మేరియుపోల్‌ రష్యా వశం

ABN , First Publish Date - 2022-05-19T08:19:10+05:30 IST

ఉక్రెయిన్‌ తీరప్రాంత నగరం మేరియుపోల్‌ పూర్తిగా రష్యా వశమైంది. ఏప్రిల్‌లోనే ఈ నగరంపై పట్టు సాధించినట్లు రష్యా ప్రకటించినా..

మేరియుపోల్‌ రష్యా వశం

అజోవ్‌స్టాల్‌ ఉక్కు కర్మాగారంలోని

ఉక్రెయిన్‌ సైనికుల లొంగుబాటు

కీవ్‌/కేన్స్‌/మాస్కో, మే 18: ఉక్రెయిన్‌ తీరప్రాంత నగరం మేరియుపోల్‌ పూర్తిగా రష్యా వశమైంది. ఏప్రిల్‌లోనే ఈ నగరంపై పట్టు సాధించినట్లు రష్యా ప్రకటించినా.. అజోవ్‌స్టాల్‌ ఉక్కు కర్మాగారాన్ని మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయింది. బుధవారం నాటికి అజోవ్‌స్టాల్‌లో ఉన్న ఉక్రెయిన్‌ సైనికుల్లో బుధవారం 694 మంది, ఈ వారంలో మొత్తంగా 959 మంది లొంగిపోవడంతో అధికారికంగా రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. 


ముప్పేట దాడి

రష్యా సైన్యం మేరియుపోల్‌పై ముప్పేట దాడి చేసింది. నగరాన్ని రక్షించుకునేంత సమయం ఉక్రెయిన్‌ సేనలకు ఇవ్వలేదు. యుద్ధం మొదలైన తొలి రోజు నుంచే పుతిన్‌ సేనలు రాజధాని కీవ్‌ దిశగా కదిలాయి. యుద్ధవిమానాలు, ట్యాంకులు, శతఘ్నులతో నిరంతరాయంగా దాడులు చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 20,000 మంది మరణించి ఉండొచ్చని ఉక్రెయిన్‌ అంచనా వేస్తోంది. మేరియుపోల్‌లో అజోవ్‌ రెజిమెంట్‌, ఇతర ఉక్రెయిన్‌ దళాలు ఉన్న ఉక్కు కర్మాగారాన్ని చుట్టుముట్టిన పుతిన్‌ సైన్యం.. నిరంతరాయంగా దాడులు చేసింది. చివరకు ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోవాల్సి వచ్చింది.


పుతిన్‌కు కొత్త శస్త్రచికిత్స

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు చిన్నపాటి శస్త్రచికిత్స జరిగిందని ‘ఎక్స్‌ప్రెస్‌’ కథనంలో తెలిపింది. ఆయన పొత్తి కడుపులో చేరిన ద్రవాలను తొలగించేందుకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, ఇది కేన్సర్‌కు సంబంధించింది కాదని పేర్కొంది. కాగా.. ఫిన్లాండ్‌, స్వీడన్‌లు నాటోలో చేరాలని నిర్ణయించడం చరిత్రాత్మకమని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టాలెన్‌బర్డ్‌ అన్నారు. వాటి దరఖాస్తులపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక.. రష్యా దురాగతాలను ఎండగట్టి, తమకు అండగా నిలవాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సినీ పరిశ్రమను కోరారు. ప్రతిష్ఠాత్మక 75వ కేన్స్‌ చలన చిత్రోత్సవం ఫ్రాన్స్‌లో ప్రారంభమవగా.. జెలెన్‌స్కీ ఉక్రెయిన్‌ నుంచి లైవ్‌ శాటిలైట్‌ వీడియో ద్వారా ప్రత్యేక ప్రసంగం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చార్లీ చాప్లిన్‌ తీసిన ‘ది గ్రేట్‌ డిక్టేటర్‌’ సినిమాకు, ప్రస్తుత ఉక్రెయిన్‌ పరిస్థితులకు పెద్దగా తేడా లేదని పేర్కొన్నారు. నియంతల దారుణాల పట్ల స్పందించేందుకు సినీ ప్రపంచానికి ఇప్పుడు కొత్త చాప్లిన్‌ అవసరమని అన్నారు. మరోవైపు.. అమెరికన్‌ ఫాస్ట్‌ ఫుడ్‌ సంస్థ మెక్‌డొనాల్డ్స్‌ రష్యాను వీడాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ రెస్టారెంట్ల వద్ద జనాలు క్యూ కట్టారు. 

Updated Date - 2022-05-19T08:19:10+05:30 IST