మార్కెట్‌ నిర్మించరు.. కమిటీ వేయరు

ABN , First Publish Date - 2021-05-09T05:30:00+05:30 IST

రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్‌ నామమాత్రంగానే మారింది. నాలుగేళ్లు కావస్తున్నా నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. మూడేళ్లుగా మార్కెట్‌కు కమిటీని నియమించకపోవడంతో దీని గురించి పట్టించుకునేవారు లేకుండాపోయారు.

మార్కెట్‌ నిర్మించరు.. కమిటీ వేయరు
సాగుతున్న మార్కెట్‌ నిర్మాణ పనులు

నాలుగేళ్లుగా సాగుతున్న నిర్మాణ పనులు

మనుగడలోలేని మార్కెట్‌ కమిటీ


తూప్రాన్‌, మే 9: రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్‌ నామమాత్రంగానే మారింది. నాలుగేళ్లు కావస్తున్నా నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. మూడేళ్లుగా మార్కెట్‌కు కమిటీని నియమించకపోవడంతో దీని గురించి పట్టించుకునేవారు లేకుండాపోయారు. జిల్లాల విభజన జరిగిన నాటినుంచి తూప్రాన్‌ వ్యవసాయ మార్కెట్‌, కమిటీ కథ ముగిసి పోయింది. 

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న తూప్రాన్‌ మండలాన్ని గజ్వేల్‌ మార్కెట్‌ పరిధిలో ఉండేది. గజ్వేల్‌ మార్కెట్‌ను రెండుగా విభజించి నూతనంగా ములుగు మండలంలో వంటిమామిడి వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. తూప్రాన్‌ మండలాన్ని గజ్వేల్‌ వ్యవసాయ మార్కెట్‌ పరిధి నుంచి వంటిమామిడి వ్యవసాయ మార్కెట్‌ పరిధిలోకి మార్చేశారు. జిల్లాల పునర్విభజన చేపట్టడంతో ములుగు మండలం (వంటిమామిడి) సిద్దిపేట జిల్లా పరిధిలోకి వెళ్లగా, తూప్రాన్‌ మండలం మెదక్‌ జిల్లా పరిధిలోకి చేరింది. ఉమ్మడి తూప్రాన్‌ మండలానికి తూప్రాన్‌లో నూతన వ్యవసాయ మార్కెట్‌ను మంజూరు చేశారు. తూప్రాన్‌ పట్టణ పరిధి అల్లాపూర్‌ శివారులో టోల్‌ప్లాజా వద్ద మార్కెట్‌ కోసం 20 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. తూప్రాన్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు నిర్మాణం కోసం మార్కెటింగ్‌శాఖ రూ. 3.53 కోట్ల నిధులు మంజూరుచేసింది. 2017 జూలై 21న అప్పటి మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సమావేశ మందిరం, ప్రహారీ, సిమెంట్‌ రోడ్లకు అదనంగా రూ. 2.50 కోట్లను  మంజూరు చేయించారు. శంకుస్థాపనచేసి నాలుగేళ్లయినా మార్కెట్‌యార్డు నిర్మాణం పూర్తికాలేదు. మార్కెట్‌ నిర్మాణ పనులు కొన్ని నెలలపాటు నిలిపివేయడంతో పిచ్చి మొక్కలు పెరిగి చిట్టడవిని తలపించింది. మార్కెట్‌ నిర్మాణంపై గడ ప్రత్యేక అధికారులు పలుమార్లు సమీక్షలు నిర్వహించి, హెచ్చరించినా పనులు మాత్రం ముందుకుసాగడంలేదు. 


పత్తాలేని మార్కెట్‌ కమిటీ

మార్కెట్‌ కమిటీ ఏర్పాటు ఊసే లేకుండాపోయింది. రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్‌ యార్డులకు కొత్త కమిటీలు వేస్తున్నా తూప్రాన్‌లో మాత్రం ఆ దిశగా కదలికలేదు. వంటిమామిడి వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో ఉమ్మడి తూప్రాన్‌ మండలం నుంచి ముగ్గురికి అవకాశం కల్పించారు. రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారని, కమిటీ వేస్తున్నారని ప్రచారం జరిగినా కార్యరూపం దాల్చలేదు. 


నెలాఖరుకు పనులు పూర్తి  : మాధవరెడ్డి, మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ 

తూప్రాన్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు నిర్మాణ పనులు నెలాఖరుకు పూర్తవుతాయి. పనుల్లో జాప్యం చేస్తుండడంతో కాంట్రాక్టర్‌ను మార్చేశాం. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో మంజూరైన మార్కెట్‌యార్డుషెడ్ల నిర్మాణం పనులు, కొత్తగా మంజూరైన ప్రహారీ, సీసీలు, సమావేశ మందిరం పనులన్నీ నెలాఖరుతో పూర్తవుతాయి. 

Updated Date - 2021-05-09T05:30:00+05:30 IST