వడ్డీ రేట్లు పెరిగే వరకూ ..దూకుడుగానే మార్కెట్లు!

ABN , First Publish Date - 2021-10-27T08:11:27+05:30 IST

కరెక్షన్‌ వస్తే 20% వరకూ పడే చాన్స్‌ వచ్చే 3-5 ఏళ్లలో ఫండ్‌ ఇన్వెస్టర్లు రెట్టింపు సామ్కో ఎంఎఫ్‌ వ్యవస్థాపకుడు జిమీత్‌ మోదీ...

వడ్డీ రేట్లు పెరిగే వరకూ ..దూకుడుగానే మార్కెట్లు!

కరెక్షన్‌ వస్తే 20% వరకూ పడే చాన్స్‌

వచ్చే 3-5 ఏళ్లలో ఫండ్‌ ఇన్వెస్టర్లు రెట్టింపు

సామ్కో ఎంఎఫ్‌ వ్యవస్థాపకుడు జిమీత్‌ మోదీ


మళ్లీ వడ్డీ రేట్లు పెరిగే వరకూ స్టాక్‌ మార్కెట్లో దూకుడు కొనసాగుతుందని సామ్కో మ్యూచువల్‌ ఫండ్‌ డైరెక్టర్‌ జిమీత్‌ మోదీ అంటున్నారు. ఏడాది, ఏడాదిన్నరలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. స్టాక్‌ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’తో ఇష్ఠాగోష్ఠిగా ముచ్చటించారు. ఆ వివరాలు..

బుల్‌ రన్‌ ఎంత వరకు కొనసాగొచ్చు?

వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నంత కాలం మార్కెట్లో బుల్‌ రన్‌ ఉండే వీలుంది. వడ్డీ రేట్లు పెరుగుదల ప్రారంభమైన తర్వాత మార్కెట్లో కరెక్షన్‌ రావచ్చు. ప్రస్తుతం కాల పరిమితి డిపాజిట్లపై వడ్డీ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉంది. ఈ రేట్లు 7-8 శాతానికి పెరిగితే.. మార్కెట్లో పటిష్ఠమైన కరెక్షన్‌ వచ్చే అవకాశం ఉంది. కరెక్షన్‌ వస్తే కనీసం 20 శాతం క్షీణించవచ్చు. ఏడాది, ఏడాదిన్నర కాలంలో వడ్డీ రేట్లు మళ్లీ పెరగొచ్చు. అయితే మార్కెట్లో కరెక్షన్‌ కచ్చితంగా ఎప్పుడు వస్తుందని చెప్పలేం.

మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవీ?

వడ్డీ రేట్లు కాకుండా మార్కెట్‌ను అత్యధికంగా ప్రభావితం చేసే అంశాలు అంతగా లేవు. అయితే.. ముడి చమురు ధరలు నిరంతరంగా పెరుగుతున్నాయి. చమురు రేట్లు పెరిగితే.. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అప్పుడు రిజర్వు బ్యాంకుకు వడ్డీ రేట్లను పెంచక తప్పని పరిస్థితి వస్తుంది. అందువల్ల చమురు ధరల పెరుగుదల మార్కెట్‌ను ప్రభావితం చేయొచ్చు.

ర్యాలీ కొనసాగితే ఎలా ఉంటుంది?

 మార్కెట్‌ గత ఏడాది కాలంలో ఇచ్చినంత ప్రతిఫలాన్ని భవిష్యత్తులో కూడా ఇస్తుందని మదుపర్లు భావించకూడదు. ఏడాదికి 12-13 శాతం ప్రతిఫలాన్ని ఆశించి, దీర్ఘకాల వ్యూహంతో మార్కెట్లో మదుపు చేయడం మంచిది.

ఎంఎ్‌ఫల్లో ఎంత మంది ఇన్వెస్ట్‌ చేస్తున్నారు?

కొవిడ్‌ తర్వాత ఎంఎఫ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సిస్టమాటిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా ఫండ్స్‌లోకి వచ్చే మొత్తం కూడా ఆకర్షణీయంగా ఉంది. ప్రస్తుతం నెలకు రూ.10,000 కోట్లు సిప్‌ ద్వారా వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2.57 కోట్ల మంది ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారు. మదుపర్లు ఈ స్థాయికి చేరడానికి 30 ఏళ్లు పట్టింది. అయితే.. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలోనే మరో 2.57 కోట్ల మంది ఎంఎఫ్‌ ఇన్వెస్టర్ల జాబితాలో చేరే వీలుంది. 

చిన్న మదుపర్లకు ఎంఎ్‌ఫలు ఏ విధంగా మేలు?

మ్యూచువల్‌ ఫండ్స్‌లో చాలా చిన్న మొత్తం కూడా మదుపు చేయొచ్చు. కాలపరిమితి డిపాజిట్ల వంటి వాటితో పోలిస్తే ప్రతిఫలం కూడా బాగా ఉంటుంది. మనం చేసే ఇన్వె్‌స్టమెంట్‌పై వచ్చే ప్రతిఫలాన్ని మళ్లీ మదుపు చేసే అవకాశం ఫండ్లలోనే ఉంది. ప్రతి అవసరానికి తగ్గట్లుగా ఫండ్‌లు ఉన్నాయి. ఈక్విటీ ఎంఎఫ్స్‌ తర్వాత హైబ్రిడ్‌ ఫండ్స్‌ వైపు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు.

                                                                                         -హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌)




ఏయే రంగాల్లో మదుపు చేయొచ్చు? 

మధ్య, దీర్ఘకాలాన్ని పరిగణనలోకి తీసుకుని వినియోగ ఆధారమైన ఎఫ్‌ఎంసీజీ, గృహోపకరణాల వంటి కంపెనీల షేర్లలో మదుపు చేయొచ్చు. రిటైల్‌ బ్యాంకింగ్‌, ఐటీ షేర్లు కూడా బాగానే ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం పెరిగితే.. వినియోగ ఆధారిత రంగాలకు ప్రయోజనం కలుగుతుంది. 

Updated Date - 2021-10-27T08:11:27+05:30 IST