సాహసం శ్వాసగా.. సాగరా..

ABN , First Publish Date - 2022-06-26T05:30:00+05:30 IST

సాహసం శ్వాసగా.. సాగరా..

సాహసం శ్వాసగా.. సాగరా..
మంగినపూడి బీచ్‌ వద్ద పర్యాటకులకు సూచనలు ఇస్తున్న మెరైన్‌ పోలీసులు

ఆపద్బాంధవులు.. మంగినపూడి మెరైన్‌ పోలీసులు 

నిరంతర గస్తీతో సందర్శకులకు పూర్తిస్థాయి రక్షణ

ప్రాణాలకు తెగించి.. సముద్రంలో చిక్కుకున్న వారిని కాపాడి..

రెండేళ్లలో 10 సంఘటనలు.. 13 మంది సురక్షితం


కొండపల్లికి చెందిన  లంకపల్లి సాయి మరో నలుగురితో కలిసి మూడు రోజుల క్రితం మంగినపూడి బీచ్‌కు వచ్చాడు. వీరు విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నారు. బీచ్‌లో స్నానం చేస్తుండగా, సాయి నీటిలో కొట్టుకుపోయాడు. వెంటనే స్పందించిన మెరైన్‌ పోలీసులు సాయిని బయటకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స చేశారు. అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ ఏడాది మార్చి 3వ తేదీన విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన హోటల్‌ వ్యాపారి పైడే వీరేంద్రనాయుడు మంగినపూడిబీచ్‌కు వచ్చాడు. కుటుంబ కలహాలు ఉండటంతో మరణించాలని నిర్ణయించుకున్నాడు. సముద్రంలో స్నానంచేస్తూ లోతులోకి వెళ్లాడు. అలల తాకిడికి నీటిలో కొట్టుకుపోతున్న వీరేంద్రనాయుడు ప్రాణభయంతో కేకలు పెట్టాడు. దీంతో అక్కడున్న మెరైన్‌ పోలీసులు గమనించి అతడిని ఒడ్డుకు చేర్చి అసలు విషయాన్ని రాబట్టారు. బంధువులను పిలిపించి నచ్చజెప్పి పంపించారు. 

తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన గమేర్ల భానుచంద్రిక మార్చి 6న మంగినపూడి బీచ్‌కు ఒంటరిగా వచ్చింది. ఆమె అనారోగ్యానికి గురై ఫిట్స్‌ బారినపడింది. సముద్రపు ఒడ్డున కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన మెరైన్‌ పోలీసులు సపర్యలు చేశారు. 108 వాహనంలో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ప్రాణాపాయం నుంచి బయటపడింది.

వానపాముల గ్రామానికి చెందిన ఎం.బసవయ్య ఏప్రిల్‌ 6వ తేదీన మంగినపూడి బీచ్‌కు వచ్చి పురుగులమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. బీచ్‌ సమీపంలో చెట్ల మధ్యలో స్పృహ కోల్పోయిన ఆయన్ను మెరైన్‌ పోలీసులు గుర్తించారు. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో బతికాడు.

గన్నవరానికి చెందిన బడుగు మౌనిక ఈ నెల 19వ తేదీన సముద్రంలో స్నానంచేస్తూ అలల తీవ్రతకు నీటిలో కొట్టుకుపోయింది. మెరైన్‌ పోలీసులు సకాలంలో రక్షించి ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడారు.

రాకాసి అలలు చెప్పి రావు. వస్తే ఊరికే పోవు. ప్రాణాలను లాక్కెళ్తాయి. నిలువునా ముంచేస్తాయి. కానీ, వీరు ఆ అలలకు ఎదురెళ్తున్నారు. ప్రాణాలతో చెలగాటమాడటానికి కాదు.. ప్రాణాలకు తెగిస్తూ జనాలను కాపాడటానికి.. ఆనందానికో, ఆత్మహత్య చేసుకోవడానికో వెళ్లి సముద్రంలో చిక్కుకుపోతున్న వారిని కాపాడి పునర్జన్మను ప్రసాదించడానికి.. సందర్శకుల కన్నీటి కృతజ్ఞతల్లో సంతోషాన్ని వెతుక్కుంటూ సముద్రంతో నిత్య సమరం చేస్తున్న మంగినపూడి మెరైన్‌ పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మంగినపూడి బీచ్‌.. ఇదో ప్రముఖ పర్యాటక కేంద్రం. కొవిడ్‌ నిబంధనల సడలింపు తరువాత మళ్లీ పర్యాటకులతో కళకళలాడుతోంది. ఆదివారమే కాకుండా, సెలవు రోజుల్లోనూ ఇక్కడికి భక్తులు పోటెత్తుతారు. ఇక్కడ సందర్శకుల సంఖ్యతో సమానంగా ప్రమాదాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. నీటిలో కొట్టుకుపోతున్నామనే భయం ఒకవైపు, ఉవ్వెత్తున ఎగసిపడే అలలు మరోవైపు నిలువునా ముంచేస్తుండటంతో నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్న వారెందరో. గత రెండేళ్లలో సంభవించిన తుఫాన్లు కారణంగా సముద్రపు ఒడ్డు నుంచి 200 మీటర్ల దూరంలో గోతులు భారీగా ఏర్పడ్డాయి. ఇవి పూడకపోవడంతో నీటి లోతుకు వెళ్లినవారు అలల తాకిడికి గురికావడం, నీటి ఒరవడికి సముద్రం లోపలికి చేరిపోవడం జరుగుతోంది. 

మేమున్నామంటూ గస్తీ

తెలియక సముద్ర లోతుల్లోకి వెళ్తున్నవారు, ఆత్మహత్యకు చేసుకోడానికి వచ్చినవారిని గుర్తించి ప్రాణాలు కాపాడు తున్నారు మెరైన్‌ పోలీసులు. మంగినపూడి బీచ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గిలకలదిండి మెరైన్‌ సీఐ సీహెచ్‌ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ వి.జగదీష్‌ చంద్రబోస్‌ పర్యవేక్షణలో హెడ్‌ కానిస్టేబుల్‌, ముగ్గురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులు ఇక్కడ గస్తీ తిరుగుతూ ఉంటారు. వీరంతా స్విమ్మర్ల్లు. ప్రాణాలను లెక్క చేయకుండా సముద్రపు లోతుల్లోకి వెళ్లి, ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడుతున్నారు. ఇక సీఐ, ఎస్‌ఐలు ప్రతి ఆదివారం తీరంలోనే ఉండి పర్యాటకుల కదలికలను గమనిస్తున్నారు. మిగిలిన రోజుల్లోనూ గస్తీ కొనసాగుతోంది.

ప్రాణాలను లెక్కచేయకుండా..

గతనెల మే 23వ తేదీన బీ-ఫార్మసీ పూర్తిచేసి ఉద్యోగం పొందిన ఇద్దరు విద్యార్థినులు సముద్రంలో కొట్టుకుపోగా, మెరైన్‌ పోలీసులు, స్థానిక ఫొటోగ్రాఫర్‌లు ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా, వారిద్దరూ మార్గంమధ్యలో మరణించారు. 


అప్రమత్తంగా ఉండాల్సిందే.. 

మంగినపూడి బీచ్‌లో సముద్రపు అంచు నుంచి కొద్దిదూరంలో నీటి అడుగున గోతులు ఏర్పడ్డాయి. దీంతో గోతులు ఉన్న చోటు తెలియనివారు అక్కడికి వెళ్లగానే మునిగిపోతున్నారు. అలల కారణంగా వారు మరింత లోతుకు వెళ్లిపోతున్నారు. కంగారులో నీటి ఒరవడికి కొట్టుకుపోతున్నారు. మెరైన్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడగలుగుతున్నాం. ప్రాణాపాయంతో బయటపడినవారు, వారి బంధువులు చెప్పే కృతజ్ఞతలు మాకెంతో సంతృప్తినిస్తున్నాయి. సందర్శకులు అప్రమత్తంగా ఉండటంతో పాటు మెరైన్‌ పోలీసుల సూచనలు పాటిస్తే ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు.

- సీహెచ్‌ సతీష్‌కుమార్‌, మెరైన్‌ సీఐ 






Updated Date - 2022-06-26T05:30:00+05:30 IST