పెళ్లే యమపాశమై ..

ABN , First Publish Date - 2021-07-07T07:09:57+05:30 IST

ఎంతెంత చదువులు చదువుకున్నా..

పెళ్లే యమపాశమై ..

జిల్లాలో పెరుగుతున్న వివాహిత హత్యలు 


తిరుపతి సిటీ: ఎంతెంత చదువులు చదువుకున్నా, లక్షల జీతాలు వచ్చే ఉద్యోగాలు చేస్తున్నా, ఒళ్లు హూనమయ్యేలా ఇంటెడు చాకిరీ చేస్తున్నా... చివరికి సూట్‌కేసులో శవాలుగా ఆడవాళ్లు మారాల్సిందేనా? మగవాళ్లను నమ్మిన పాపానికి మరణవేదన అనుభవించాల్సిందేనా? నాయకులు చెప్పే మాటలూ, చేసే చట్టాలూ ఆడవాళ్ల ప్రాణాలు ఎందుకు కాపాడలేకపోతున్నాయి? ఆకాశంలో సగం అవమానాల్లో కూరుకుపోతూ, అన్యాయానికి గురవుతూ, ఆత్మహత్యలు చేసుకుంటూ, హత్యలకూ అత్యాచారాలకూ బలవుతూ ఉండాల్సిందేనా?  ప్రేమించానంటూ వెంటబడి, పెళ్లిచేసుకుని, బిడ్డను కని, భార్య సాఫ్ట్‌వేర్‌ జీతంతో జల్సాగా బతుకుతూ చివరికి నమ్మి వచ్చిన ఆమెను చంపి, సూట్‌కేసులో ఇరికించి, తగలబెట్టేసిన తీరును ఏమనాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి? తిరుపతి నగరంలో వారం కిందట జరిగిన ఈ దుర్మార్గ ఘటన అందరినీ నివ్వెరపరిచింది. మహిళల భద్రతను మరోమారు చర్చకు తెచ్చింది. 


పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం తేవాలని భర్త, అత్తమామలు వేధింపులు మొదలు పెట్టారు. అయినా భరించింది, రెండేళ్లు సహించింది. బిడ్డ పుడితే అయినా కట్టుకున్న భర్త, అత్తమామలు మారుతారని ఆశపడింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయినా మార్పు లేదు. హింస పెరిగింది. పుట్టింటివారికి చెప్పుకోలేక, మెట్టినింట హింసను తట్టుకోలేక, తిరగబడి ఎదిరించలేక ఒక చెట్టుకు శవమై వేలాడింది. ఏడాది కూడా నిండని కొడుకును లోకానికి వదిలి వెళ్లిపోయింది. వారం కిందట రామకుప్పం మండలంలో జరిగిన ఘోరం ఇది.


గడిచిన నెల రోజుల్లోనే జిల్లాలో అధికారికంగా 11 మంది వివాహితలు మరణించారు. వీరిలో అయిదుగురు భర్త చేతిలో హత్యకు గురైనారని ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటనల్లో 14 మంది వరకు చిన్నారులు తల్లులను కోల్పోయి తండ్రులు దూరమై అనాథలుగా మిగిలారు. పోలీసుల దాకా కూడా ఎక్కక, పల్లె పంచాయతీల్లో అణగిపోయిన అన్యాయాలు ఇంకా అనేకం ఉండే ఉంటాయి. 


- చంద్రగిరి మండలం కందులవారిపల్లెకు చెందిన మల్లికార్జున్‌ భార్య మే 29న ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన ఏడాది నుంచే అదనపు కట్నం కోసం వేధించడం వల్లే ఆమె చనిపోయిందని కేసు నమోదైంది.

- పుంగనూరు మండలం మంగళంకు చెందిన శంకర్‌ భార్య జూన్‌ 1న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్ళయి వచ్చిన రెండో రోజు నుంచే ఆమెను తాగొచ్చి భర్త హింసిస్తున్నాడని బంధువులు పేర్కొన్నారు. పెళ్ళై ఏడాది కూడా నిండకనే ఆమె పారాణి ఆరిపోయింది.

- శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లెలో జూన్‌ 5న జరిగిన ఘోరం ఇది. ముప్పయి యేళ్లుగా ఆ భార్యాభర్తలు గొడవలు పడుతూనే ఉన్నారు. మేకలు మేపేందుకు వెళ్లిన సమయంలోనూ గొడవ పెరిగి  భార్యను చంపి బావిలో పడేశాడు భర్త. ఇంటికి వచ్చి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 

- మూడేళ్లు  ఆమె అత్తింటి హింసను భరించింది. పుట్టింటికి వారికి చెప్పి అడిగినంతా తెచ్చి ఇచ్చినా వేధింపులు తగ్గలేదు. దీంతో ఆ వివాహిత గ్రామ సమీపంలోని మామిడి చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. జూన్‌ 27న రామకుప్పం మండలంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.


రాక్షస చర్యలు రాజీలతో సరి

గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న గృహిణుల హత్యలు, ఆత్మహత్యల వెనుక వెలుగు చూడని రాజీ యత్నాలు నేరాలు పెరగడానికి కారణంగా మారుతున్నాయి. పరువు, మర్యాద పేరుతో సర్దేయడానికే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఆడపిల్ల గల వాళ్లు సర్దుకోవాలని చెబుతున్నారు. మరీ గొడవ చేస్తే ఎంతో కొంత డబ్బులో, ఆస్తులో పంచి పంచాయతీ ముగిస్తున్నారు. దీంతో మగదురహంకారులకు భయం లేకుండా పోతోంది.  


చిన్నారులు బలవుతున్నారు

తల్లిదండ్రులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు, క్షణికావేశపు చర్యలకు పర్యవసానం చిన్నారులు అనుభవిస్తున్నారు. భార్యను చంపి భర్త జైలుకు వెళ్లడం, భర్తల, అత్తమామల వేధింపులకు గృహిణులు ఆత్మహత్య చేసుకోవడం వంటి అనేక నేరాల్లో వారి పిల్లలు అనాధలుగా మిగిలిపోతున్నారు. జిల్లాలో గడిచిన 5 ఏళ్లలో జరిగిన పలు సంఘటనల్లో సుమారు 700 మందికిపైగా చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయారని ఇటీవల ఐసీడీఎస్‌ అధికారులు నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. 


చట్టాలు ఎన్ని ఉన్నా..

మహిళలకు రక్షణ కల్పిస్తూ గృహహింస చట్టం, నిర్భయ చట్టంతోపాటు ఏడాది కిందట దిశ చట్టం కూడా అమల్లోకి వచ్చాయి. శారీరకంగా హింసించడం, మాటలతో బాధించడం, మానసికంగా కించపరచడం, ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం వంటి నేరాలకు శిక్షలను ప్రభుత్వం కఠినతరం చేసింది. మహిళలకు రక్షణ, జీవన భృతి, నష్టపరిహారం, పిల్లల ఆధీన ఉత్తర్వులు జారీ చేస్తూ మహిళల హక్కులకు భంగం కలగకుండా చట్టాలు రక్షణ కవచంలా నిలువాలి. అయితే ఆచరణలో ఇవి భరోసా ఇవ్వడంలేదని పెరుగుతున్న కేసులు చెబుతున్నాయి.  


అనర్థాలకు కారణాలివి

 గ్రామీణ ప్రాంతాల్లోనే వివాహిత మహిళల ఆత్మహత్యలు, హత్యలు  ఎక్కువ శాతం   జరుగుతున్నాయి. 

- జిల్లావ్యాప్తంగా నమోదవుతున్న పలు కేసుల్లో వరకట్న వేధింపులే ప్రధాన కారణంగా ఉంటున్నాయి. 

- పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు, ఆధిక సంతానం వంటి పలు కారణాలతో దంపతుల మధ్య వివాదాలు పెరుగుతున్నాయి.

- కొన్ని ప్రేమ వివాహాల్లో కొంత కాలానికి దంపతుల మధ్య అన్యోన్యత సమసిపోతోంది. కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితి, నేరచరిత్ర, అప్పుల వంటి ప్రధానాంశాలను తెలుసుకోకపోవడంతో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి.

- ఆడపిల్లలని చదివించకపోవడం, ఇంటికే పరిమితం చేయడం వంటి చర్యల వలన మహిళల జీవితాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి.


ధైర్యంగా ముందుకు రండి

వేధింపులకు గురయ్యే మహిళలు ధైర్యంగా పోలీసు స్టేషన్ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. లేకపోతే దిశ యాప్‌లోనే ఫిర్యాదు చేయవచ్చు. అందులో ఒక్క బటన్‌ నొక్కితే తక్షణ పరిష్కార మార్గం దొరుకుతుంది. లేకపోతే నెంబరు 100కు డయల్‌ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు. మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. 

- సుప్రజ, తిరుపతి అర్బన్‌ జిల్లా ఏఎస్పీ

 


Updated Date - 2021-07-07T07:09:57+05:30 IST