మార్మోగిన మల్లన్న నామస్మరణ

ABN , First Publish Date - 2021-04-12T05:53:34+05:30 IST

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం వేలాదిమంది భక్తులతో జనసందోహంగా మారింది. అగ్నిగుండాలతో మల్లన్న బ్రహ్మోత్సవాలు ముగియనుండటం, జాతర చివరి ఆదివారం కావడంతో వేలాది మంది భక్తులు ఇంటిల్లిపాదిగా తరలివచ్చారు.

మార్మోగిన మల్లన్న నామస్మరణ
పల్లకీ సేవ నిర్వహిస్తున్న అర్చకులు, భక్తులు

జాతర చివరి వారం కిక్కిరిసిన కొమురవెల్లి ఆలయ పరిసరాలు


చేర్యాల, ఏప్రిల్‌ 11 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం వేలాదిమంది భక్తులతో జనసందోహంగా మారింది. అగ్నిగుండాలతో మల్లన్న బ్రహ్మోత్సవాలు ముగియనుండటం, జాతర చివరి ఆదివారం కావడంతో వేలాది మంది భక్తులు ఇంటిల్లిపాదిగా తరలివచ్చారు. పట్నాలు వేసి మొక్కులను తీర్చుకున్నారు. మల్లన్నను దర్శించుకుని తమ కోరికలను ఈడేర్చమని వేడుకున్నారు. ఎల్లమ్మ తల్లికి బోనం నివేదించి ఓడిబియ్యాలు పోశారు. పట్నాలు వేసిన భక్తులతో ముఖమండపం, గంగిరేగు చెట్టు ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. తమ కోరికలను నెరవేర్చమని వేడుకుంటూ ఆలయ ప్రాంగణంలోని గంగిరేగుచెట్టుకు ముడుపులు కట్టారు.

ఘనంగా ప్రారంభమైన అగ్నిగుండాలు

మల్లన్న జాతరలో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను ఆదివారం రాత్రి ఆలయవర్గాలు అట్టహాసంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం గర్భాలయంలో స్మామివారికి వీరశైవార్చకులు ప్రత్యేక పూజలను జరిపించారు. సాయంత్రం పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయ ఆవరణలోని తోటబావి ప్రాంగణంలో వీరభద్ర పళ్లేరం, భద్రకాళి పూజలు జరిపించి అర్ధరాత్రి అగ్నిగుండాలను ప్రారంభించారు.

Updated Date - 2021-04-12T05:53:34+05:30 IST