మళ్లీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల్లో ఫీల్‌ గుడ్‌ భావన కనుమరుగవుతూ వస్తోంది. గత ఎన్నికల్లో ఆయనకు అండగా నిలబడిన ఎంతో మంది దూరమవుతున్నారు. ఈ జాబితాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముందు వరుసలో ఉంటారు. బాధితుల సంఖ్య పెరిగేకొద్దీ ప్రభుత్వానికి సెగ పెరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జగన్‌రెడ్డి వ్యతిరేక శక్తులు, ప్రభుత్వ ఫ్యాక్షనిస్టు పోకడల వల్ల నష్టపోయిన వారందరూ ఏకమవుతున్నారు. 2019కి ముందు జగన్‌రెడ్డికి ఒక్క చాన్స్‌ ఇవ్వాలనుకున్నారు. రాజశేఖర రెడ్డిని గుర్తుచేసుకొని జగన్‌రెడ్డిని ఆశీర్వదించారు. అలాంటి వారిలో అనేక మంది ఈ మూడేళ్ల పాలన చూసిన తర్వాత హాహాకారాలు చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ జాబితాలో ఉంటారు. గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. ఫలితంగా కోస్తా జిల్లాలలో ఓట్లు భారీగా చీలిపోయి జగన్‌రెడ్డి లాభపడ్డారు. పరోక్షంగా తనకు సహకరించిన పవన్‌ కల్యాణ్‌ విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా ఉండాల్సిన జగన్‌రెడ్డి, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన పట్ల కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు. ఇందుకు కారణం తెలియదు. చిరంజీవి విషయంలో కూసింత ఉదారంగా ఉండే జగన్‌రెడ్డి, జనసేనాని విషయంలో మాత్రం కఠినంగా ఉంటున్నారు. ఫలితంగా పవన్‌ కల్యాణ్‌ నటించిన సినిమాలకు ఆంధ్రప్రదేశ్‌లో విడుదల సందర్భంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ‘భీమ్లా నాయక్‌’ విడుదల సందర్భంగా ఈ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయి. అంతకుముందు ‘వకీల్‌ సాబ్‌’ సినిమాకు కూడా ఇబ్బందులు సృష్టించారు. ఈ నేపథ్యంలో జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌ తన మనోగతాన్ని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వబోమని స్పష్టంచేశారు. ఈ ప్రకటన ద్వారా ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీ కలసి వచ్చినా రాకపోయినా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామన్న సంకేతాలను ఆయన ఇచ్చారు. మరోవైపు జగన్‌రెడ్డి సొంత బావ, చెల్లి షర్మిల భర్త అయిన బ్రదర్‌ అనిల్‌ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం మొదలెట్టారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం తర్వాత క్రైస్తవులు ఆ పార్టీకి ఓటు బ్యాంకుగా మారడానికి బ్రదర్‌ అనిల్‌ తెర వెనుక ఎంతో కృషి చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం ఆయన దూరంగా ఉండేవారు. ఇప్పుడు మొదటిసారిగా బ్రదర్‌ అనిల్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. బడుగు బలహీనవర్గాలు, ముఖ్యంగా క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని క్రిస్టియన్‌ పార్టీని ప్రారంభించాలని బ్రదర్‌ అనిల్‌ దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడ, విశాఖపట్నంలో కొంత మంది క్రైస్తవ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల వరకు జగన్‌రెడ్డి విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన బ్రదర్‌ అనిల్‌, విజయమ్మ, షర్మిల ప్రభృతులు జగన్‌రెడ్డికి అధికారం అందిన తర్వాత దూరంగా గెంటివేతకు గురయ్యారు. వాస్తవానికి జగనే వారిని దూరం పెట్టారు. అధికారంలోకి వస్తే షర్మిలకు రాజ్యసభ సీటు కేటాయించేలా అన్నా–చెల్లెళ్ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఆ తర్వాత షర్మిలను రాజ్యసభకు పంపడానికి జగన్‌ నిరాకరించారు. ఆ తర్వాత ఆస్తులలో వాటా ఇవ్వడానికి కూడా నిరాకరించారు. దీంతో అన్నా–చెల్లెళ్ల మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. షర్మిల తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. అధికారంలోనూ, ఆస్తులలోనూ వాటా ఇవ్వకుండా తమకు అన్యాయం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న షర్మిల దంపతులు జగన్‌రెడ్డిపై రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రిస్టియన్‌ పార్టీ పేరిట కొత్త పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించాలన్న నిర్ణయానికి బ్రదర్‌ అనిల్‌ వచ్చారని తెలిసింది. దీంతో గత ఎన్నికల వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జగన్‌రెడ్డి విజయానికి సహకరించిన వారందరూ ఆయనకు దూరం అవుతున్నట్టే. బ్రదర్‌ అనిల్‌ ఆలోచనలను పసిగట్టిన జగన్‌రెడ్డి తనకు అనుకూలంగా ఉండే కొంతమంది క్రైస్తవులతో జేఏసీ ఏర్పాటు చేయించి బ్రదర్‌ అనిల్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేయించారు. మొత్తానికి మూడేళ్ల పాలన పూర్తి కావొచ్చేసరికి సొంత మనుషులు కూడా జగన్‌కు వ్యతిరేకంగా మోహరించే పరిస్థితి ఏర్పడింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అధికార పీఠానికి పోటీ అనుకున్నవారిని మినహాయించి మిగతా వారందరినీ వివిధ రూపాలలో సంతృప్తిపరిచేవారు. ఈ విధంగా ఆయన తన వ్యతిరేకుల సంఖ్యను తగ్గించుకోవడమే కాకుండా అనుకూలుర సంఖ్యను పెంచుకున్నారు. తెలుగుదేశం మినహా మిగతా పార్టీలన్నీ ఆయన విషయంలో సానుకూలంగా ఉండేవి. ప్రత్యర్థి పార్టీలకు చెందినవారు అయినప్పటికీ ఆర్థిక కష్టాలలో ఉన్నవారిని రాజశేఖర రెడ్డి ఆదుకునేవారు. ఒక సందర్భంలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఒకరు తమ బిడ్డ పెళ్లి పత్రికను అందించడానికి వెళ్లినప్పుడు వారి ఆర్థిక పరిస్థితి గురించి ముందే తెలుసుకున్న రాజశేఖర రెడ్డి, పెళ్లి ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని వారి ఇంటికి పంపించారు. ఇలాంటి సంఘటనలే ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. జగన్‌రెడ్డి వ్యవహార శైలి ఇందుకు పూర్తి భిన్నం. ఈ కారణంగానే కుటుంబ సభ్యులతో పాటు ఇతరులు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఒకటవుతున్నారు. జీవించి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి నోటి మాటగా చెప్పిన విధంగా షర్మిలకు ఆస్తులలో వాటా పంచి ఉంటే ఇప్పుడు ఆమె జగన్‌రెడ్డికి దూరమయ్యే వారు కాదు. కూతురికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో విజయమ్మ ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి బలమైన మద్దతుదారులుగా క్రైస్తవులు ఉన్నారు. బ్రదర్‌ అనిల్‌కు కూడా క్రైస్తవుల్లో మంచి పట్టు ఉంది. రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పటి నుంచి కూడా క్రైస్తవుల ఓట్లను ఆ కుటుంబానికి అనుకూలంగా మళ్లించడంలో బ్రదర్‌ అనిల్‌ చేసిన కృషి విస్మరించలేనిది. ఈ నేపథ్యంలో బ్రదర్‌ అనిల్‌ నిజంగానే క్రిస్టియన్‌ పార్టీని ప్రారంభిస్తే జగన్‌రెడ్డికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది. అవసరమైతే షర్మిల కూడా క్రిస్టియన్‌ పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉంది. విజయమ్మ ఏ వైఖరి తీసుకుంటారో ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదాన్ని గుర్తించి సోదరి షర్మిలతో జగన్‌రెడ్డి రాజీ కుదుర్చుకొని, ఆస్తులను పంచి ఇస్తే, బ్రదర్‌ అనిల్‌ నేతృత్వంలో క్రిస్టియన్‌ పార్టీ పురుడు పోసుకోకపోవచ్చు.


పవన్‌.. పొత్తుల లెక్కలు!

ఇప్పుడు తిరిగి జనసేనాని పవన్‌ కల్యాణ్‌ విషయానికి వద్దాం. పవన్‌ కల్యాణ్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం. అధికారానికి దాసోహమనడం ఆయన నైజానికి విరుద్ధం. జనసేన సొంతంగా అధికారంలోకి రాలేకపోవచ్చును గానీ ప్రధాన రాజకీయపక్షాలైన వైసీపీ, టీడీపీ పార్టీల గెలుపోటములను ఆ పార్టీ నిర్ణయించే స్థితిలో ఉంది. ప్రస్తుతం జగన్‌రెడ్డి–పవన్‌ కల్యాణ్‌ మధ్య పూడ్చలేనంత దూరం ఏర్పడింది. పార్టీ ఆవిర్భావ సభ తర్వాత కూడా జన సేనానిపై వైసీపీ మంత్రుల దాడి తగ్గకపోగా పెరిగింది. తనతో సినిమాలు నిర్మించే నిర్మాతలకు ఇబ్బందులు దూరం కావాలంటే జగన్‌రెడ్డి ప్రభుత్వం ఇంటికెళ్లవలసిన అవసరం పవన్‌ కల్యాణ్‌కు ఉంది. ఈ కారణంగానే ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా బలం లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య ప్రస్తుతానికి వైరం ఉంది. ఈ కారణంగానే జగన్‌రెడ్డిని ఎదిరించే విషయమై తాను అడిగిన రోడ్‌ మ్యాప్‌ను బీజేపీ త్వరలో ఇస్తుందని ఆశిస్తున్నట్టు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. తెలుగుదేశంతో చేతులు కలపడానికి బీజేపీ సిద్ధపడని పక్షంలో జనసేనాని ఏ వైఖరి తీసుకుంటారన్నదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. క్షేత్ర స్థాయి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ కలసివచ్చినా రాకపోయినా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని జన సైనికులు కోరుకుంటున్నారు. జనసేనాని కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లు లభించగా తెలుగుదేశం పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. జనసేనకు దాదాపు 6 శాతం ఓట్లు వచ్చాయి. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లకే బోలెడు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నందున వైసీపీ ఓటు శాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో తెలుగుదేశం–జనసేన కలిస్తే జగన్‌రెడ్డిని ఓడించడం కష్టమేమీ కాదు. అయితే ఎన్నికల సందర్భంగా జగన్‌రెడ్డి అక్రమాలకు పాల్పడకుండా కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని తెలుగుదేశంతో పాటు జనసేన కూడా అభిప్రాయపడుతోంది. ఈ కారణంగానే ఓటింగ్‌పరంగా ఉపయోగపడకపోయినా బీజేపీని కూడా కలుపుకొనిపోవాలని ఆ రెండు పార్టీలూ యోచిస్తున్నాయి. ఏదేమైనా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి హనీమూన్‌ పీరియడ్‌ ముగిసింది. ఇకపై ఆయనకు అసలైన రాజకీయ సవాళ్లు ఎదురుకానున్నాయి. మారీచుడిని తలపిస్తున్న పాలనను అంతమొందించడానికి ఏకం కావాల్సిన వాళ్లు ఏకమవుతున్నారు. బ్రదర్‌ అనిల్‌ వంటివారు జగన్‌ ఓటు బ్యాంకుకు గండికొట్టే ప్రయత్నాలకు పదునుపెడుతున్నారు. దీన్నిబట్టి జగన్‌పై ముప్పేట దాడి ప్రారంభం కాబోతోందని చెప్పవచ్చు. జగన్‌కు కూడా ఈ విషయం తెలుసు. అందుకే ఇటీవల శాసనసభాపక్షం సమావేశం ఏర్పాటు చేసి వచ్చే రెండేళ్లు ప్రజల్లోనే ఉండాల్సిందిగా శాసనసభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ఒకవైపు అవినీతికి సంబంధించిన కేసుల విచారణ ముంచుకు వస్తుండగా మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు ఏకమయ్యే ప్రయత్నాలు జరగడం జగన్‌రెడ్డిని చికాకు పెట్టకుండా ఉంటాయా! గత ఎన్నికల్లో ప్రశాంత్‌ కిశోర్‌తో కలసి పన్నిన కపట వ్యూహాలు ఫలించి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి, ఇప్పుడు మళ్లీ ప్రశాంత్‌ కిశోర్‌తో కలసి ఎటువంటి కుయుక్తులు పన్నుతారో వేచి చూడాలి. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకోవాలి. సమాజాన్ని కులమతాల ప్రాతిపదికన చీల్చి కుయుక్తులతో ప్రజలను భావోద్వేగాలకు గురిచేసే ప్రశాంత్‌ కిశోర్‌ వంటి వ్యక్తుల విషయంలో ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఇప్పటికే దీన స్థితిలో ఉంది. ఆటవిక పాలన రాజ్యమేలుతోంది. ప్రజలు మళ్లీ మోసపోతే ఆంధ్రప్రదేశ్‌ అధఃపాతాళానికి చేరుతుంది. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఇప్పటికైనా మీడియాను దూషిస్తూ, రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపులకు పాల్పడే ధోరణికి స్వస్తి చెప్పి, తనకు వ్యతిరేకంగా ఎందుకు అంతమంది సంఘటితం అవుతున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలి. చరిత్రలో ఎంతో మంది మీడియాతో తలపడ్డారు. మీడియా మాత్రం నిక్షేపంగానే ఉంది. ఉంటుంది. అప్పులు చేసి సంక్షేమం పేరిట డబ్బులు పంచడం మినహా రాష్ట్ర భావి ప్రయోజనాల కోసం ఒక్కటంటే ఒక్క మంచి పనిచేసినట్టు జగన్‌ అండ్‌ కో చెప్పగలరా? కాకిలా కలకాలం ఉండే కంటే హంసలా ఆరు నెలలు బతికినా చాలు అంటారు. నీ తండ్రిని ఇప్పటికీ తలచుకుంటున్న వారు, జీవించి ఉన్నప్పుడు నీ తండ్రికి అండగా నిలబడినవారు ఇప్పుడు నీ వెంట ఎందుకు లేరో తెలుసుకోగలిగితే తాను మంచివాడో కాదో జగన్‌రెడ్డికి తెలుస్తుంది. త్వరలోనే ఆయనకు జ్ఞానోదయం కావాలని కోరుకుందాం!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-03-20T05:47:59+05:30 IST