Marri Rajasekhar కు మళ్లీ మొండిచేయి.. Nara Lokesh అక్కడ్నుంచే పోటీ చేస్తాననడంతో అప్పుడే పై ఎత్తులు..!

ABN , First Publish Date - 2021-11-13T05:45:32+05:30 IST

వైసీపీ సీనియర్‌ నేత, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కు మరోసారి చుక్కెదురైంది.

Marri Rajasekhar కు మళ్లీ మొండిచేయి.. Nara Lokesh అక్కడ్నుంచే పోటీ చేస్తాననడంతో అప్పుడే పై ఎత్తులు..!

  • జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
  • కొత్తగా మురుగుడు హనుమంతరావుకు అవకాశం
  • ఇంకా పార్టీలో చేరకుండానే అందలం
  • మర్రి రాజశేఖర్‌కు రిక్తహస్తం 
  • మంగళగిరిపై మరింత పట్టుకోసమే మురుగుడు ఎంపిక..? 
  • లోకేష్‌ తిరిగి అక్కడ నుంచే పోటీ చేస్తాననడంతో అప్పుడే పై ఎత్తులు 
  • మరోసారి ఉమ్మారెడ్డికి చాన్స్‌

  

గుంటూరు(ఆంధ్రజ్యోతి), మంగళగిరి, నవంబరు 12: వైసీపీ సీనియర్‌ నేత, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌కు మరోసారి చుక్కెదురైంది. ఇంచుమించు రెండేళ్లుగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటూ వైసీపీ అధినేత జగన్‌ ఊరిస్తూ వచ్చారు. ఈ పర్యాయం ఏకంగా 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ రావటంతో ఈసారి మర్రికి తప్పనిసరిగా అవకాశం దక్కుతుందని జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేతలు కూడా భావించారు. స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాల్లో ఒకటి తిరిగి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు దక్కగా, రెండోస్థానం నుంచి పోటీ చేసే అవకాశం మంగళగిరికి చెందిన మాజీమంత్రి మురుగురు హనుమంతరావుకు దక్కింది. విశేషమేమిటంటే హనుమంతరావు ఇంకా వైసీపీలో కూడా చేరలేదు.


మురుగుడు 1987నుంచి 1992 వరకు మంగళగిరి మునిసిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తరువాత 2000వ సంవత్సరం నుంచి 2009 వరకు వరుసగా రెండు పర్యాయాలు మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన  శాసనసభా కమిటీ చైర్మన్‌గాను, కేబినెట్‌ మంత్రిగాను, ఆప్కో చైర్మన్‌గాను పలు కీలకమైన పదవులను నిర్వహించారు. 2013 నుంచి 2015 వరకు ఆప్కో చైర్మన్‌గా కొనసాగిన మురుగుడు ఆ తరువాతినుంచి పదవులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మళ్లీ ఆరేళ్ల విరామం తరువాత ఆయన్ను ఎమ్మెల్సీ పదవి వరించింది.


ముందస్తు వ్యూహంలో భాగంగానే..

 మురుగుడు హనుమంతరావు వైసీపీకి అనుకూలంగా పనిచేసిన దాఖలాలు లేవు. కనీసం ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తూ ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. శుక్రవారం ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు వెలువడటంతో జిల్లాలోనే వైసీపీ శ్రేణులు సైతం ఆశ్చర్యానికి గురయ్యాయి. ఇందులో ఎంతో ముందస్తు వ్యూహం ఉందని భావిస్తున్నారు. ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి సమయంలో చంద్రబాబు చేసిన దీక్షాసభలో మాజీమంత్రి లోకేష్‌ మాట్లాడుతూ తిరిగి తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తానని తొలి విజయం ఇక్కడ నుంచే గెలిచి తన తండ్రికి కానుక ఇస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇందుకు నిదర్శనంగా దుగ్గిరాలలో ఎంపీటీసీ స్థానాల్లో అత్యధిక చోట్ల టీడీపీ విజయకేతనం ఎగురవేయటమేనని ఆనాడు చెప్పారు. దీంతో లోకేష్‌ తిరిగి మంగళగిరి నుంచి పోటీ చేయటం ఖాయమని భావించి జగన్‌ కోటరీ అతని గెలుపునకు అడ్డుకట్ట వేయాలని ఇప్పటి నుంచే వ్యూహం ప్రారంభించింది. పైగా స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి నియోజకవర్గంలో పార్టీ కేడర్‌లో పటు ్టకోల్పోతున్నారని గుర్తించిన పెద్దలు వైసీపీని బలోపేతం చేసేందుకు అవకాశాల కోసం వెతుకుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే పద్మశాలి సామాజికవర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవికి ఎవరూ ఊహించని విధంగా ఎంపిక చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలి సామాజికవర్గం వారు ఎక్కువగా ఉన్నారు. మురుగుడుకు ఎమ్మెల్సీ ఇవ్వటం ద్వారా ఆ సామాజికవర్గాన్ని పూర్తిగా తమ వైపునకు తిప్పుకునేందుకు ఈ ఎత్తు వేశారు.


సభాముఖంగా హామీ ఇచ్చినా..

వాస్తవానికి అసెంబ్లీ అయిన వెంటనే మర్రికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల ప్రచారసభలో స్వయంగా వైఎస్‌ జగనే రాజశేఖర్‌కు సీటు ఇవ్వనందుకు బాధపడాల్సిన పనిలేదని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని కట్టబెడతానని చిలకలూరిపేటలో సభాముఖంగా హామీ ఇచ్చారు. అయితే ఆ అవకాశం మర్రికి కాకుండా ఆనాడు మోపిదేవి వెంకటరమణకు కల్పించారు. ఇక అప్పటినుంచి ఎప్పుడూ ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ వచ్చినా మర్రి పేరు వినిపించటం, చివరకు నిరాశ పరచటం జరుగుతోంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే విడదల రజనితో రాజశేఖర్‌కు ఉన్న విభేదాలే ఆయనకు శాపంగా మారాయా అనే చర్చ కూడా నడుస్తోంది. ఎన్నికల్లో తనకు సంపూర్ణ సహకారం అందించలేదనే ఫిర్యాదు చేయటంతో పాటు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని పలు సందర్భాల్లో ఆమె స్వయంగా సీఎం జగన్‌ను కలిసి ఫిర్యాదు చేయటం జరిగింది. మురుగుడుకు ఇవ్వటంలో వ్యూహంతో పాటు మర్రికి అవకాశం ఇస్తే చిలకలూరిపేటలో వైసీపీలో అంతర్గత విబేధాలు తీవ్రస్థాయికి వెళ్తాయని భావించటం వలనే మర్రికి అవకాశం ఇవ్వలేదనే చర్చ జరుగుతుంది. 

 

వైసీసీ అధిష్టానం మంగళగిరి నుంచి జనసేన రాష్ట్ర కార్యదర్శిగా వున్న చిల్లపల్లి శ్రీనివాసరావు పట్ల ఆసక్తిని కనబరిచిందని సమాచారం. శ్రీనివాసరావు సోదరుడు చిల్లపల్లి మోహనరావు ప్రస్తుతం వైసీపీలో చురుగ్గా ఉంటూ ఆప్కో చైర్మన్‌గా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం మోహనరావు తన సోదరుడు శ్రీనివాసరావుతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని కలిసి తన కుమార్తె వివాహనికి ఆహ్వానిస్తూ శుభలేఖను అందించారు. ఆ సందర్భంలో సీఎం జగన్‌ చిల్లపల్లి శ్రీనివాసరావును పార్టీలోకి ఆహ్వానిస్తూ ఎమ్మెల్సీ పదవిని ఆఫర్‌ చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆదినుంచి తాను జనసేనలో యాక్టివ్‌ ఉంటున్నానని.. పార్టీ కూడా తనను బాగా గుర్తించి కీలక పదవులను అప్పగించినందున తాను జనసేనను వదలిరాలేనని శ్రీనివాసరావు ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారని చెబుతున్నారు. చిల్లపల్లి కుటుంబీకులు కూడ ఈ వార్తలను ధ్రువీకరిస్తున్నారు 


ఉమ్మారెడ్డికి రెండోసారి ఎమ్మెల్సీ..

వైసీపీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అందరూ ఊహించిన విధంగానే రెండోసారి ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉమ్మారెడ్డికి స్థానిక సంస్థల కోటా నుంచి టిక్కెట్‌ ఇవ్వగా అప్పట్లో సంఖ్యాబలం పరంగా రెండో అభ్యర్థిని టీడీపీ నిలబెట్టకపోవడంతో ఉమ్మారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆగస్టు నెలలో ఉమ్మారెడ్ది పదవీకాలం ముగిసింది. దీంతో ఆయనకు రెండోసారి ఎమ్మెల్సీ ఇస్తారని పార్టీ వర్గాలు ఊహించాయి. అందుకు అనుగుణంగానే శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉమ్మారెడ్డి పేరుని ప్రకటించారు. 

Updated Date - 2021-11-13T05:45:32+05:30 IST